దళితులను బీఆర్ఎస్ వేధిస్తోంది.. తెలంగాణలో అధికారంలోకి వస్తామని మాయావతి ధీమా

దళితులను బీఆర్ఎస్ వేధిస్తోంది.. తెలంగాణలో అధికారంలోకి వస్తామని మాయావతి ధీమా
  • బీఎస్పీతోనే బహుజనులకు న్యాయం: మాయావతి

పెద్దపల్లి, వెలుగు: బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీగా మారిందని, రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్​ఏర్పడిన తర్వాత దళితులపై కేసులు పెట్టి వేధిస్తున్నదని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి విమర్శించారు. ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు పేదరికంలోనే మగ్గుతున్నాయని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన సభలో ఆమె మాట్లాడారు. బీఎస్పీ అధికారంలోకి వస్తేనే బహుజనులకు న్యాయం జరుగుతుందని, అంబేద్కర్, కాన్షీరాం ఆశయాలు నెరవేరుతాయని చెప్పారు. తెలంగాణలో బీఎస్పీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని, సీఎంగా ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్ ప్రమాణస్వీకారం చేస్తారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దేశాన్ని ప్రజావ్యతిరేక ప్రభుత్వాలే పాలించాయని, వారి పాలనలో బలహీనవర్గాలు మరింత వెనుకబడ్డాయన్నారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వాలు మొదటినుంచి ప్రైవేటీకరణ చేపడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని తెలిపారు. జాతీయస్థాయిలో కులగణన చేయడానికి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చొరవ చూపలేదని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలకు ఉపయోగపడే కాకా కాలేర్కర్, మండల్ కమిషన్ రిపోర్టులను మూలకు పడేశారన్నారు. తెలంగాణలో అన్ని సామాజికవర్గాలకు బీఎస్పీ టిక్కెట్లు ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్​చాలా కాలం దేశాన్ని పాలించినా బహుజనులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఉత్తర్‌‌‌‌ప్రదేశ్​లో బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన అందించామన్నారు. తెలంగాణలో కూడా బీఎస్పీ సర్కార్ వస్తే అలాంటి పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.

డప్పులు కొట్టిన చేతులు డాలర్లు సంపాదించాలి: ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్​

‘డప్పులు కొట్టిన చేతులు డాలర్లు సంపాదించాలి, కూలీ కుటుంబాల్లో కూలీలు పుట్టగూడదు, బతుకు దెరువు కోసం వలస పోకుండా చూడాలి, కల్లు గీచిన చేతులు కంప్యూటర్లు ఆపరేట్ చేయాలి.. ఆ రోజులు వచ్చిన నాడే సంపూర్ణ అభివృద్ధి జరిగినట్టు’ అని బీఎస్పీ స్టేట్​ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌‌కుమార్ అన్నారు. మాయావతి ఆశీర్వాదంతో ఇప్పుడిప్పుడే బహుజనులు ఎమ్మెల్యేలుగా నిలబడుతున్నారని, వారిని ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలన్నారు.