రాజకీయ హత్యలు.. అంతా మా ఇష్టం.. అడ్డొస్తే లేపేస్తాం

రాజకీయ హత్యలు.. అంతా మా ఇష్టం.. అడ్డొస్తే లేపేస్తాం

రాజకీయ హత్యలు
అంతా మా ఇష్టం.. అడ్డొస్తే లేపేస్తాం
ప్రాణాలు తీస్తున్న భూ దందాలు
తెలంగాణ పల్లెల్లో ఫ్యాక్షన్ కల్చర్
అధికార పార్టీ నాయకులదే కీ రోల్!

 

హైదరాబాద్ : తెలంగాణ పల్లెల్లో రక్తం ఎరులై ప్రవహిస్తోంది. ఇటీవలి కాలంలో జరిగిన మూడు హత్యల వెనుక భూ దందాలే ప్రధానంగా ఉండటం విస్తుగొలిపిస్తోంది. భూ కబ్జాలు, తప్పుడు డాక్యుమెంట్ల సృష్టి పెరిగిపోయాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్యను ఓ సుపారీ గ్యాంగ్ మట్టు పెట్టి నీటి గుంతలో పడేయటం వెనుక బీఆర్ఎస్ కు చెందిన జెడ్పీ వైస్ చైర్ పర్సన్ భర్త అంజయ్య ఉండటం గమనార్హం. అంతకు ముందు 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల మండలం హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో ఓ డాక్యుమెంట్ రైటర్ ను చంపేశారు.

కిడ్నాప్ చేసి తీసుకెళ్లి చంపి ఆస్పత్రిలో డెడ్ బాడీ అప్పగించి వెళ్లారు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన ఓ కుటుంబం కామారెడ్డిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకుంది. తమ చావుకు బీఆర్ఎస్ నేత, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ తో పాటు పలువురు కారణమంలూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసి బలవన్మరణానికి పాల్పడింది. వరుస పరిణామాలన్నింటిలోనూ బీఆర్ఎస్ నాయకులు, వారి బంధువులదే కీలక పాత్ర ఉండటం గమనార్హం. 

బచ్చన్నపేటలో రిటైర్డ్ ఎంపీడీవో హత్య

భూముల వివాదం ఓ రిటైర్డ్ ఎంపీడీవోను పొట్టన పెట్టుకుంది. రెండు రోజుల క్రితం జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన విశ్రాంత ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య ఈ నెల 15న అపహరణకు గురయ్యారు. అదే రోజు ఆయన కుమారుడు అశోక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం జనగామ మండలం చంపక్‌హిల్స్‌లోని ఓ మూతపడ్డ క్రషర్‌ వద్ద నీటి గుంటలో రామకృష్ణయ్య శవమై తేలారు.

ఈ హత్యలో జనగామ జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి భర్త అంజయ్య ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. రామకృష్ణయ్య ఆర్‌టీఐ కార్యకర్తగా ప్రజలపక్షాన నిలుస్తారనే పేరుంది. ఇదిలా ఉండగా అంజయ్య బచ్చన్నపేటలో 174 సర్వే నంబరులో 8.50 ఎకరాల్లో వెంచర్‌ చేసి పలువురికి విక్రయించే పనిలో ఉన్నారు. గమనించిన రామకృష్ణయ్య.. అది పక్కా ప్రభుత్వ భూమి అని కోర్టును ఆశ్రయించి అంజయ్యకు నోటీసులు పంపించారు. దీనిపై రెండేళ్లుగా ఇద్దరి మధ్య వైరం జరుగుతోంది. రామకృష్ణయ్యను హత్య చేయించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

డాక్యుమెంట్ రైటర్ మర్డర్

రంగారెడ్డి జిల్లా కొత్తూరుకు చెందిన డాక్యుమెంట్ రైటర్ మామిడి కరుణాకర్ రెడ్డి (29) ఈ ఏడాది ఏప్రిల్ 17న కిడ్నాప్ కు గురయ్యారు. అదే రోజు రాత్రి 9.30 గంటలకు శవమయ్యాడు. కరుణాకర్ రెడ్డి గతంలో మధుసూదన్ రెడ్డి దగ్గర పీఏగా కొన్నాళ్లు పనిచేశారు. తర్వాత కొత్తూరులో డాక్యుమెంట్ రైటర్ షాప్ పెట్టుకున్నారు. ఎంపీపీ తనకు సంబంధించిన భూమి వ్యవహారాలు, లిటిగేషన్ ల్యాండ్ వ్యవహారాలు కరుణాకర్ వద్దనే కొనసాగించారు. ఈ క్రమంలో గతేడాది ఒక భూమికి సంబంధించిన విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి.

ఇరువురు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న సాయంత్రం 5.30 గంటలకు కరుణాకర్ రెడ్డిని ఎంపీపీ మధుసూదన్ రెడ్డి సోదరులు విక్రమ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, డ్రైవర్ ఆరిఫ్, అరుణ్ కుమార్ రెడ్డి కరుణాకర్ రెడ్డిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. అదే రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్​ఆస్పత్రిలో శవాన్ని అప్పగించి వెళ్లారు. 

కుటుంబం ఆత్మహత్య

ఏప్రిల్ 16, 2022 తెల్లవారు జామున కామారెడ్డిలోని ఓ లాడ్జీలో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు వారు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన సంతోష్, తల్లి పద్మ బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పు తీసుకున్న పాపానికి వ్యాపారంలో 50 శాతం వాటా ఇవ్వాలని మున్సిపల్ చైర్మన్ వేధిస్తున్నారని, ఇదేంటని ప్రశ్నిచేందుకు వెళ్తే సీఐ దబాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ చావుకు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తోపాటు ఐరెని పృథ్వి రాజ్ అలియాస్ బాలు, రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, తోట కిరణ్, కన్నా పురం కృష్ణా గౌడ్, సరాఫ్​ స్వరాజ్, అప్పటి సీఐ నాగార్జున గౌడ్ కారణమని, తమను చాలా వేధింపులకు గురి చేశారని వారు పేర్కొన్నారు. ఈ ఘటన కలకలం రేపింది. 

వామన్ రావు దంపతుల హత్య

2021 ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 2 గంటలకు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద 2.30 గంటల ప్రాంతంలో హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు, నాగమణి హత్య జరిగింది. తన ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాడని, మంథనిలో జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధును ఇబ్బందులకు గురి చేస్తున్నాడనే కసితో వామన్‌రావును హతమార్చాలని టీఆర్ఎస్ నాయకుడు కుంట శ్రీనివాస్‌ కొంతకాలంగా వేచి చూస్తున్నాడు.

గుంజపడుగులో గుడి వివాదం నేపథ్యంలో పిటిషన్ దాఖలు చేయడానికి వచ్చిన న్యాయవాద దంపతులపై దాడి చేసి చంపేయడం రెండేళ్ల క్రితం కలకలం రేపింది. కుంట శ్రీనివాస్ తో పాటు మరో ముగ్గురు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో నిందితుడిగా బీఆర్ఎస్ నేత పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను ఉండటం గమనార్హం.