లీడర్ల కోసం కాదు.. సాగునీటి కోసం గేట్లు తెరవాలి: హరీశ్ రావు

లీడర్ల కోసం కాదు.. సాగునీటి కోసం గేట్లు తెరవాలి: హరీశ్ రావు

పాలకుర్తి(దేవరుప్పుల), వెలుగు: రాజకీయ పార్టీల నాయకుల కోసం కాకుండా.. పంటలకు అందించే సాగునీటి కోసం సీఎం రేవంత్​రెడ్డి గేట్లు తెరవాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చింతబాయి తండాలో ఎండిపోయిన వరి పొలాలను మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాథోడ్​తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. నీళ్లు లేక పంటలు ఎండిపోయిన రైతులందరికీ వెంటనే ఎకరానికి రూ. 25 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్​రెడ్డి, మంత్రులు హైదరాబాద్​లో రాజకీయాలు మానుకుని పొలాలకు వచ్చి రైతులకు ఆత్మవిశ్వాసం కల్పిస్తే బాగుంటుందని చెప్పారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే రాష్ర్టంలో180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు చనిపోతుంటే కనీసం పరామర్శించడానికి వెళ్లని సీఎం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్​లో చేర్చుకోవడానికి మాత్రం వాళ్ల ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారు” అని హరీశ్ రావు ఆరోపించారు. పొలాలను పరిశీలించినవారిలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జడ్పీటీసీ పల్లా సుందర్​ రాంరెడ్డి, ఎంపీపీ బస్వ మల్లేశ్ సావిత్రి తదితరులు ఉన్నారు.