హిల్ట్ పాలసీతో భూ కుంభకోణానికి కుట్రలు..పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో బీఆర్ఎస్ నాయకుల నిరసన

హిల్ట్ పాలసీతో భూ కుంభకోణానికి కుట్రలు..పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో బీఆర్ఎస్ నాయకుల నిరసన

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: హిల్ట్​పాలసీ పేరుతో పరిశ్రమల భూములను రియల్​ వ్యాపారులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఈ పాలసీతో రూ. 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి రేవంత్ ప్రభుత్వం తెర లేపిందని కరీంనగర్​ ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ ఆరోపించారు. గురువారం పటాన్​చెరు పరిధిలోని పారిశ్రామిక వాడలో హిల్ట్ పాలసీకి నిరసనగా బీఆర్ఎస్​ నాయకులు ధర్నా, ర్యాలీ నిర్వహించారు. 

మాజీ మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు బీఆర్​ఎస్​ కోఆర్డినేటర్​ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్​ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి గంగుల కమలాకర్​తో పాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్​, మాణిక్​ రావు ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.

 వారు మాట్లాడుతూ.. పటాన్​చెరు, పాశమైలారం ఇండస్ట్రియల్​ ఏరియాల్లోని దాదాపు 2700 ఎకరాలను రియల్​ వ్యాపారులకు అప్పగించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రస్తుతం నడుస్తున్న పారిశ్రామిక వాడలను తరలిస్తే లక్షలాది మంది కార్మికులు నిరుద్యోగులై రోడ్డున పడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కాలుష్యం పేరుతో కాలుష్య రహిత పరిశ్రమలను సైతం ప్రభుత్వం బలవంతపు తరలింపునకు సిద్ధమవుతోందని ఆరోపించారు. ఇంకా కోర్టుల్లో పోరాడుతున్న రైతులకు న్యాయం జరిగేలా చూసి, కొనుగోలు చేసిన భూములకు 50 శాతం తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. 

వెంటనే హిల్ట్ పాలసీని రద్దు చేసి పారిశ్రామిక భూములను కాపాడేలా చూడాలని, పాలసీని అమలు చేయాలని చూస్తే బీఆర్ఎస్ ప్రజా ఆందోళనలు చేపడుతుందని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్​ చైర్మన్​ శివకుమార్​, మాజీ బెవరేజస్​ చైర్మన్ దేవి ప్రసాద్, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్​ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేటర్ మెట్టు కుమార్​ యాదవ్​, మాజీ జడ్పీటీసీ బాల్ రెడ్డి, మాజీ సర్పంచ్​ సోమిరెడ్డి పాల్గొన్నారు.