రూ.100 కోట్లతో విద్యానిధి ఏర్పాటు చేస్తా : వెంకట్రామిరెడ్డి

రూ.100 కోట్లతో విద్యానిధి ఏర్పాటు చేస్తా : వెంకట్రామిరెడ్డి

రామాయంపేట, కౌడిపల్లి, వెలుగు: తనను గెలిపిస్తే 30 రోజుల్లో పేద విద్యార్థుల కోసం రూ.100 కోట్లతో విద్యానిధి ఏర్పాటు చేస్తానని బీఆర్‌‌‌‌ఎస్‌‌ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. ఆదివారం రామాయంపేట, కౌడిపల్లిలో మండలాల్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జిల్లాతో తనకు11 ఏళ్ల అనుబంధం ఉందని,  ప్రాజెక్ట్​ డైరెక్టర్​గా, జాయింట్​ కలెక్టర్, కలెక్టర్​గా నిజాయతీగా ప్రజలకు సేవ చేశానని చెప్పారు.  

ఇక్కడి ప్రజల  సమస్యలు, బాధలు  తనకు బాగా తెలుసని, మరింత సేవ చేసేందుకు  అవకాశం ఇవ్వాలని కోరారు.  మెతుకు సీమ మట్టే తనకు కలెక్టర్‌‌గా గుర్తింపు ఇచ్చిందని, తన చావు కూడా ఈ గడ్డ మీదనే ఉంటుందని స్పష్టం చేశారు.  తనను ఎంపీగా గెలిపిస్తే విద్యానిధి ఏర్పాటుతో పాటు  మెదక్ లోకసభ సెగ్మెంట్‌‌లోని అన్ని నియోజకవర్గాల్లో రూ.14 కోట్లతో  ఫంక్షన్​ హాళ్లు నిర్మించి ప్రజలకు  ఉచితంగా ఇస్తామన్నారు.  నిరుద్యోగుల కోసం స్కిల్‌‌ డెవలప్‌‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని చెప్పారు.

పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి  మాట్లాడుతూ..  వెంకట్రామిరెడ్డి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిపోయిన వారిని కించపరచడం సరికాదన్నారు. నర్సాపూర్​ ఎమ్మెల్యే  సునీతా లక్ష్మారెడ్డి  మాట్లాడుతూ జిల్లా గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి వెంకట్రామిరెడ్డి అని, ఆయన గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు వెంకట్రామిరెడ్డి, సునీతారెడ్డి తునికి నల్ల పోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు.  ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, సీనియర్‌‌ నేత కంఠా రెడ్డి తిరుపతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, పట్టణ ప్రెసిడెంట్ నాగరాజు ఉన్నారు.