దశాబ్ధిలోకి తెలంగాణ.. అణచివేత.. నిర్బంధం

దశాబ్ధిలోకి తెలంగాణ.. అణచివేత.. నిర్బంధం
  • బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలన ఇదే..
  • ప్రశ్నించే గొంతులను  నొక్కుతున్నరు 
  • ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలపై ఉక్కుపాదం

2014లో ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో ‘చట్టబద్ధ పాలన – పౌర హక్కులు’ అనే అంశాన్ని బీఆర్ఎస్ ప్రస్తావించింది. ‘‘ప్రజాస్వామికమైన కార్యక్రమాలు ఎవరు చేపట్టినా, వారికి ఎలాంటి అవరోధం లేని విధంగా.. వారి హక్కులను కాపాడే విధంగా పరిపాలన ఉంటుంది. ప్రజలు శాంతియుతంగా అహింస మార్గంలో ఉద్యమించే హక్కు అమలయ్యే వాతావరణం కల్పిస్తాం’’ అని అందులో పేర్కొంది. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినంక.. ఈ తొమ్మిదేండ్లలో అది నిజంగా పాటించిందా? అంటే అస్సలు పాటించలేదు. అడుగడుగునా అణచివేత, నిర్బంధం కొనసాగిస్తున్నది. సమస్యలపై ప్రశ్నిస్తే, నిరసన తెలిపితే, ఆందోళన చేపడితే, ధర్నాలు చేస్తే అడ్డుకుంటున్నది. ఒక మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ పాలనంతా ఎమర్జెన్సీని తలపిస్తున్నది. ప్రజలకు హక్కులే లేకుండా పోయాయి. ప్రభుత్వం పోలీసులను వాడుకుంటూ ప్రజాసంఘాలపై, ప్రతిపక్షాలపై నిర్బంధం కొనసాగిస్తున్నది. చివరికి మీడియాపైనా ఆంక్షలు పెట్టింది. ఫేక్ ఎన్ కౌంటర్లు కొనసాగిస్తూ గత ప్రభుత్వాల విధానాలనే అనుసరిస్తున్నది. రాష్ట్రం వచ్చినంక లాకప్ డెత్స్ కూడా పెరిగిపోయాయి. 

ఆగని ఎన్ కౌంటర్లు.. 

2014 డిసెంబర్ లో మా సంస్థ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్​ను కలిసినం. గతంలో ప్రభుత్వ ఆదేశాలతో పోలీస్ శాఖ అమలు చేసిన నిర్బంధం గురించి వివరించినం. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఎన్ కౌంటర్లు జరిగాయన్న వివరాలను గణాంకాలతో సహా అందించాం. ఇక తెలంగాణలో ఎన్ కౌంటర్ హత్యలు, లాకప్ మరణాలు ఉండొద్దని అభ్యర్థించాం. అలాంటి రాజకీయ పాలనా విధానాన్ని ప్రకటించాలని కోరాం. సీఎం మా ముందే పొలిటికల్ సెక్రటరీని పిలిచి ఈ అంశాలను పరిశీలించి తగు సూచనలు చేయాలని ఆదేశించారు. కొద్ది రోజుల తర్వాత మా పిటిషన్ లోని అంశాలను పరిశీలిస్తున్నామని సీఎం పొలిటికల్ సెక్రటరీ నుంచి ఉత్తరం కూడా వచ్చింది. కానీ 2015 మేలో శృతి, సాగర్ ను ఏటూరు నాగారం దగ్గర గోవిందరావుపేట మండలంలోని అడవిలో ఎన్ కౌంటర్ పేరుతో హత్య చేసి.. ఎన్ కౌంటర్ హత్యలు కొనసాగుతాయని ప్రభుత్వం మాకు అభ్యర్థనకు స్పందనను తెలియజేసింది. శృతి, సాగర్ హత్యలతో తెలంగాణలో ప్రారంభమైన ఎన్ కౌంటర్ల నుంచి మొదలుకొని ఇప్పటికీ మా సంస్థ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 46 మంది తెలంగాణ పోలీసుల చేతుల్లో హత్యకు గురయ్యారు. శృతి, సాగర్ ఎన్ కౌంటర్లపై తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున నిరసనలు తెలిపింది.

గత ప్రభుత్వాల పాలనలో తెలంగాణ గ్రామాల్లో ఎన్ కౌంటర్లలో రక్తం ఏరులై పారిందని ఉపన్యాసాల్లో గర్జించిన కేసీఆర్.. పాత పద్ధతిలోనే ఎన్ కౌంటర్లతో తెలంగాణలో రక్తాన్ని పారించారు. 2019 ఆగస్టులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దేవులగూడెంలో న్యూడెమోక్రసీ పార్టీ కార్యదర్శి లింగన్నను పట్టపగలే గ్రామస్తుల ముందే కాల్చి చంపారు. 2017 డిసెంబర్ లో సీపీ బాట అనే పేరుతో ఏర్పడిన చిన్న నక్సలైట్ గ్రూపునకు చెందిన 8 మందిని భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా టేకులపల్లి వద్ద ఎన్ కౌంటర్ చేశారు. వీళ్లలో ఐదుగురు లంబాడీలు, ముగ్గురు ఆదివాసీలు ఉన్నారు. ఎన్ కౌంటర్ల విషయంలో గత ప్రభుత్వాలు అనుసరించిన పద్ధతినే తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నది. భవిష్యత్తులోనూ అదే పద్ధతి అనుసరిస్తుందని అనుకోక తప్పదు. 

మీడియాపైనా ఆంక్షలు..  

కేసీఆర్ పాలనలో మీడియాపైనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన వీ6 చానల్ ను, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగతుడున్న, ప్రజల సమస్యలను చర్చకు పెడుతున్న వెలుగు పేపర్ ను బ్యాన్ చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటూ మరికొన్ని మీడియా సంస్థలపైనా నిషేధం విధించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తీన్మార్ మల్లన్నను జైల్లో పెట్టి, ఆయన ఆఫీసుపై దాడి చేశారు. 

ప్రశ్నిస్తే బీఆర్ఎస్ లీడర్ల దాడులు 

మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లీడర్లను జనం ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు. రెండు నెలల కింద వనపర్తి జిల్లా మణిగిరికి చెందిన శివ యాదవ్ వ్యవసాయ శాఖ మంత్రిపై వాట్సాప్ లో ఆరోపణలు చేశాడనే నెపంతో.. వనపర్తి సీఐ ఆ యువకుడిని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టాడు. అసలు శివయాదవ్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా అందలేదు. విచారణ కూడా చేయకుండా విచక్షణారహితంగా కొట్టారు. ఇలాంటి ఘటనలు అన్ని జిల్లాల్లో జరుగుతూనే ఉన్నాయి. అధికార పార్టీ లీడర్లను ప్రశ్నించినా, విమర్శించినా వాళ్ల అంతుచూడాలని పోలీసులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నట్లు తెలుస్తున్నది. గ్యాంగ్ స్టర్ నయీం ఆగడాలపై విచారణకు వేసిన సిట్ నివేదిక, ఆలేరు దగ్గర ఏడేండ్ల కింద జరిగిన వికారుద్దీన్ సహా నలుగురి ఎన్ కౌంటర్ పై నివేదిక ఏమైందో ప్రభుత్వం ఇప్పటికీ చెప్పలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసుల పనితీరును మెరుగుపరచడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి.  ‘ఫ్రెండ్లీ పోలీస్’ అనే కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు. కానీ పోలీసుల పని విధానంలో ఆశించినంత మార్పు రాలేదు. ఇంకా ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. బాధితులు వెళ్లిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం లేదు. ఇప్పటికీ అధికార పార్టీ అవసరాలు, లీడర్ల సంక్షేమం కోసం పని చేస్తున్నారు. పోలీసుల అండతో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు బలహీనులపై జులుం ప్రదర్శిస్తున్నారు. 

వీటికి జవాబు చెప్పాలె.. 

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ప్రభుత్వం నిజంగా చట్టబద్ధంగా పాలిస్తున్నదా? పేదల హక్కులను రక్షించే మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, లోకాయుక్త లాంటి సంస్థలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నది? పోలీస్ కంప్లయింట్ అథారిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు, హైకోర్టు  ఆదేశించినా ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? ఇప్పటికైనా రాష్ట్రంలో ఫేక్ ఎన్ కౌంటర్లు ఉండవని ప్రభుత్వం చెప్పగలదా?  చట్టబద్ధంగా పనిచేయాలని పోలీసులను ఆదేశించగలదా? ఈ అంశాలన్నింటిపైనా సమీక్ష జరగాల్సిన అవసరం ఉన్నది. 

ప్రజాసంఘాలపై నిర్బంధం.. 

రాష్ట్రం ఏర్పడిన ప్రారంభంలోనే కొన్ని సంస్థలపై, ప్రజా సంఘాలపై తీవ్ర నిర్బంధం అమలు చేశారు. పొలిటికల్ జేఏసీ, ఎమ్మార్పీఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక, తెలంగాణ విద్యార్థి వేదిక, విరసం, పౌరహక్కుల సంఘం, న్యూ డెమోక్రసీ పార్టీకి చెందిన ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక పద్ధతిలో ధర్నాలు, నిరసనలు చేపడితే అనుమతించలేదు. ‘ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక’ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించాలని చూస్తే, దానికి పోలీసులు తాళం వేశారు. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ జరగలేదు. సభకు వస్తున్న వాళ్లను నగరంలోనే కాకుండా అన్ని జిల్లాల్లో బస్సుల్లోంచి, రైళ్లలో నుంచి బయటకు లాగి దించివేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక 2016లో వరంగల్ లో సభ నిర్వహించేందుకు ప్రయత్నిస్తే, పోలీసులు ఆ సభకు ఇచ్చిన అనుమతిని రద్దు చేసి.. అక్కడికి వచ్చినోళ్లను అరెస్టు చేశారు. రెండేండ్ల కింద ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో సెమినార్లు కూడా అడ్డుకుని విద్యార్థులను అరెస్టు చేశారు. కేంద్ర సంస్థలు ప్రజా సంఘాల నేతల ఇండ్లపై దాడి చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మేం హోంమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినా అది రాష్ట్ర విషయం కాదని తప్పించుకున్నారు. 

హక్కులను  తుంగలో తొక్కుతున్నది

రాష్ట్రంలో పరిస్థితులపై ఎవరు ప్రశ్నించినా ప్రభుత్వం వాళ్లపై విరుచుకుపడుతున్నది. 2015లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అభివృద్ధి పథకాలను ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వాళ్లంతా అభివృద్ధి నిరోధకులు. వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తరు. అలాంటోళ్ల మాటలను రాసే మీడియాను పాతాళంలోకి తొక్కుతం” అని బెదిరించారు. ప్రశ్నించేటోళ్లను అణచివేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో వ్యక్తులు గానీ, సంఘాలు గానీ ఏ చిన్న నిరసన సభ, సమావేశం తలపెట్టినా పోలీసులు అణచివేస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఒక మౌలికమైన అంశం, హక్కు అన్న విషయాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కింది.

ఒక కొత్త ఆలోచనను, ప్రత్యామ్నాయ సూచనలను, పాలన విధానంలో మార్పు లాంటి అంశాలు ప్రభుత్వం ఎప్పుడూ సహించలేదు. ఏ సంస్థది అయినా, ఏ వ్యక్తిదైనా నోరు మూయించడానికి ప్రభుత్వం అణచివేత, నిర్బంధ పద్ధతులను ఆయుధాలుగా వాడుకుంది. గత తొమ్మిదేండ్లలో తమ సమస్యలపై ఆందోళనకు దిగిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను, కమీషన్ పెంచాలన్న రేషన్ డీలర్లను, భూనిర్వాసితులను, ఆదివాసీలను, విద్యార్థులను, నిరుద్యోగులను, చివరికి రైతులను... ఇలా ఎవరు నిరసన తెలిపినా పోలీసులతో అణచివేసింది. రైతులపై లాఠీచార్జీ చేయించడంతో పాటు బేడీలు వేయించింది. ప్రభుత్వం వ్యతిరేక వార్తలు రాస్తున్నారని జర్నలిస్టులపై కూడా కేసులు పెట్టారు. ప్రొఫెసర్ కోదండరాం పార్టీ పెట్టి ప్రజల్లోకి పోతున్నారని ఆయనపై దాదాపు 30కి పైగా కేసులు బనాయించారు. కొన్ని వందలసార్లు ఆయనను నిర్బంధించారు.

ఒక్కటా రెండా... ఎన్నో ఘటనలు

  • 2018లో ధర్నా చౌక్ దగ్గర ధర్నాలకు అనుమతి లేదని పాలకులు ఆదేశాలు ఇచ్చారు. చివరకు కోర్టు చెప్పడంతో దిగొచ్చారు. కానీ ఇప్పటికీ ఆంక్షలు విధిస్తూనే ధర్నాలకు అనుమతి ఇస్తున్నారు. 
  • 2021లో విరసం సహా 16 ప్రజా, హక్కుల సంఘాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. కోర్టులో కేసు వేస్తే నాలుగు నెలల తర్వాత నిషేధం ఎత్తివేసింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏ జిల్లాకు వెళ్లినా.. ఆ జిల్లాలోని ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సీఎం ఓసారి వరంగల్ లో హెలికాప్టర్ లో వెళ్తే ప్రజలను కింద రోడ్డుపై నుంచి నడవనివ్వలేదు. 
  • సీఎం యాదాద్రికి వెళితే రామగిరి మండలంలోని ప్రజలు గ్రామాల నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు వెళ్లి.. వాళ్ల ఇండ్ల ముందు నిలబడుతున్నారు. ప్రభుత్వం తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డును ఈ గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తుండడంతో వాళ్లను అణచివేస్తున్నారు. 
  • నాలుగేండ్ల కింద నాంపల్లిలో టీఎన్జీవో హాల్ లో విద్యా సమస్యలపై డీటీఎఫ్ సదస్సుకు ఏర్పాట్లు చేసుకుంటే పోలీసులు హాలుకు తాళం వేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ తో దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనలో హరగోపాల్ అంగీ చినిగిపోయింది. 
  • విద్యా పరిరక్షణ యాత్ర ప్రారంభోత్సవానికి చుక్క రామయ్య వెళ్తే.. పోలీసులు ఆ యాత్రకు అనుమతి లేదని రామయ్య సార్ ను బలవంతంగా ఆపి నెట్టడంతో ఆయన రోడ్డుపై పడిపోయారు.

13 లాకప్ డెత్​లు

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ లో చనిపోయిన చిరంజీవి వరకు రాష్ట్రంలో 13 లాకప్ డెత్స్ జరిగాయి. భువనగిరి జిల్లా అడ్డగూడూరులో జరిగిన మరియమ్మ లాకప్ డెత్ ఘటనలో మాత్రమే విచారణ జరిపి బాధిత కుటుంబానికి కొంత పరిహారం అందించారు. మిగతా కేసుల్లో తూతూమంత్రంగా విచారణ జరిపించి మూసేశారు. బాధ్యులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోలేదు. శాఖాపరంగా కొన్ని సంఘటనలలో అధికారులను బదిలీ చేయడమో, అటాచ్ చేయడమే చేశారు. నాలుగు కేసుల్లో పోలీసులు కొంత డబ్బును కుల సంఘాల నాయకుల ద్వారా బాధిత కుటుంబాలకు అందజేసి విచారణ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. గత నెలలో వడ్డెర కులానికి చెందిన చిరంజీవి లాకప్ డెత్ విషయంలోనూ కుల నాయకులను పిలిపించి సెటిల్మెంట్ చేశారు. ఈ కేసును కోర్టు సుమోటో స్వీకరించి న్యాయ విచారణకు ఆదేశించింది. పోలీసులు ముందుగానే డబ్బుల ద్వారా న్యాయం చేశారు.

కాబట్టి న్యాయం చెప్పడానికి హైకోర్టుకు ఇంకా ఈ కేసులో న్యాయం మిగిలి లేదు. లాకప్ డెత్ జరిగినప్పుడు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ తో విచారణ జరిపించాలి. కానీ ప్రభుత్వాలు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశిస్తున్నాయి. అంటే ఆర్డీఓ పోలీసులు చెప్పినట్టు వింటాడు కాబట్టి ఆయనతో విచారణ జరిపించి కేసులు మూసివేయిస్తున్నారు.

 

 

 

 

 

 

- ఎస్.జీవన్ కుమార్,  మానవ హక్కుల వేదిక