ట్రైనింగ్​ సెంటర్​ భూమిని ఈద్గాకు ఎట్లిస్తరు.. హోం మినిస్టర్​ను అడ్డుకున్న  బీజేపీ కార్యకర్తలు 

ట్రైనింగ్​ సెంటర్​ భూమిని ఈద్గాకు ఎట్లిస్తరు.. హోం మినిస్టర్​ను అడ్డుకున్న  బీజేపీ కార్యకర్తలు 

నిర్మల్, వెలుగు: నిర్మల్ లో  ఈద్గా ను ప్రారంభించేందుకు మంగళవారం వచ్చిన హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  కాన్వాయ్ ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానిక కలెక్టరేట్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కాన్వాయ్​కి అడ్డుగా దూసుకొచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే బీజేపీ ఆఫీస్ వద్ద నాయకులు బయటకు రాకుండా నిలిపివేశారు.

బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రామనాథ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు మెడిసిమ్మరాజు, రాజేశ్వర్ రెడ్డి, అంజు కుమార్ రెడ్డి, అల్లం భాస్కర్, కమల్ నయన్, కరిపె విలాస్ తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం స్థలాన్ని, ఈద్గా నిర్మాణానికి కేటాయించడం, నిధులను మంజూరు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ కేటాయింపుల ప్రక్రియ జరిగిందన్నారు. కాగా మహేశ్వర్ రెడ్డి ఇంటివద్ద కూడా పోలీస్ లు గస్తీ కాసీ జడ్పీటీసీ రమణారెడ్డి, డీసీసీ  మాజీ ప్రెసిడెంట్ ముత్యం రెడ్డి ని అడ్డుకున్నారు.

మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యం: హోం మంత్రి మహమూద్ అలీ

రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్య మిస్తోందని హోం మంత్రి మెహమూద్ అలీ పేర్కొన్నారు. మంగళవారం చించోలి బీ వద్ద ఈద్గాను అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి మెహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్ లో కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. షాదీ ముబారక్ లాంటి పథకం దేశంలో ఎక్కడా కూడా అమలు కావడం లేదన్నారు.

మైనార్టీలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు పలు పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పా టు చారిత్రాత్మకమన్నారు. అన్ని రంగాల్లో మైనార్టీలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందరికీ రంజాన్ పండగను పురస్కరించుకొని ప్రత్యేక బహుమతులను కూడా అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పి చైర్ పర్సన్ విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, మైనార్టీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.