పాలమూరుపై బీఆర్ఎస్ నేతలు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పాలమూరుపై బీఆర్ఎస్ నేతలు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ప్రాజెక్టు సోర్సును శ్రీశైలానికి మార్చడం వల్లే అడ్డంకులు: ఉత్తమ్​
  • ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రాజెక్టు పనులపై రివ్యూ

హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్​నేతలు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని, ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్​హయాంలో ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయని తెలిపారు.

మంగళవారం సెక్రటేరియెట్​లో ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన రివ్యూ చేశారు. డిస్ట్రిబ్యూటరీ నెట్ వర్క్ కోసం టెండర్లు పిలిచినా ఫలితం లేకుండా పోయిందని, కాల్వల కోసం కనీసం భూసేకరణ చేయకుండానే గత ప్రభుత్వం టెండర్లను పిలిచిందన్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని సూచించారు. చెరువుల్లో పూడికతీతను వేగవంతం చేయాలని, కాల్వలకు ఏవైనా రిపేర్లు ఉంటే వానాకాలం ప్రారంభమయ్యేలోగా చేయాలని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఫేజ్–1లో భాగంగా నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 1,226 గ్రామాలకు తాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉందని స్పష్టం చేశారు. కరువు ప్రాంతమైన పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.

పాలమూరు ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. దేవాదుల, ఎస్ఎల్​బీసీ, సీతారామ ప్రాజెక్టుల మాదిరిగానే దీన్ని కూడా ప్రాధాన్యాంశంగా తీసుకున్నామని అన్నారు. బీఆర్ఎస్​పదేండ్ల పాలనలో ఈ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. జూరాల ప్రాజెక్టులో పూడికపైనా ప్రత్యేక దృష్టి పెట్టామని, డ్యామ్​రిహాబిలిటేషన్​అండ్​ఇంప్రూవ్​మెంట్ ప్రాజెక్టు(డ్రిప్) కింద కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు.