
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సపోర్టుగా ఎన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ నేతలు ఆయనను పట్టించుకునే పరిస్థితుల్లో లేరని రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి అన్నారు. తన్నీరుకు చివరకు మిగిలేది కన్నీరేనని ఆయన ఎద్దేవా చేశారు.
శుక్రవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సొంత పార్టీ నేతలే తనను పట్టించుకోవడం లేదని హరీశ్ రావు తెగ హైరానా పడిపోతున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిపై ఎన్ని విమర్శలు చేసినా బీఆర్ఎస్ లో ఆయనకు ఆదరణ దొరకదని, ఇప్పటికైనా సీఎంపై అనవసరమైన విమర్శలు చేయడం హరీశ్ మానుకోవాలని సూచించారు. డ్రగ్స్ నాటకాలు బంద్ చేయాలని రేవంత్ ను హరీశ్ రావు అనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.