కొత్త జిల్లాలను ముట్టుకుంటే అగ్గి రాజేస్తం: కేటీఆర్

కొత్త జిల్లాలను ముట్టుకుంటే అగ్గి రాజేస్తం: కేటీఆర్
  • పాలమూరు ప్రాజెక్ట్​ను కావాలనే పూర్తి చేయట్లేదు: కేటీఆర్
  • కేసీఆర్​కు పేరు వస్తదని రేవంత్ భయపడ్తున్నరు
  • చంద్రబాబుకు మేలు చేస్తూ రైతుల పొట్టకొడ్తున్నరని ఫైర్
  • బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులకు సన్మానం

    
మహబూబ్​నగర్, వెలుగు: కొత్త జిల్లాలను ముట్టుకుంటే అగ్గి రాజేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలను రద్దు చేయాలని చూస్తున్నదని, ఏ ఒక్క జిల్లాను తాకినా.. ఉద్యమాలు మొదలుపెడ్తామని వార్నింగ్ ఇచ్చారు. మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, జడ్చర్ల, మహబూబ్​నగర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులకు సోమవారం మహబూబ్​నగర్​లో సన్మానం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘‘ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని జిల్లాలను రద్దు చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ హయాంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు అశాస్ర్తీయంగా ఏర్పాటు చేశారని ఆరోపణలు చేశారు. ప్రజలకు పాలన దగ్గర చేయాలనే కేసీఆర్ జిల్లాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను 5 జిల్లాలుగా చేశారు. ఈ జిల్లాల జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదు’’అని కేటీఆర్ స్పష్టం చేశారు.

90 శాతం పనులు మేమే పూర్తి చేసినం

పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తయితే కేసీఆర్​కు పేరు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టు పనులను పెండింగ్​లో పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ‘‘మా హయాంలోనే ప్రాజెక్ట్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబుకు మేలు చేసేందుకే రేవంత్ రెడ్డి మిగిలిన 10 శాతం పనులు చేయట్లేదు. మహబూబ్​నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 14 లక్షల ఎకరాలకు నీరందించేందుకు కేసీఆర్ పాలమూరు ప్రాజెక్ట్ కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేశారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్​ పనులు 90 శాతం కాగా.. కెనాల్స్ మాత్రమే మిగిలాయి. పంపులు కూడా పెట్టినం. తన పాత బాసు చంద్రబాబు కోసం పాలమూరు రైతులను రేవంత్ రెడ్డి ఎండబెడ్తున్నడు. మా హయాంలో పాలమూరుకు ఐటీ హబ్ తెచ్చినం. అక్కడ 14 పరిశ్రమలు ఉండేవి. ఇప్పుడవి ఎక్కడికిపోయాయో యువతకు రేవంత్ రెడ్డి చెప్పాలి’’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు.

కాంగ్రెస్ పాలనపట్ల అసంతృప్తి ఉన్నది

కాంగ్రెస్ పాలనపట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని కేటీఆర్ అన్నారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలోనే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచులు 40 శాతం మంది గెలిచారు. ఈ మార్పు పాలమూరు జిల్లా నుంచే మొదలుకావాలి. బీఆర్ఎస్ హయాంలోనే పాలమూరుకు మెడికల్ కాలేజ్, రోడ్లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు మంజూరయ్యాయి. రానున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలి’’అని కేటీఆర్ కోరారు.