జాగృతి..రాజకీయ శిక్షణ వేదిక : ఎమ్మెల్సీ కవిత

జాగృతి..రాజకీయ శిక్షణ వేదిక : ఎమ్మెల్సీ కవిత
  • యువత, మహిళలు పాలిటిక్స్​లో రావాలి: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: యువత, మహిళలకు తెలంగాణ జాగృతిని రాజకీయ శిక్షణా వేదికగా మారుస్తామని జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాజకీయ నేపథ్యంలేని వారికి వేదికగా నిలుస్తుందని తెలిపారు. యువత పాలిటిక్స్​లోకి వస్తేనే స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందని చెప్పారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘లీడర్​’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కవిత తన నివాసంలో ఆదివారం ‘లీడర్’ పోస్టర్​ను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ గడ్డ అంటేనే ప్రశ్నించేతత్వం అని అన్నారు. అది తనతోనే ఆగొద్దని, ముందు తరాలకూ ప్రశ్నించేతత్వాన్ని నేర్పించాలని తెలిపారు. 

రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులపాటు ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని జులైలో ప్రారంభిస్తామని చెప్పారు. ఆగస్టు నుంచి జిల్లాల్లో ప్రతి నెలా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను గుర్తించడం, వాటిని పరిష్కరించడం, అభివృద్ధికి నిధులు సాధించడం వంటి అంశాలపై ట్రైనింగ్ ఇస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు తమ పవర్​ను చూపించాల్సిన అవసరం ఉందని తెలిపారు.