సింగరేణి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం .. ఓటమి తప్పదనే నిర్ణయం

సింగరేణి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం .. ఓటమి తప్పదనే నిర్ణయం
  • ట్రేడ్ యూనియన్​గానే పోటీకి దిగిన టీబీజీకేఎస్ 
  • పార్టీ పరంగా జోక్యం చేసుకోలేమని చెప్పిన బీఆర్ఎస్ పెద్దలు 

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలపై బీఆర్ఎస్ ​చేతులెత్తేసింది. పార్టీ పరంగా ఎన్నికల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ట్రేడ్​యూనియన్​గానే టీబీజీకేఎస్ ​నాయకులు పోటీలో ఉండాలని సూచించింది. తాము ప్రచారానికి కూడా రాలేమని చెప్పింది. బీఆర్ఎస్ ​పార్టీ తెలంగాణ ఉద్యమంలో భాగంగా సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్), ఆర్టీసీలో తెలంగాణ మజ్దూర్​యూనియర్​(టీఎంయూ) సహా ఇతర సంస్థల్లో కార్మిక సంఘాలను స్థాపించింది. టీబీజీకేఎస్​కు కల్వకుంట్ల కవిత, టీఎంయూకు హరీశ్​రావు గౌరవ అధ్యక్షులుగా పని చేశారు. 

తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్​జిల్లాల్లో టీబీజీకేఎస్​బలమైన కార్మిక సంఘంగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుసార్లు కార్మిక సంఘం ఎన్నికలు జరిగితే.. రెండుసార్లూ టీబీజీకేఎస్​నే గుర్తింపు సంఘంగా అవతరించింది. గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్..​ ఈసారి ఎన్నికల్లో మాత్రం నామమాత్రంగా పోటీకి దిగింది. ఈ సంఘంలో కీలక నాయకులుగా ఉన్న వెంకట్రావ్, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వాళ్లు కాంగ్రెస్​ అనుబంధం సంఘం ఐఎన్​టీయూసీలో చేరడానికి ప్రయత్నించినా, అందులో ఉన్న నాయకత్వం ససేమిరా అన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

ఓటమి తప్పదనే.. 

రెండుసార్లు కార్మిక సంఘం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్​.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వాటికి పూర్తిగా దూరమైంది. సింగరేణిలో డిపెండెంట్​ఉద్యోగాలు పునరుద్ధరించి 20 వేల మంది కార్మికుల కుటుంబాలకు లబ్ధి చేశామని, లాభాల్లో వాటాను 32 శాతానికి పెంచామని, కార్మికుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేసినా సింగరేణి గనుల పరిధిలో ఒక్క స్థానంలోనూ బీఆర్ఎస్​ గెలవలేదని ఆ పార్టీ నాయకత్వం అసంతృప్తితో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కార్మిక సంఘం ఎన్నికలను అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేసినా మళ్లీ ఓటమే ఎదురయ్యే అవకాశముందని అంచనాకు వచ్చింది.

 దీంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ కవిత సింగరేణి ట్రేడ్​ యూనియన్​ఎన్నికలపై కార్మిక సంఘాల నాయకులతో రెండుసార్లు సమావేశమయ్యారు. మూడోసారి గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్​నే గెలిపించాలని కోరారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీబీజీకేఎస్​ నాయకులు కలుస్తామని కోరినా బీఆర్ఎస్ ​పెద్దల​ నుంచి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో సంఘం ముఖ్య నాయకులు రాజీనామా చేశారు. దీంతో మొదటికే మోసం వస్తుందని గుర్తించిన పార్టీ పెద్దలు.. కార్మిక సంఘంగా ఎన్నికల్లో పోటీ చేయాలని, కార్మికులను కలిసి ఓట్లు అడగాలని ఉచిత సలహా ఇచ్చారు.

 కార్మికుల కోసం ఎంతో చేసిన టీబీజీకేఎస్​నే గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. కాగా, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఎన్నికల ప్రచార గడువు సోమవారంతో ముగిసింది. టీబీజీకేఎస్​ నాయకులు పోటీలో ఉన్నా ఏ డివిజన్​లోనూ పెద్దగా ప్రచారం చేయలేదు.