
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ఓటమికి, అధికారం కోల్పోవడానికి కారణమైన మాజీ ఎమ్మెల్యేలనే నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా కొనసాగిస్తే ఇంకా నష్టపోతామని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించకుండా.. ఎవరి కారణంగా ఓడిపోయామో లెక్కలు వేసుకోకుండా అవే ముఖాలతో పార్లమెంట్‌ఎన్నికలకు వెళ్తే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రగతి భవన్‌కు సన్నిహితంగా ఉంటూ తమకు ఎదురే లేదు అనుకునే కొంత మందితో పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నదని, ఇప్పటికైనా అలాంటి నేతలను దూరం పెట్టకుంటే మొన్నటి రిజల్టే రిపీట్అవుతుందని కొందరు ముఖ్యనేతలు పార్టీ వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్కు సూటిగా చెప్పినట్టు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేల తీరుతో వారు పోటీ చేస్తున్న స్థానంతో పాటు చుట్టు పక్కల నియోజకవర్గాలపైనా ప్రభావం పడిందని, పార్టీ ఓటమికి వాళ్ల తీరే కారణమని కేటీఆర్‌కు స్పష్టం చేసినట్టు సమాచారం. కేటీఆర్తెలంగాణ భవన్‌కు వచ్చినప్పుడు ఆ లీడర్లే హడావిడి చేస్తుండటంపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సిట్టింగ్‌ల వ్యవహార శైలితోనే..
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ స్థానిక నాయకత్వం వద్దని 3వారించినా, కొందరు సిట్టింగ్ఎమ్మెల్యేలపై నేరుగా పార్టీ నాయకత్వాన్ని కలిసి ఫిర్యాదు చేసినా వారికే టికెట్లు ఇచ్చారు. పదేళ్లు బీఆర్ఎస్అధికారంలో ఉండటంతో సాధారణంగానే కొంత వ్యతిరేకత ఉంది. దానికి తోడు సిట్టింగ్ఎమ్మెల్యేలపై ఆయా నియోజకవర్గాల్లో ఇంకా ఎక్కువ వ్యతిరేకత కనిపించింది. దీన్ని పసిగట్టలేకపోయిన పార్టీ నాయకత్వం ఎక్కువ మంది సిట్టింగులనే ఎమ్మెల్యేలుగా పోటీకి దించడంతో ఓటమి తప్పలేదు. ముఖ్యంగా మూడు జిల్లాల్లో అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహార శైలి పార్టీకి తీవ్రంగా నష్టం చేసినట్టుగా ఎన్నికల తర్వాత తేటతెల్లమైంది. ఫలితాలు ఇలాగే ఉండొచ్చని ఇంటెలిజెన్స్‌తో పాటు ఇతర సర్వేలు మొదటి నుంచి హెచ్చరిస్తున్నా పార్టీ నాయకత్వం వాటిని పెడచెవిన పెట్టింది. ఆయా జిల్లాల్లో గెలుపు గుర్రాలుగా ప్రజల్లో మంచి పేరున్న లీడర్లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఇలా పార్టీని వీడిన వారిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. దక్షిణ తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అండగా నిలిచిన ప్రజలు ఈసారి మార్పు వైపు మొగ్గు చూపారు. ఇందుకు ఆయా జిల్లాల్లోని అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహార శైలే కారణం. ఎన్నికల తర్వాత చేసిన పోస్టుమార్టంలోనూ ఇది తేటతెల్లమైంది. పార్టీని ఎవరైతే దెబ్బతిశారో మళ్లీ వాళ్లే నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయి ఉన్న నేతలు ఇంకా పార్టీలోనే ఉన్నా వారిని హైకమాండ్కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదనే చర్చ సాగుతోంది.
పార్టీని దెబ్బతీసిన నేతలనే ముందు పెడితే నష్టం..
కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు వారాలు మాత్రమే అవుతోంది. అప్పుడే కొత్త ప్రభుత్వంపై విమర్శలు సరికాదనే భావన పార్టీ నేతలు బాహాటంగానే చెప్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఓపెన్‌గానే ఇలాంటి స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఓటమి తర్వాత తనను కలిసిన నేతలకు పార్టీ చీఫ్కేసీఆర్ కూడా ఇలాంటి సూచనే చేశారు. కానీ పార్టీలో కేసీఆర్ తర్వాతి స్థానంలో ఉన్న లీడర్లు ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్‌ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమై.. ప్రజల్లోంచి వ్యతిరేకత ఎదురయ్యే వరకు వేచి చూసి అప్పుడు మాట్లాడితే దానికి జనంలోనూ మద్దతు దొరుకుతుందని చెప్తున్నారు. పార్టీ నాయకత్వం కొత్త ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టేలా వారి వెంట ఉండి పార్టీ ఓటమికి కారణమైన కొందరే కారణమని పార్టీ ముఖ్య నేతలే చెప్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ప్రభుత్వంలో చేసింది సరిగా చెప్పుకుని లోక్‌సభ ఎన్నికలకు వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయని.. దానికి భిన్నంగా పార్టీని దెబ్బతీసిన నేతలను ముందు పెట్టి కొట్లాడితే మాత్రం ప్రతికూలత తప్పదని కొందరు హెచ్చరిస్తున్నారు. పార్టీ హైకమాండ్ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ ఈమధ్య కాలంలో కేటీఆర్‌ను కలుస్తున్న కొందరు నేతలు సూచిస్తున్నారు.