ఎలక్షన్​ షెడ్యూల్ తర్వాత గుర్తులు గుర్తుకొచ్చాయా?

ఎలక్షన్​ షెడ్యూల్ తర్వాత గుర్తులు గుర్తుకొచ్చాయా?
  • ఇలాంటి పిటిషన్లతో ఎన్నికలు వాయిదా వేయాలనుకుంటున్నారా?  
  • మన దేశ ఓటర్లు.. గుర్తులకు తేడా తెలియనంత నిరక్షరాస్యులు కాదు
  • బీఆర్ఎస్ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కామెంట్లు
  • పార్టీ వేసిన రెండు పిటిషన్లు కొట్టేసిన కోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కారును పోలిన గుర్తులను ఇతర పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించొద్దని బీఆర్ఎస్  దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. యువ తులసీ పార్టీకి రోడ్ రోలర్, అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ పార్టీకి చపాతీ రోలర్ గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించగా, దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో బీఆర్ఎస్ రిట్ పిటిషన్ వేసింది. అలాగే కారును పోలిన ఫ్రీ సింబల్స్ ను ఇతరులకు కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేసింది.

ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ తరఫున సీనియర్ లాయర్లు ముకుల్ రోహత్గీ, మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. కారును పోలిన గుర్తులను ఇతర పార్టీల అభ్యర్థులకు కేటాయించడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారని ముకుల్ రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జస్టిస్ ఓకా స్పందిస్తూ.. ‘‘అందులో ఒక పార్టీ.. మీ పార్టీని ఓడిస్తుందని ఆందోళన చెందుతున్నారా. అవన్నీ పూర్తిగా వేర్వేరు గుర్తులు. భారత ఓటర్లు.. కారు, రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులకు తేడా తెలియనంత నిరక్షరాస్యులు కాదు’’ అని అన్నారు. 

ఇన్ని రోజులు ఏం చేశారు? 

ఈవీఎం మెషిన్లలో రోడ్ రోలర్, చపాతీ రోలర్, పలు ఫ్రీ సింబల్స్ కారు గుర్తుగానే కన్పిస్తున్నాయని మీనాక్షి అరోరా కోర్టు దృష్టికి తెచ్చారు. అవీ ఓటర్లను గందరగోళానికి గురిచేసే అవకాశం ఉందన్నారు. అయితే మీనాక్షి వాదనలతో డివిజన్ బెంచ్ ఏకీభవించలేదు. ‘‘ఎన్నికల షెడ్యూల్ తర్వాతే ఇలాంటి అంశాలు గుర్తుకు వస్తాయా? ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసి ఎన్నికలను వాయిదా వేయాలని అనుకుంటున్నారా?” అని ప్రశ్నించింది.

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా హైకోర్టు కొట్టివేసిన పిటిషన్ పై చాలా ఆలస్యంగా సుప్రీంకోర్టుకు వచ్చారని అభిప్రాయపడింది. అధికార పార్టీ అయి ఉండి, దాదాపు 274 రోజులు ఆలస్యంగా ఎలా వస్తారని ప్రశ్నించింది. ఆలస్యం కారణంగా ఈ పిటిషన్ పై విచారణ చేపట్టడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కాగా, రిట్ పిటిషన్ పై హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని ముకుల్ రోహత్గీ కోరగా డివిజన్ బెంచ్ అంగీకరించింది. హైకోర్టు కు వెళ్లవచ్చని, అయితే మెరిట్స్ ఆధారంగానే హైకోర్టు విచారణ ఉంటుందని తెలిపింది.