అర్హులైన పేద మహిళలకు నెలకు 3000.. రూ. 400కే గ్యాస్​ సిలిండర్​

అర్హులైన పేద మహిళలకు నెలకు 3000.. రూ. 400కే గ్యాస్​ సిలిండర్​

 

  • బీఆర్​ఎస్​ మేనిఫెస్టోలో హామీ
  • విడుదల చేసిన పార్టీ చీఫ్​ కేసీఆర్​
  • 2014, 2018 మేనిఫెస్టోల్లోని హామీలను 99% అమలు చేసినట్లు వ్యాఖ్య
  • 69మంది అభ్యర్థులకు బీ ఫామ్స్​ అందజేత

హైదరాబాద్, వెలుగు: బీఆర్​ఎస్​ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలకు నెలకు రూ. 3వేల జీవన భృతి ( సౌభాగ్యలక్ష్మి స్కీమ్​) అందిస్తామని, రూ. 400కే గ్యాస్​ సిలిండర్​ ఇస్తామని పార్టీ చీఫ్​, సీఎం కేసీఆర్​ ప్రకటించారు. అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు, తెల్లరేషన్​ కార్డు ఉన్నవాళ్లందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్​– 2023 ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం తెలంగాణ భవన్​లో ఆయన విడుదల చేశారు. కేసీఆర్​ లక్కీ నంబర్​ 6 కలిసి వచ్చేలా పాత స్కీంల పరిమితిని పెంచడంతోపాటు కొత్త స్కీమ్​ల సంఖ్య కలిపితే 15 ఉండేలా చూసుకున్నారు. 

ఈ సందర్భంగా కేసీఆర్​మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు పరిస్థితి అధ్వానంగా ఉండేదని.. కరెంట్, ఇరిగేషన్​ఉండేది కాదని, కొత్త రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో కూడా అర్థమయ్యే స్థితిలో ఉండేది కాదని అన్నారు. ఆర్థిక నిపుణులు, రిటైర్డ్​ఐఏఎస్​లతో మేధోమథనం చేసి రాష్ట్ర పరిస్థితికి తగ్గట్టుగా పాలసీలు రూపొందించి రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్​వన్​గా తీర్చిదిద్దామని చెప్పారు. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామన్నారు. మేనిఫెస్టోలో పెట్టకుండానే  దళితబంధు, కల్యాణలక్ష్మి, రెసిడెన్షియల్​స్కూళ్లు, రైతుబంధు, రైతుబీమా, విదేశీ విద్య స్కాలర్​షిప్​లు అమలు చేశామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా తొమ్మిదిన్నరేండ్లుగా పని చేశామన్నారు. 

మైనార్టీలకు రూ.12వేల కోట్లకుపైగా ఖర్చు చేసినం

కాంగ్రెస్ ​ప్రభుత్వం పదేండ్లలో మైనార్టీల కోసం రూ.970 కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం రూ.12 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందని కేసీఆర్​ చెప్పారు. పదేండ్లలో ఒక్క చిన్న ఘర్షణ జరుగకుండా సెక్యులర్​తెలంగాణను తీర్చిదిద్దామని తెలిపారు. గణేశ్ ​నిమజ్జనం కోసం ముస్లిం మత పెద్దలు మిలాద్​ఉన్​ నబీని మరో రోజుకు వాయిదా వేసుకున్నారని, అంతటి సోదరభావంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీనే మళ్లీ గెలుస్తుందని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోపే కొత్తగా ఇచ్చే హామీలను నెరవేరుస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. షెడ్యూల్డ్ ​ఏరియాలోని గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. దళితబంధు, బీసీల్లోని వృత్తి కులాలకు సాయం యథావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు. ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి.. అన్నదే తమ విధానమని కేసీఆర్​ చెప్పారు. దేశంలోని బెస్ట్​పాలసీలన్నీ తెలంగాణ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న బెస్ట్​ఎకనమిక్ పాలసీ, పవర్, డ్రింకింగ్​వాటర్, ఇరిగేషన్, అగ్రికల్చర్, దళిత్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్, హెల్త్, ఇండస్ట్రియల్, హౌసింగ్ పాలసీలను యథావిధిగా కొనసాగిస్తూ వాటికి సందర్భానుసారం ఉద్దీపణలు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.  

జగన్ ​ప్రభుత్వ అనుభవంతో పింఛన్లు పెంచుతున్నం 

దివ్యాంగ పింఛన్లను ఇటీవలే రూ.4 వేలకు పెంచామని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని వెయ్యి పెంచి క్రమేణ రూ.6 వేలకు చేరుస్తామని తెలిపారు. దీంతో 5.35 లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఆసరా పింఛన్లను రూ. వెయ్యి పెంచి రూ.3 వేలు చేస్తామని, తర్వాత ఏడాదికి రూ.500 చొప్పున పెంచుతూ ఐదేండ్లలో రూ.5 వేలకు చేరుస్తామన్నారు. ఏపీలో జగన్మోహన్​రెడ్డి ప్రభుత్వం ఇలాగే రూ.2 వేల పింఛన్​తో మొదలు పెట్టి క్రమేణ పెంచుతూ ఇప్పుడు రూ.3 వేలకు చేర్చిందని, ఈ అనుభవంతో ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా పింఛన్లు పెంచేలా ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. రైతుబంధు పథకాన్ని ఎకరాకు రూ.10‌‌‌‌ నుంచి ఏడాదిలో రూ.12 వేలకు పెంచుతామని, క్రమేణ దీన్ని ఐదేండ్లలో రూ.16 వేలకు చేరుస్తామని తెలిపారు. మేనిఫెస్టోలో మాత్రం రూ. 15వేలు అని తప్పుగా పడిందని ఆయన పేర్కొన్నారు. 

గృహ నిర్మాణం నిరంతర ప్రక్రియ

పేదలకు గూడు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని కేసీఆర్​ తెలిపారు. ఇండ్ల స్థలాలు లేని పేదలకు స్థలాలు పంపిణీ చేస్తామన్నారు. హైదరాబాద్​లో పేదల కోసం ఇంకో లక్ష డబుల్​బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. గృహ నిర్మాణం నిరంతర ప్రక్రియ అని, గృహలక్ష్మీ పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తామన్నారు. 

ఉచిత బీమా.. సన్నబియ్యం

2014లో చేపట్టిన సమగ్ర సర్వే ప్రకారం రాష్ట్రంలో 1.03 కోట్ల కుటుంబాలు ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 1.10 కోట్లకు చేరిందని కేసీఆర్​ తెలిపారు. ఇందులో 93 లక్షలకుపైగా కుటుంబాలకు ఉచిత బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. ఎల్ఐసీ ద్వారానే ఈ స్కీం వర్తింపజేస్తామని, ఇందుకు ఒక్కో కుటుంబానికి రూ.3,600 నుంచి రూ.4 వేల ప్రీమియం చెల్లించాల్సి వస్తుందని అంచనా వేశామని చెప్పారు. ‘కేసీఆర్​ బీమా.. ప్రతి ఇంటికి ధీమా’ పేరుతో ఈ స్కీం ప్రవేశ పెడుతామన్నారు. జూన్ ​నుంచి అమలు చేస్తామన్నారు. ఏప్రిల్, మే నెల నుంచి తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద రేషన్​ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తామని తెలిపారు. 

జర్నలిస్టులకూ రూ. 400కే సిలిండర్​

అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరల పెంపు సాకుతో కేంద్ర ప్రభుత్వం గ్యాస్​సిలిండర్ల ధరలను అందుబాటులో లేనంతగా పెంచిందని, తాము మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అర్హులై మహిళలకు రూ.400కే గ్యాస్​సిలిండర్​ఇస్తామని కేసీఆర్​ చెప్పారు. అక్రెడిటేషన్​ ఉన్న జర్నలిస్టులకు కూడా ఈ స్కీం వర్తింపజేస్తామని తెలిపారు. ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులకు క్యాష్​లెస్​ట్రీట్​మెంట్​అందేలా కొత్త హెల్త్​స్కీం ప్రకటిస్తామని, రూ.15 లక్షల వరకు ఉచిత వైద్యం అందేలా చర్యలు చేపడుతామన్నారు. ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందించే పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచుతామని తెలిపారు.  దీన్ని కేసీఆర్​ ఆరోగ్య రక్షా కింద అమలు చేయాలని అందరూ కోరుతున్నారని అన్నారు. 

మేనిఫెస్టోలోని  మరిన్ని ముఖ్యాంశాలు:

  • అన్నపూర్ణ పథకం:  తెల్లరేషన్ కార్డు ఉన్న అందరికీ రేషన్​ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ.
  • ఇండ్ల నిర్మాణం: హైదరాబాద్​లో ఇంకో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం.. రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ.
  • మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు డిగ్రీ కాలేజీలుగా అప్ గ్రేడ్.
  • అగ్రకుల పేదలకు నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్​స్కూల్.​
  • అనాథ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ.
  • స్వయం సహాయక సంఘాల కోసం ప్రతి గ్రామంలో మహిళా భవనం.
  • అసైన్డ్​భూములపై ఉన్నపరిమితులు ఎత్తివేసి రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించేందుకు విధివిధానాల రూపకల్పన.
     

రైతు బంధు 

  • ఇప్పుడు ఎకరాకు రూ.10 వేలుగా ఉన్న రైతు బంధు.. మళ్లీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరం రూ.12వేలకు పెంపు. ఆ తర్వాత దశలవారీగా మొత్తం ఐడేండ్లలో రూ.16 వేలకు పెంపు.
  • ఆసరా పెన్షన్లు ఆసరా పెన్షన్లు 
  • మొదటి ఏడాది రూ.3వేలకు పెంపు. ఆ తర్వాత మొత్తం ఐదేండ్లలో విడతలవారీగా రూ.5 వేలకు పెంపు. దివ్యాంగుల పెన్షన్లు రూ.4,016 నుంచి ఐదేండ్లలో దశలవారీగా రూ.6,016కు పెంపు.  
  • కేసీఆర్ బీమా - ప్రతి ఇంటికి ధీమా : తెల్ల రేషన్​కార్డు ఉన్న ప్రతి పేద కుటుంబానికి రైతుబీమా తరహాలో రూ.5 లక్షల జీవిత బీమా
  • ఓపీఎస్​పై స్టడీకి కమిటీ: ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్​ స్థానంలో పాత పెన్షన్ విధానం (ఓపీఎస్​) పై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ. నివేదిక రాగానే నిర్ణయం.
  • కేసీఆర్ ఆరోగ్య రక్ష:  ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలకు పెంపు.