రంగు మారిన సోయా కొనాలె..బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంపీ, ఎమ్మెల్యే ఇండ్ల ముట్టడి

రంగు మారిన సోయా కొనాలె..బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంపీ, ఎమ్మెల్యే ఇండ్ల ముట్టడి
  • అడ్డుకున్న పోలీసులు.. స్వల్ప ఉద్రిక్తత
  • మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్​

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ​చేస్తూ శనివారం మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్​ నాయకులు చేపట్టిన ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్​శంకర్ ​ఇండ్ల ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి భారీగా చేరుకున్న బీఆర్​ఎస్​ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఆందోళన చేపట్టిన జోగు రామన్నను అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలిస్తున్న క్రమంలో కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు

 దీంతో ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. పోలీసులు చెదరగొట్టడంతో పలువురు నాయకులు, కార్యకర్తలు గాయాలపాలయ్యారు. అనంతరం పోలీస్​స్టేషన్ ముందు జోగు రామన్న పడుకొని నిరసన తెలిపారు. రంగు మారిన సోయా పంటను, తేమ లేకుండా పత్తి పంటను  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని తాము నిరసన చేపడితే పోలీసులు లాటీ చార్జ్​చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలకు రైతులపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు.