నన్నపునేని నరేందర్​కు టికెట్​ ఇవ్వకూడదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీర్మానం

నన్నపునేని నరేందర్​కు టికెట్​ ఇవ్వకూడదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు  తీర్మానం
  • నరేందర్​కు టికెట్​ ఇవ్వద్దంటూ తీర్మానం
  • వరంగల్​ సిటీలోని ఓ కార్పొరేటర్​ ఇంట్లో రహస్య సమావేశం
  • గడిచిన నాలుగున్నరేండ్లలో  జరిగిన అవమానాలపై చర్చ
  • నరేందర్ ​తీరుతో  వరంగల్ ​తూర్పులో పార్టీకి నష్టం జరుగుతోందని అసహనం
  • హైకమాండ్‍కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం

వరంగల్/వరంగల్‍ సిటీ, వెలుగు: వరంగల్‍ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్​కు వచ్చే ఎన్నికల్లో టికెట్​ ఇవ్వకూడదని బీఆర్ఎస్​పార్టీ మెజార్టీ కార్పొరేటర్లు తీర్మానించారు. తూర్పు సీటుకు క్యాండిడేట్​ను మార్చాలని నిర్ణయించారు. గురువారం సిటీలోని ఓ కార్పొరేటర్ ఇంట్లో14 మంది అధికార పార్టీ కార్పొరేటర్లు రహస్యంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యే నరేందర్​ తీరుపై అంతా గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. గడిచిన నాలుగున్నర ఏండ్లలో వారికి జరిగిన అవమానాలను ఒక్కొక్కరు చెప్పుకుని బాధపడినట్లు సమాచారం. అనంతరం కొందరు కార్పొరేటర్లు ‘వెలుగు’ ప్రతినిధితో మాట్లాడారు. ప్రధానంగా తమకు జరుగుతున్న అవమానాలు, పోలీసుల బెదిరింపులు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుతో పార్టీకి జరుగుతున్న నష్టంపై చర్చించినట్లు తెలిపారు. ‘‘ఎమ్మెల్యే నరేందర్‍ వరంగల్‍ తూర్పులో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు.

కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఆగిన పనులకు, ఇప్పుడు కొబ్బరి కాయలు కొట్టుడు తప్పించి కొత్తగా నిధులు ఇచ్చింది, తెచ్చింది ఏమీ లేదు. కార్పొరేటర్లకు దక్కాల్సిన కమీషన్లు సైతం ఎమ్మెల్యేనే తీసుకుంటే మేం ఏం చేయాలి. అయినప్పటికీ పర్లేదని ఊరుకున్నాం. నరేందర్‍ తీరుతో తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్​బలహీనపడుతోంది. చాలా మంది నాయకులు పార్టీకి దూరమవుతున్నారు. ఐదేండ్ల కింద వచ్చినోళ్ల నుంచి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ల వరకు నరేందర్​అందరినీ అడుగడుగునా అవమానిస్తున్నాడు. సొంత పార్టీ కార్పొరేటర్లు అనే కనీస గౌరవం ఇవ్వట్లేదు. ఇదేంటని అడిగితే పోలీస్‍ కేసులు పెట్టిస్తుండు. 

స్టేషన్ల చుట్టూ తిప్పేలా సీఐలను మీదికి పంపుతుండు. నరేందర్​కింద పనిచేయలేం. వచ్చే ఎన్నికల్లో తూర్పు క్యాండిడేట్​ను మార్చాలి. ఈ విషయంపై హైకమాండ్​కు ఫిర్యాదు చేయాల్సిందే” అని 14 మంది నిర్ణయించినట్లు తెలిపారు. కార్పొరేటర్ల రహస్య సమావేశంపై ఎమ్మెల్యే నరేందర్‍ స్పందిస్తూ.. కార్పొరేటర్ల భేటీ జరిగింది వాస్తవేమేనని.. అయితే వారంతా ఎలక్షన్‍ ప్లాన్‍ ఆఫ్‍ యాక్షన్‍పై, ప్రభుత్వ స్కీములపై డిస్కస్‍ చేశారని తెలిపారు. ఎలాంటి అసమ్మతి లేదన్నారు.  గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలో 66 మంది కార్పొరేటర్లు ఉండగా.. వరంగల్‍ తూర్పు నియోజకవర్గం నుంచి 24 మంది ఉన్నారు. ఇందులో 22 మంది బీఆర్‍ఎస్‍ కార్పొరేటర్లే. గతంలో ఐదారుగురు అధికార పార్టీ లీడర్లు రహస్యంగా భేటీ అయి ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేయగా, గురువారం ఏకంగా  14 మంది సమావేశమయ్యారు.