
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసమే ప్రభుత్వం కులగణన
- కోరుట్లలో మీడియా సమావేశంలో మాజీ ఎంపీ మధుయాష్కి
కోరుట్ల, వెలుగు: పదేండ్లలో బీఆర్ఎస్ పాలకులు తెలంగాణను దోపిడీ చేసి, వందేండ్ల విధ్వంసం చేశారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మధుయాష్కి ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం ధనికులయ్యారని, పేదలు బీదవారు అయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు లబ్ధి చేకూర్చే 6 గ్యారంటీలను అమలు చేస్తూ నెరవేరుస్తుందని తెలిపారు. బుధవారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని కాంగ్రెస్ ఆఫీస్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
గతంలో ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా జువ్వాడి రత్నాకర్ చేసిన అభివృద్ధి పనులే ఇప్పటికీ కోరుట్లలో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టిందన్నారు. రాష్ట్రపతి వద్ద ఫైల్ ఉందని, ఇందుకు రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని, బిల్లు అమలైనప్పుడే బడుగు, బలహీనవర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ సమావేశంలో కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు, రాష్ట్ర నేత జువ్వాడి కృష్ణారావు, పలువురు నేతలు పాల్గొన్నారు.