కారు దిగుతున్నరు..బీఆర్​ఎస్​కు గుడ్​బై చెప్తున్న అసంతృప్తులు

కారు దిగుతున్నరు..బీఆర్​ఎస్​కు గుడ్​బై చెప్తున్న అసంతృప్తులు
  • కాంగ్రెస్​ వైపు రేఖానాయక్​.. టికెట్​ కోసం అప్లయ్​
  • బీజేపీ దిక్కు చెన్నమనేని రమేశ్​ చూపు
  • పార్టీని వీడేందుకు సిద్ధమైన మైనంపల్లి
  • తుమ్మల అనుచరుల స్పెషల్​ మీటింగ్
  • కేడర్​తో వేముల వీరేశం, జలగం భేటీ
  • భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

హైదరాబాద్, వెలుగు:  ఎమ్మెల్యే టికెట్​దక్కని బీఆర్​ఎస్​ నేతలు ఆ పార్టీకి గుడ్​బై చెప్తున్నారు. ఇతర పార్టీల్లో చేరేందుకు అంతా రెడీ చేసుకుంటున్నారు. ఖానాపూర్​ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే రేఖానాయక్ ​కాంగ్రెస్ ​టికెట్​ కోసం అప్లయ్​ చేసుకున్నారు. ఆమె భర్త శ్యామ్ ​నాయక్​ కాంగ్రెస్​లో చేరారు. మల్కాజ్​గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మెదక్​టికెట్​తన కొడుకు రోహిత్​కు ఇవ్వాల్సిందేనని బీఆర్​ఎస్​ హైకమాండ్​కు తేల్చి చెప్పారు. మెదక్ ​టికెట్​ఇవ్వకుంటే పార్టీని వీడేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. వేములవాడ టికెట్​దక్కని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​బాబు బీజేపీ వైపు చూస్తున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు అనుచరులు మంగళవారం ఖమ్మంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పాలేరు టికెట్​తుమ్మలకు ఇవ్వకపోవడంతో భవిష్యత్ ​కార్యాచరణపై వారు చర్చించారు.  తుమ్మల నాగేశ్వర్​రావు హైదరాబాద్​లో ఉండటంతో ఈ మీటింగ్​లో పాల్గొనలేదు. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తన వర్గీయులతో సమావేశమై భవిష్యత్​ కార్యాచరణపై చర్చించారు. నకిరేకల్​మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తన అనుచరులతో భేటీ అయ్యారు.  

రెండు టికెట్లిస్తేనే : మైనంపల్లి

తనకు, తన కొడుక్కు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాల్సిందేనని బీఆర్​ఎస్​ హైకమాండ్​కు సోమవారం తిరుమలలో మల్కాజ్​గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తేల్చిచెప్పారు. మంగళవారం కూడా ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్​కు విజ్ఞప్తి చేస్తున్నా.. నా కొడుక్కు మెదక్ సీట్ ఇవ్వండి.. అక్కడ నా కొడుకు కచ్చితంగా గెలుస్తడు.. కేసీఆర్​ను నేను ఏమీ అనలేదు.. ఆయన నన్ను ఏమీ అనలేదు.. నేను మల్కాజ్​గిరి, నా కొడుకు మెదక్ నుంచి గెలుస్తం.. కరోనా లాంటిది వచ్చి ఎప్పుడు పోతామో తెలీదు.. బతికున్నప్పుడు జీవితానికి విలువ లేకపోతే ఎలా?” అని మైనంపల్లి అన్నారు. కరోనా కష్టకాలం నుంచి తన కొడుకు రోహిత్​ మెదక్​లో సమాజ సేవ చేస్తున్నాడని, అక్కడి ప్రజల మద్దతు తమకే ఉందని చెప్పారు. రోహిత్​కు తన సపోర్ట్​ ఉంటుందన్నారు. మంత్రి హరీశ్​రావుపై తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, పార్టీపై, అధినేతపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. తాను ఎవరి విషయంలో జోక్యం చేసుకోనని, తనను ఇబ్బంది పెడితే అదే రీతిలో కచ్చితంగా బదులిస్తానన్నారు. హైదరాబాద్​కు వెళ్లిన తర్వాత తన అనుచరులతో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. 

తాను మల్కాజ్​గిరి నుంచి, తన కుమారుడు మెదక్​ నుంచి పోటీ చేయడం ఖాయమన్నారు. కాగా, మైనంపల్లి చర్యలను బీఆర్ఎస్ హైకమాండ్​ నిశితంగా గమనిస్తున్నది. హైదరాబాద్​కు వచ్చిన తర్వాత ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మైనంపల్లిని తప్పిస్తే మల్కాజ్​గిరి నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్​రెడ్డి,  ఎమ్మెల్సీ శంభీపూర్​రాజు, మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు, కార్పొరేటర్​ చింతల విజయశాంతిరెడ్డి, మన్నె క్రిశాంక్, మాజీ కార్పొరేటర్​ పరుశురాం రెడ్డిలో ఎవరికైనా ఒకరికి టికెట్​ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.   పాలేరు టికెట్​ను కందాల ఉపేందర్​రెడ్డికే ఇవ్వడంతో మంగళవారం ఖమ్మంలోని వీసీ రెడ్డి ఫంక్షన్​ హాల్​లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు అనుచరులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను హైదరాబాద్​లో ఉన్న తుమ్మల దృష్టికి తీసుకెళ్లారు. కొత్తగూడెం టికెట్​దక్కని జలగం వెంకట్రావు కూడా తన అనుచరులతో భేటీ అయ్యారు. తుమ్మల, జలగం కలిసి కాంగ్రెస్​లో చేరనున్నట్టు వారి అనుచరులు చెప్తున్నారు. 

 నకిరేకల్​ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్​లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఆయన రాకను వ్యతిరేకించిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ ​రెడ్డి జోక్యంతో మెత్తబడ్డారు. ఈ వారంలోనే వేముల వీరేశం కాంగ్రెస్​ పార్టీలో చేరే అవకాశముందని తెలుస్తున్నది. 

 పెద్దపల్లి టికెట్​ఆశించి భంగపడ్డ కేటీఆర్​సన్నిహితుడు నల్ల మనోహర్​రెడ్డి బీఆర్​ఎస్​ను వీడారు. రెబల్​గా పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.  ప్రస్తుతం జర్మనీలో ఉన్న వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​ఈ నెల 25న స్వదేశానికి రానున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్​ను వీడాలని ఆయనను అనుచరులు కోరుతున్నారు. రమేశ్​తో బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్​ ఫోన్​లో మాట్లాడారు.  

కాంగ్రెస్​లో చేరకుండానే టికెట్​కోసం రేఖానాయక్​ అప్లికేషన్

కాంగ్రెస్​లో చేరకుండానే ఖానాపూర్​ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే రేఖానాయక్​ మంగళవారం టికెట్​ కోసం అప్లికేషన్ ​పెట్టుకున్నారు. రేఖానాయక్ ​ఖానాపూర్​ నుంచి, ఆమె భర్త శ్యాంనాయక్​ ఆసిఫాబాద్​ నుంచి ఎమ్మెల్యే టికెట్​ కోరుతూ దరఖాస్తులు గాంధీ భవన్​లో సమర్పించారు. బీఆర్​ఎస్​ ఖానాపూర్​ టికెట్​తనకు ఇవ్వకపోవడం బాధ కలిగించిందని, మూడోసారి గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే తనను తప్పించారని రేఖా నాయక్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఖానాపూర్​ టికెట్​ ఇచ్చిన జాన్సన్​ నాయక్​ ఎస్టీ కాదని.. కేవలం కేటీఆర్​ ఫ్రెండ్​మాత్రమేనని అన్నారు. 

భర్తలు లేని మహిళలకే బీఆర్ఎస్​లో మంత్రి పదవులు ఇస్తారని రేఖానాయక్​ భర్త శ్యాం నాయక్​ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భర్తలు ఉన్న మహిళలకు బీఆర్ఎస్​లో గౌరవం లేదని అన్నారు. కాంగ్రెస్​ నుంచి ఆసిఫాబాద్​ టికెట్​ కోసం దరఖాస్తు చేశానని, తనకు టికెట్​ ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.