బీజేపీ, కాంగ్రెస్ కలిసి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నయ్ : కేటీఆర్

బీజేపీ, కాంగ్రెస్ కలిసి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నయ్ :  కేటీఆర్
  • మోదీ, రేవంత్ ఒప్పందం రాష్ట్రానికి ఎంతో ప్రమాదం: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఒప్పందం కుదిరిందని, అది రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదమని విమర్శించారు. తెలంగాణభవన్ లో బీజేపీ సీనియర్ లీడర్లు అలూరి విజయభారతి, ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతూ కత్తెర రాజకీయాలు చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన భవనాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడానికి తాపత్రయ పడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ పునాది వేసిన భవనాలను ఇప్పుడు రేవంత్ ప్రారంభించారు’’అని కేటీఆర్ మండిపడ్డారు.

కాళేశ్వరంపై రేవంత్ పగబట్టారు

మోదీ, చంద్రబాబుతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ కుట్ర పన్నారని కేటీఆర్ ఆరోపించారు. గోదావరి నీళ్లను దిగువకు పంపి చంద్రబాబు కడుతున్న బనకచర్ల ప్రాజెక్టుకు, అక్కడి నుంచి తమిళనాడుకు తరలించేందుకు రేవంత్ ప్లాన్ చేస్తున్నారన్నారు. మోదీ, చంద్రబాబు ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి గోదావరి నీళ్లను కిందికి పంపించే కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

“కాళేశ్వరం నీళ్లు ఆగకుండా, గోదావరి నీళ్లు కిందికి వెళ్లి చంద్రబాబు కడుతున్న బనకచర్ల ప్రాజెక్టుకు, అక్కడి నుంచి తమిళనాడుకు వెళ్లాలనేది కేంద్రంలోని బీజేపీ, రేవంత్‌‌‌‌‌‌‌‌కు ఇచ్చిన ఆదేశం” అని కేటీఆర్ అన్నారు.