
- ఎక్కువ టైం లేదు.. రెండున్నరేండ్లలో మళ్లీ మేమే అధికారంలోకి వస్తం
- అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా మాట్లాడుతున్నరు.. ఎవ్వరినీ వదలం
- పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆగమాగమైతున్నరు
- కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వందేండ్లు వెనక్కు
- రాష్ట్ర ప్రజలు తినే పళ్లెంలో మన్ను పోసుకున్నరని కామెంట్
హైదరాబాద్, వెలుగు: ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. కొందరు ఉన్నతాధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా మాట్లాడుతున్నారన్నారు. ‘‘కాంగ్రెస్ సర్కారుకు అనుకూలంగా పనిచేస్తున్న అధికారులందరి పేర్లనూ రాసి పెడుతున్నం. ఎక్కువ టైమేమీ లేదు. రెండున్నరేండ్లలో మళ్లీ అధికారంలోకి వస్తం. ఇంతకుముందులా కాకుండా ఈసారి బరాబర్ అందరి లెక్కలు తేలుస్తం” అని హెచ్చరించారు. గురువారం పరిగి నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డిని ఘోరంగా అవమానించారని అన్నారు. ఓడిపోయిన వ్యక్తులు స్టేజీ మీద కూర్చుంటే.. గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని మాత్రం కింద కూర్చోవాలంటూ అధికార పార్టీ నేతలు అన్నారని, వారిని సబితా ఇంద్రారెడ్డి ధైర్యంగా ఎదుర్కొన్నారని చెప్పారు. హోం మంత్రిగా పనిచేసిన వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక.. ఎవ్వరినీ వదిలిపెట్టబోమని అన్నారు. హైదరాబాద్ సిటీలోనూ ఇటీవల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో.. ఐఏఎస్ ఆఫీసర్లు.. గత పదేండ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదని అబద్ధాలు చెప్పారన్నారు. అధికారులు అలా చెప్పొచ్చా? అని ప్రశ్నించారు. ఇలా మాట్లాడే అధికారుల పేర్లను రాసి పెట్టుకుంటున్నామని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రతిరోజూ బీఆర్ఎస్ లో చేరే వారి సంఖ్య పెరుగుతున్నదని, రాబోయే రోజుల్లో రేవంత్‌రెడ్డిని ఓడించే ఏకైక వ్యక్తి నరేందర్‌రెడ్డి అని తెలిపారు.
ఆ 10 మంది దేవుడి కండువా కప్పుకున్నమంటున్నరు
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను.. ఏ పార్టీలో ఉన్నారని మీడియా అడిగితే ‘ఏ పార్టీలో ఉన్ననో ఆ పార్టీలోనే ఉన్నా’ అంటూ చెబుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పాలన వచ్చాక ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఆగమాగమైతున్నదన్నారు. సుప్రీంకోర్టు అడిగితే బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారని, అది దేవుడి కండువా అంటున్నారని పేర్కొన్నారు. వారు ఏ పార్టీలో ఉన్నారో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని, కానీ స్పీకర్‌కు మాత్రం తెలియడం లేదని అన్నారు. కాగా, సీఎం ఎలా ఉండాలో చూపించింది కేసీఆర్ అయితే.. ఎలాంటి పనులు చేయొద్దో, ఎలాంటి భాష మాట్లాడొద్దో, ఎలా ఉండొద్దో చెబుతున్నది మాత్రం రేవంత్‌రెడ్డి అని పేర్కొన్నారు. రేవంత్‌కు కేసీఆర్ ఫోబియా పట్టుకున్నట్టున్నదని, ఢిల్లీకి పోయినా కూడా కేసీఆర్ పేరునే తలుస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘‘20 నెలలుగా ఆరోగ్యం దృష్ట్యా కేసీఆర్ ఇంట్లోనే ఉంటున్నారు. సైలెంట్‌గా ఉన్నారు. కానీ, ఈ 20 నెలల్లో కేసీఆర్ పేరు తలవకుండా రేవంత్ఉండలేదు. ఇంట్లో పడుకున్నా నిద్రలో కూడా కేసీఆర్ పేరే తలచుకుంటున్నాడేమో. బీసీలను మోసం చేస్తున్నవ్.. డ్రామా చేస్తున్నవ్ అని నేను అంటే.. నన్ను రివర్స్‌లో నీ పేరే డ్రామా అని అంటున్నారు. కానీ, రేవంత్.. బాబు చేస్తున్న జలదోపిడీలో నువ్వు చేసేదే డ్రామా. రాహుల్‌తో దోస్తీ ఒక డ్రామా.. మోదీతో నీ కుస్తీ ఒక డ్రామా. నీ మేనిఫెస్టో ఒక డ్రామా. నువ్వు కాంగ్రెస్‌లో ఉంటావనడం ఇంకో పెద్ద డ్రామా’’ అని వ్యాఖ్యానించారు.
వందేండ్లు వెనక్కు
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వందేండ్లు వెనక్కు వెళ్లిపోతున్నదని కేటీఆర్ అన్నారు. అన్ని వర్గాలనూ కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని విమర్శించారు. కరెంటు కోతలు, ఎరువుల కొరత, గ్రామాల్లో సంక్షోభం, పట్టణాల్లో పడకేసిన పాలన వంటి ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని అన్నారు. తినే పళ్లెంలో మన్ను పోసుకున్నమని ప్రజలు బాధపడుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోగానే రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తుందని చెప్పారు. అయితే, గత పదేండ్లలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రాభివృద్ధిపైనే దృష్టి సారించామన్నారు. ఆ టైంలో కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయామని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తామని, కార్యకర్తలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పుకొచ్చారు. గత 20 నెలలుగా సంపాదించిన అడ్డగోలు అవినీతి పైసలను స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లోకల్‌బాడీ ఎలక్షన్స్‌లో పార్టీని గెలిపించేందుకు గట్టిగా కష్టపడాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉన్నంత కాలం గులాబీ కండువా ఉంటుందని, బీజేపీ, కాంగ్రెస్‌ను మట్టికరిపించి మళ్లీ కేసీఆర్‌ను సీఎంగా ఎన్నుకుంటామని అన్నారు.