
- బీఎస్‌ఈ లిమిటెడ్ షేర్లు జూన్ గరిష్టం నుంచి 22 శాతం డౌన్
- అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ షేర్లు 18 శాతం పతనం
- ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్‌లో రూల్స్ మరింత కఠినంగా మారే అవకాశం
- ఎక్స్చేంజ్‌లలో తగ్గనున్న ట్రేడింగ్ వాల్యూమ్
న్యూఢిల్లీ: జేన్ స్ట్రీట్ స్కామ్ బయటపడినప్పటి నుంచి స్టాక్ ఎక్స్చేంజ్‌లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ లిమిటెడ్ షేర్లు నష్టపోతున్నాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) డెరివేటివ్ (ఎఫ్ అండ్ ఓ) సెగ్మెంట్‌లో రూల్స్‌ను మరింత కఠినం చేయాలని చూస్తోంది. ఫలితంగా ఈ స్టాక్ ఎక్స్చేంజ్‌ల షేర్లు భారీగా పడుతున్నాయి. గత నెల రోజుల్లో ఈ రెండు సంస్థల ఇన్వెస్టర్లు కలిపి రూ. 1.4 లక్షల కోట్లు నష్టపోయారు.
లిస్టెడ్ కంపెనీ అయిన బీఎస్‌ఈ లిమిటెడ్ షేర్లు ఈ ఏడాది జూన్ గరిష్టం నుంచి 22శాతం పతనమవ్వగా, అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో ట్రేడవుతున్న ఎన్‌ఎస్‌ఈ షేర్లు 18 శాతం పడ్డాయి. కాగా, సెబీ జులై 3న యూఎస్ ట్రేడింగ్ కంపెనీ జేన్ స్ట్రీట్‌ను భారత మార్కెట్ల నుంచి నిషేధించి, రూ.4,844 కోట్లను ఎస్క్రో అకౌంట్లలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
ఎఫ్ అండ్ ఓ ట్రేడ్‌లో లోపాలను వాడుకొని నిఫ్టీ బ్యాంక్‌ను మానిపులేట్ చేసిందని, అక్రమంగా లాభాలు సంపాదించిందని ఆరోపించింది. ఈ స్కామ్ బయటపడ్డాక ఇండియా డెరివేటివ్స్ మార్కెట్‌లో వాల్యూమ్‌లు పడిపోయాయి. బ్రోకరేజీలు, స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్స్‌పై నెగెటివ్ ప్రభావం పడింది. బీఎస్‌ఈ లిమిటెడ్ షేర్లు ఈ ఏడాది జూన్ 10న రూ.3,030 దగ్గర ట్రేడవ్వగా, తాజాగా రూ.2,376కు పడిపోయాయి.
ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.26,600 కోట్లు తగ్గింది. ఎన్‌ఎస్‌ఈ విలువ రూ.1.15 లక్షల కోట్లు పడింది. వెల్త్ విస్డమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (డబ్ల్యూడబ్ల్యూఐపీఎల్) ప్రకారం, అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో ఈ కంపెనీ షేర్లు జూన్ 21న నమోదైన రూ.2,590 నుంచి తాజాగా రూ.2,125కు పడ్డాయి.
బీఎస్‌ఈకి కష్టం..
బీఎస్‌ఈ లిమిటెడ్ రేటింగ్‌ను ఫైనాన్స్ కంపెనీ ఐఐఎఫ్‌ఎల్ క్యాపిటల్ డౌన్‌గ్రేడ్ చేసింది. నియంత్రణలు, వాల్యూమ్ తగ్గుదల కారణంగా అనిశ్చితి నెలకొందని పేర్కొంది. “ నియంత్రణలు, రిటైల్ నష్టాలు పెరుగుతుండడంతో ఎక్స్చేంజ్‌లలో వాల్యూమ్‌లు పడిపోతాయి” అని ఐఐఎఫ్‌ఎల్ అంచనావేసింది. మోతీలాల్ ఓస్వాల్ కూడా బీఎస్‌ఈ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది.
ఎక్స్‌పైరీ డే మారుతుండడంతో మార్కెట్ వాటా కోల్పోతుందని తెలిపింది. బీఎస్‌ఈ ఆప్షన్ ప్రీమియం టర్నోవర్ ఈ నెల మొదటి 8 సెషన్లలో జూన్‌లోని ఇదే టైమ్‌తో పోలిస్తే 25శాతం తగ్గింది. సెబీ ఆదేశాల మేరకు ఎన్‌ఎస్‌ఈ తన డెరివేటివ్స్ ఎక్స్‌పైరీ డేను సెప్టెంబర్ 1 నుంచి మంగళవారానికి, బీఎస్‌ఈ గురువారానికి మార్చనున్నాయి.
ఇవి అమల్లోకి వచ్చాక బీఎస్‌ఈ 10-–12శాతం వాల్యూమ్ కోల్పోతుందని, కంపెనీ వాల్యుయేషన్ తగ్గుతుందని ఐఐఎఫ్‌ఎల్ పేర్కొంది. సరియైన వాల్యూ ప్రకారం కంపెనీ షేరు ధరను రూ.2,200గా నిర్ణయించింది. ఇది ప్రస్తుత స్థాయుల నుంచి11శాతం తక్కువ.
రూ.4,844 కోట్లు డిపాజిట్ చేసిన జేన్ స్ట్రీట్
యూఎస్ ట్రేడింగ్ కంపెనీ జేన్ స్ట్రీట్ సెబీ ఆదేశాలకు అనుగుణంగా రూ.4,844 కోట్లను ఎస్క్రో అకౌంట్లలో డిపాజిట్ చేసింది. గతంలో సెబీకి వ్యతిరేకంగా కోర్టుకు వెళదామని భావించింది. డిపాజిట్ చేసిన తర్వాత, మధ్యంతర ఆదేశంలో విధించిన “కొన్ని షరతులతో కూడిన నిబంధనలను” తొలగించాలని జేన్ స్ట్రీట్ కోరింది. కానీ మార్కెట్ రెగ్యులేటరీ మాత్రం ఈ అంశంపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు.