
- ఆరు మేగజీన్లు, కేజీ హెరాయిన్ స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్
అమృత్ సర్: పాకిస్తాన్ ఆగడాలను భారత్ అడ్డగించింది. పంజాబ్ లోని అమృత్ సర్ సమీపంలో బార్డర్ గుండా ఆయుధాలు, నార్కోటిక్ డ్రగ్స్ ను ఇండియాలో పంపేందుకు పాకిస్తాన్ పన్నిన కుట్రను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) తిప్పికొట్టింది. వరుస ఆపరేషన్లు నిర్వహించి ఆరు డ్రోన్లను కూల్చేసింది. మూడు పిస్టల్స్, ఆరు మేగజీన్లు, పిస్టల్ విడిభాగాలు, కేజీ హెరాయిన్ ను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు గురువారం బీఎస్ ఎఫ్ అధికారులు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం రాత్రి అనుమానాస్పద వస్తువులు భారత్ భూభాగంలోకి వస్తున్నట్టు గుర్తించిన బీఎస్ ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
పాక్ కు చెందిన డ్రోన్లు దూసుకొస్తున్నట్టు గుర్తించి కౌంటర్ ఆపరేషన్ చేపట్టారు. మోధే సమీపంలో 5 డ్రోన్లను నేల కూల్చారు. మూడు పిస్టల్స్, మూడు మేగజీన్లు, 1.1 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గురువారం తెల్లవారు జామున అట్టారీ గ్రామం సమీపంలో మరో డ్రోన్ ను కూల్చివేసినట్టు తెలిపారు. వీటితోపాటు దాల్ సమీపంలోని పంటపొలాల్లో ఒక పిస్టల్, రెండు మేగజీన్లు గుర్తించినట్టు బీఎస్ ఎఫ్ వర్గాలు వెల్లడించాయి.