ముష్కరుల దాడిలో నలుగురు మృతి..ఉగ్రవాదుల కోసం గాలింపు

ముష్కరుల దాడిలో నలుగురు మృతి..ఉగ్రవాదుల కోసం గాలింపు

జమ్మూకశ్మీర్‌ రాజౌరీ జిల్లాలోని డాంగ్రీ గ్రామంలో ఉగ్రవాదాల కోసం గాలింపు కొనసాగుతోంది. ఆదివారం ముష్కరుల దాడిలో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో.. డాంగ్రీ గ్రామంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నాయి. మరోవైపు పంజాబ్ గురుదాస్‌పూర్‌లోని కమల్‌పూర్ పోస్ట్ వద్ద ఆదివారం రాత్రి 10.10 గంటల సమయంలో బీఎస్‌ఎఫ్ సిబ్బంది డ్రోన్‌ను గుర్తించారు.  డ్రోన్ వైపు కాల్పులు జరిపారు. దీంతో  ఆ  డ్రోన్ పాకిస్తాన్ వైపు వెళ్లిపోయిందని భద్రతా బలగాలు వెల్లడించాయి. 

జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సాధారణ పౌరులే లక్ష్యంగా ముష్కరులు దాడులు చేశారు. ఈ ఘటనలో నలుగురు పౌరులు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. బాధితులను దీపక్ కుమార్, సతీష్ కుమార్, ప్రీతమ్ లాల్ గా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజౌరి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. 

డాంగ్రి గ్రామంలోకి ప్రవేశించిన ఇద్దరు ఉగ్రవాదులు మూడు ఇళ్లపై కాల్పులు జరిపారు. ఉగ్రమూకల కాల్పుల్లో మెుత్తం పది మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. వీరిలో రాజౌరి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ముగ్గురు మృతి చెందారు. జమ్మూకు తరలించిన మరో వ్యక్తి కూడా చనిపోయారు. దీంతో రంగంలోకి ప్రభుత్వ బలగాలు ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నాయి. 

కాల్పుల ఘటనతో ఆందోళన చెందిన వ్యాపారులు సోమవారం రాజౌరీ జిల్లాలో బంద్ కు పిలుపునిచ్చారు. శాంతియుతంగా బంద్ లో పాల్గొంటున్నారు. అటు శాంతి భద్రతల దృష్ట్యా అధికారులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. మరోవైపు  గత రెండు వారాల్లో రాజౌరీ జిల్లాలో పౌర హత్యలు జరగడం ఇది రెండోసారి. డిసెంబరు 16న కూడా రాజౌరిలోని సైనిక శిబిరం వెలుపల ఇద్దరు పౌరులు మరణించారు.