లీజుకు బీఎస్‌‌ఎన్‌‌ఎల్ ఫైబర్ ఆస్తులు

లీజుకు బీఎస్‌‌ఎన్‌‌ఎల్ ఫైబర్ ఆస్తులు

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌కు చెందిన ఫైబర్ ఆధారిత నెట్‌‌వర్క్‌‌ను డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) లీజుకు ఇవ్వాలని అనుకుంటోంది. లీజుకు ఇవ్వబోతున్న ఈ నెట్‌‌వర్క్ 8 లక్షల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. లీజుకు ఇవ్వడం ద్వారా వచ్చిన మనీతో క్యాపిటల్‌‌ అవసరాలను, నిర్వహణ ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించాలనుకుంటోంది. బీఎస్‌‌ఎన్‌‌ఎల్ వాలెంటరీ రిటైర్‌‌‌‌మెంట్ స్కీమ్‌‌(వీఆర్‌‌‌‌ఎస్)ను ఆఫర్ చేస్తోంది.  సంస్థలో 50 ఏళ్ల వయసు వచ్చిన వారికి ఈ స్కీమ్‌‌ను తీసుకొచ్చింది. వీఆర్‌‌‌‌ఎస్  కోసం బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌కు నిధులు కావాల్సి ఉంటుంది. దాదాపు రూ.6,500 కోట్లు కావాలి. ఈ ఖర్చులకు కూడా బీఎస్‌‌ఎన్‌‌ఎల్ అదనంగా నిధులను సంపాదించాల్సి ఉంది. బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌కు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.3,300 కోట్ల అప్పు కూడా ఇంకా అందలేదు. మూలధన అవసరాలు, నిర్వహణ ఖర్చుల ఫండింగ్ కోసం సేల్ అండ్ లీజుబ్యాక్ మోడల్‌‌ను అమలు చేయాలనే ప్రతిపాదనను డీఓటీ, కమ్యూనికేషన్ సహాయ మంత్రి సంజయ్ శ్యామ్‌‌రావ్‌‌ ధోత్రేకు సమర్పించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ లావాదేవీ జరుపడానికి ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌‌మెంట్ ట్రస్ట్ ఒక మార్గమని ప్రతిపాదనలో పేర్కొంది.  లండన్, న్యూయార్క్‌‌కు చెందిన ఫండ్ మేనేజర్లతో కూడా డిపార్ట్‌‌మెంట్ చర్చలు జరుపుతోందని తెలిసింది. వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌‌‌‌టెల్ లాంటి ప్రైవేట్ సంస్థలు కూడా అప్పులను తగ్గించుకుని, నగదును రాబట్టుకోవడం కోసం తమ ప్రతిపాదిత కంబైన్డ్ ఆప్టిక్ ఫైబర్ నెట్‌‌వర్క్ సంస్థను ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌‌మెంట్ ట్రస్ట్‌‌గా మార్చాలని చూస్తున్నాయి. బిలీనియర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో కూడా ఇదే రకమైన ప్రయత్నాలను అమలు చేస్తోంది. బీఎస్‌‌ఎన్‌‌ఎల్ బోర్డు ఫైబర్ ఆస్తులను లీజుకు ఇచ్చే ప్రతిపాదనపై పనిచేస్తుందని టాప్ టెల్కో వర్గాలు చెప్పాయి. పెద్ద మొత్తం ఫైబర్ నెట్‌‌వర్క్‌‌ను నిర్వహించడం కూడా అదనపు ఆర్థిక భారమని బీఎస్‌‌ఎన్‌‌ఎల్ భావిస్తోంది. ఫైబర్ ఆస్తులను మోనిటైజ్ చేయడం  ఈ ప్రభుత్వ రంగ సంస్థ వార్షికంగా రూ.30 వేల కోట్ల వరకు సంపాదించాలనుకుంటోందని టెలికాం ఎక్విప్‌‌మెంట్ ప్రమోషన్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ సందీప్ అగర్వాల్ చెప్పారు. కొత్త ఆస్తులను ఏర్పాటు చేస్తూ.. ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను విస్తరించాలని కూడా భావిస్తోందని తెలిపారు.