సూర్యాపేటలో మంత్రి క్యాంప్​ ఆఫీసు ముట్టడి

సూర్యాపేటలో మంత్రి క్యాంప్​ ఆఫీసు ముట్టడి
  • జనగామ క్రాస్‌ రోడ్డు వద్ద బీఎస్పీ రాస్తారోకో
  • అరెస్ట్ చేసి పీఎస్‌లకు తరలించిన పోలీసులు

సూర్యాపేట, వెలుగు : డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్యపై అక్రమ కేసులు పెట్టారంటూ బీఎస్పీ చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఛలో సూర్యాపేటకు పిలుపునివ్వగా ఆ పార్టీ కార్యకర్తలు, లీడర్లు బుధవారం మంత్రి జగదీశ్​రెడ్డి క్యాంప్​ఆఫీసును ముట్టడించారు. పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ‘బీఎస్పీ ఛలో సూర్యాపేట’ విషయం తెలుసుకున్న పోలీసులు ముందుగానే  అలర్ట్ అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే బీఎస్పీ లీడర్లను అరెస్టు చేయడం మొదలుపెట్టారు. 

సూర్యాపేటకు వచ్చే రోడ్లపై నిఘా పెట్టి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికే చాలామంది పోలీసుల కళ్లుగప్పి పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రంలోని జనగామ క్రాస్ రోడ్డు వద్దకు చేరుకొని రాస్తారోకో చేశారు. దీంతో హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్​స్టేషన్లకు తరలించారు.

ఉద్రిక్తంగా మంత్రి క్యాంప్ ఆఫీస్ ముట్టడి    

మరోవైపు పోలీసులు ఆంక్షలను ఛేదించుకున్న బీఎస్పీ లీడర్లు మంత్రి జగదీశ్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించారు. వట్టె జానయ్య మద్దతుదారులతో పాటు బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు జానయ్యపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ  క్యాంప్ ఆఫీస్‌ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారిని అరెస్ట్ చేసి పలు పీఎస్​లకు తరలించారు. 

బీఎస్పీ లీడర్లు మాట్లాడుతూ జానయ్య యాదవ్ ను ఇంతకాలం వెంటబెట్టుకొని తిరిగిన మంత్రి ఒక్కరోజులోనే 74 కేసులు ఎలా పెట్టించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల రాజకీయ ఎదుగుదలను చూసి  తట్టుకోలేకనే   అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. జిల్లా నాయకులు దాసరి శ్రీను, జిల్లా మహిళా కన్వీనర్ బత్తిని సత్తి, బీఎస్పీ నాయకులు  దైద ఈశ్వర్, సునీల్, స్టాలిన్, అంబేద్కర్, యాతాకుల శ్రావణ్, లలిత, చెరుకుపల్లి లక్ష్మణ్, పిడమర్తి ఉపేందర్, గోపి ఉన్నారు.

జానయ్యపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు 

జానయ్య తమ భూములను ఆక్రమించుకున్నారని బాధితులు హైదరాబాద్ హెచ్ఆర్సీలో  బుధవారం ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషన్.. ఎంక్వైరీ చేసి పూర్తి రిపోర్ట్​తో హాజరవ్వాలని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను ఆదేశించింది. 

ఆత్మీయ సమ్మేళనంపై సస్పెన్స్‌

సూర్యాపేటలో గురువారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించబోతున్నట్టు 10 రోజుల కిందటే జానయ్య ప్రకటించారు. ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ, పరిస్థితులు మారడంతో సమ్మేళనంపై సస్పెన్స్‌ నెలకొంది. అయితే , ఆయన కుటుంబ సభ్యులు మాత్రం  ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి తీరతామంటున్నారు.