జానయ్య లక్ష మెజార్టీతో గెలుస్తడు

జానయ్య లక్ష మెజార్టీతో గెలుస్తడు
  • జానయ్య లక్ష మెజార్టీతో గెలుస్తడు
  • నాలుగేండ్లుగా పని చేస్తున్న పోలీసులను బదిలీ చేయలే..
  • ఈసీకి కంప్లయింట్ ​చేస్తం
  • జానయ్యపై కేసులు వాదించొద్దని లాయర్లకు మంత్రి జగదీశ్​ రెడ్డి ఆర్డర్​:బీఎస్పీ చీఫ్​ ప్రవీణ్​కుమార్​
  • 55 రోజుల తర్వాత జనంలోకి వచ్చిన జానయ్య 
  • సూర్యాపేటలో భారీ ర్యాలీ 

సూర్యాపేట, వెలుగు : తెలంగాణలో బహుజనవాదం విస్తరిస్తోందని బీఎస్పీ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కేసుల నేపథ్యంలో నల్లగొండ డీసీఎంఎస్  చైర్మన్​వట్టే జానయ్య అజ్ఞాతంలోకి వెళ్లగా 55 రోజుల తర్వాత సూర్యాపేటకు చేరుకున్నారు. సోమవారం ఆయన బీఎస్పీ చీఫ్​ ఆర్​ఎస్​ప్రవీణ్​కుమార్​ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పీ  మాట్లాడుతూ ఎన్నికల్లో జానయ్య లక్ష మెజార్టీతో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. నాలుగేండ్లుగా పని చేస్తున్న ఎస్సైలు, సీఐలు, తహసీల్దార్లను వేరే జిల్లాలకు బదిలీ చేయాలన్న నిబంధనను తుంగలో తొక్కి మంత్రి జగదీశ్ రెడ్డి వారిని ఇక్కడే కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో మూడేండ్లుగా పని చేస్తున్న అధికారులపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.

మంత్రి జగదీశ్ రెడ్డి తో వట్టే జానయ్య కు ప్రాణహాని ఉందని ఆరోపించారు. దీనిపై ఎస్పీకి, సూర్యాపేట రిటర్నింగ్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తామన్నారు. జానయ్యపై పెట్టిన 74 కేసులను ఏ లాయర్ వాదించకుండా సూర్యాపేట బార్ అసోసియేషన్ కు మంత్రి జగదీశ్ రెడ్డి హుకుం జారీ చేశారన్నారు. మాట వినని వారిని పథకాలు రావని భయపెట్టిస్తూ ప్రతిపక్ష నాయకులను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 60మంది బీసీలు ఎమ్మెల్యేలుగా ఉండాల్సిన చోట బీఆర్ఎస్ 23మందికి మాత్రమే అవకాశం కల్పించిందని, కాంగ్రెస్ బిచ్చం వేసినట్లు 34 ఇస్తామని ప్రకటించిందన్నారు.  

పదవులడిగితే తొక్కేస్తున్నారు : జానయ్య

బహుజనులు పాలకుల కోసం పని చేసి, స్థాయికి తగ్గ పదవులు అడిగితే కేసులు పెట్టి తొక్కేస్తున్నారని జానయ్య యాదవ్ ఆరోపించారు. మంత్రి జగదీశ్​రెడ్డి తనను చంపేందుకు రూ.కోటి సుపారీ ఇచ్చారని, దీనికి పోలీసులే సాక్ష్యమన్నారు. బీఆర్ఎస్​లో క్రియాశీలకంగా పని చేసిన వారికి చైర్మన్ పదవి ఇస్తామని మంత్రి డబ్బులు తీసుకున్నారని, వందలాది కాంట్రాక్టర్ల కడుపుకొట్టి ఒకే వ్యక్తికి కాంట్రాక్టులిచ్చి మంత్రి రూ.కోట్లు వెనకేసుకున్నారన్నారు.

 2014కు ముందు రూ. 200 ఖర్చు పెట్టలేని మంత్రి ఇప్పుడు రూ.వేల కోట్లు ఎట్లా సంపాదించారో వైట్​పేపర్ ​రిలీజ్​ చేయాలన్నారు. ఓట్ల కోసమే మెయిన్​ రోడ్డు విస్తరణ చేపట్టారని, మెడికల్ కాలేజీ మాస్టర్ ప్లాన్ మార్చి కాంట్రాక్టర్ల జేబులు నింపారన్నారు. కమిషన్ల కోసమే రోడ్ల మీద వ్యాపారం చేసుకోకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేశారని ఆరోపించారు.

 నాగారంలో కబ్జా చేసిన భూముల్లో బంగ్లా కడుతున్నారని, కలెక్టరేట్ పేరుతో పేద రైతుల నుంచి భూములను గుంజుకొని రేట్లు పెంచి కోట్లు దండుకున్నారన్నారు. వందల ఎకరాల భూములున్న ఆసాములను వదిలేసి పేదల భూములను లాక్కున్నారన్నారు. తప్పు చేయకపోయినా తనపై అక్రమ కేసులు పెట్టారని, వాటిపై సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తనపై పెట్టిన కేసులకు సంబంధించి మంత్రి జగదీశ్​రెడ్డి ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు.