ఈ సర్పంచ్​ మా వాడు..కాదు మా వాడు..కారును అడ్డుకున్న బీఎస్పీ నాయకులు

ఈ సర్పంచ్​ మా వాడు..కాదు మా వాడు..కారును అడ్డుకున్న బీఎస్పీ నాయకులు
  •     బీఆర్ఎస్​ నుంచి బీఎస్పీలో చేరిన సర్పంచ్ కోసం లొల్లి 
  •     మంత్రితో మాట్లాడిస్తామని కారు ఎక్కించబోయిన లీడర్లు 
  •     అడ్డుకున్న బీఎస్పీ నాయకులు

సూర్యాపేట, వెలుగు : ఎన్నికలు సమీపిస్తున్న తరుణం లో నాయకులను కాపాడుకోవడం ప్రధాన పార్టీ అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. ఆత్మకూర్ (ఎస్) మండలంలోని పాతర్లపాడు సర్పంచ్ కేశబోయిన మల్లయ్య యాదవ్ బుధవారం ఉదయం ఇస్తాలపురంలో జరిగిన కార్యక్రమంలో బీఎస్పీలో చేరారు. మల్లయ్య పాతర్లపాడుకు వెళ్లిన తర్వాత అక్కడికి వచ్చిన జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, ఆత్మకూర్(ఎస్) మండల బీఆర్​ఎస్​ పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి..మంత్రి జగదీశ్​రెడ్డితో మాట్లాడిస్తామంటూ సర్పంచ్​ను బలవంతంగా కారులో ఎక్కించే ప్రయత్నం చేశారు.

అదే టైంలో వచ్చిన బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ కారును అడ్డుకొని తమ పార్టీలో చేరిన వారిని ఎలా తీసుకువెళ్తారని గ్రామస్తుల సాయంతో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తమ పార్టీ వాడంటే....తమ పార్టీకి చెందిన వాడంటూ వాదులాడుకున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన బీఎస్పీ కార్యకర్తలు మల్లయ్యను బీఆర్ఎస్ లీడర్ల కారు నుంచి దింపి తీసుకెళ్లారు. సర్పంచ్ మల్లయ్య మాట్లాడుతూ తాను బీఎస్పీలో చేరానని, ఎవరి దగ్గరకు రానని చెప్పడంతో బీఆర్ఎస్​ లీడర్లు వెళ్లిపోయారు.

జానయ్య యాదవ్​ మాట్లాడుతూ మంత్రి జగదీశ్ రెడ్డి తీరు నచ్చక బీఎస్పీలో చేరిన తర్వాత కూడా సర్పంచ్ ను కిడ్నాప్ చేయడం చూస్తే ఎంతకు దిగజారారో అర్థం చేసుకోవచ్చన్నారు. పాతర్లపాడు సర్పంచ్ కేశబోయిన మల్లయ్య యాదవ్, ఇస్తాలపురం ఎంపీటీసీ చెరుకు ఇందిర, లీడర్లు గాదగాని బిక్షపతి, కట్ట అజయ్, పబ్బతి కృష్ణ, కుంచెం కృష్ణ, పాండవుల సురేశ్, ఆరింపుల వంశీరాజు, బొలక మధు, పబ్బతి సైదులు, గాదగాని గణేశ్, జటంగి మహేశ్, వెంకటేశ్, లింగయ్య ఉన్నారు.