బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఐఫోన్ హ్యాకింగ్ ఘటనపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని ఆ పార్టీ అధికార ప్రతినిధులు డిమాండ్ చేశారు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియా సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేశ్ చౌహాన్ మాట్లాడుతూ.. ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ ఫోన్ ను ట్యాంపరింగ్ చేయడం బాధాకరమన్నారు. గతంలో గవర్నర్ తమిళిసై సైతం తన ఫోన్ హ్యాకింగ్ గురవుతోందనే ఆందోళన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎస్పీకి భయపడి.. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకే ఆయన ఫోన్ ను హ్యాక్ చేస్తోందన్నారు.
ఫోన్ హ్యాక్ వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందా ? లేక రాష్ట్ర ప్రభుత్వం ఉందా ? అనేది తేల్చాలని వెంకటేశ్ చౌహాన్ డిమాండ్ చేశారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు లేనప్పుడు.. ఫోన్ ను ఎందుకు పగులగొట్టారో సమాధానం చెప్పాలన్నారు. ప్రజా సమస్యలపై బీఎస్పీ పోరాటం కొనసాగుతుందని పార్టీ అధికార ప్రతినిధి అరుణ క్వీన్ తెలిపారు. అనంతరం బీఎస్పీ అధికార ప్రతినిధి సాంబశివరావు మాట్లాడుతూ.. గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని దొంగిలించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందుకే ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్స్ వస్తున్నాయని గుర్తు చేశారు.