బాసర ట్రిపుల్ ఐటీలో అన్ని సమస్యలే 

బాసర ట్రిపుల్ ఐటీలో అన్ని సమస్యలే 

బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో అన్ని సమస్యలేనని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సోమవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ పరిస్థితిని చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో అరకొర బోధన సిబ్బందితో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మొత్తం 169 ప్రొఫెసర్లకు కేవలం 19 మందే ఉన్నారని, దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని తెలిపారు. గెస్ట్ ఫ్యాకల్టీతో సిలబస్ పూర్తి చేయిస్తున్నారని, అందుకే చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారని వాపోయారు.  

విద్యార్థులకు హాస్టల్‌లో అవసరమైన సామగ్రి, యూనిఫాం, ల్యాప్‌టాప్‌లు అందించడంలో వర్సిటీ అధికారులు విఫలమయ్యారన్నారు. హాస్టల్ మెస్ పరిస్థితి దారుణంగా ఉందని, మెనూ పాటించకుండా ప్రైవేటు కాంట్రాక్టర్లు ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనంలో బొద్దింకలు, కప్పలు వస్తుండటంతో విద్యార్థులు అర్థాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో అన్ని విషయాలకు స్పందించే మంత్రి కేటీఆర్ కు... బాసర విద్యార్థుల కష్టాలు కనబడటం లేదా అని ప్రశ్నించారు. ఇన్ని సమస్యల మధ్య విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగాలు పొందలేకపోతున్నారని పేర్కొన్నారు.  తక్షణమే వీసీ, టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు క్వాలీటి ఫుడ్, వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. 

మరిన్ని వార్తల కోసం:

కేటీఆర్, డీకే శివకుమర్ మధ్య ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్

వరుణ్ తేజ్ మూవీకి టికెట్ రేట్ల తగ్గింపు

బెయిల్ రద్దు చేయాలని సిట్ చెప్పినా ఎందుకు చేయలే?