
సిర్పూర్ నియోజకవర్గం ఆంధ్రా వలస భూస్వామ్య పాలకుల చేతుల్లో కబ్జాకు గురవుతోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సిర్పూర్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కోనేరు కొనప్ప నుంచి విముక్తి చేస్తానని చెప్పారు. ప్రాణహిత, చేవెళ్ళ ప్రాజెక్టును గంగలో కలిపి మేడిగడ్డకు తరలించారని ఆరోపించారు. 10 ఎకరాల ప్రభుత్వ డంపింగ్ యార్డును ఫేక్ పేపర్లు సృష్టించి స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. సిర్పూర్ నియోజకవర్గంలో భూ కబ్జాల వెనక మంత్రి కేటీఆర్ హస్తం ఉందని వ్యాఖ్యానించారు. రేషన్ బియ్యం కుంభకోణంలో కూడా ఎమ్మెల్యే కోనేరు కొనప్ప హస్తం ఉందన్నారు. కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్ అంబేడ్కర్ చౌరస్తాలో బీఎస్పీ నాయకులు నిర్వహించిన ‘బహుజన రాజ్యాధికార మహాసభ’లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సీనియర్ ఆఫీసర్ రాణి కుమిదిని కాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా శాంతికుమారిని నియమించడం ఎంత వరకు సమంజసం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు వీఆర్ఎస్ పలకడం ఖాయమని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు బీఎస్పీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. స్థానికులకు 70 శాతం, బయటివారికి 30 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం)లో బయటివారికి మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.