తెలంగాణలో ముందస్తు ఎన్నికలు: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు​ఆర్​ఎస్ ప్రవీణ్​కుమార్​

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు​ఆర్​ఎస్ ప్రవీణ్​కుమార్​

కామారెడ్డి, వెలుగు: తెలంగాణలో ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని బీఎస్పీ  రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్​చెప్పారు. టీఆర్ఎస్​ పార్టీకి ఎలాంటి సిద్ధాంత బలం లేదని, అట్లాంటి పార్టీని దేశప్రజలు ఎలా ఆదరిస్తారని ప్రశ్నించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో నిర్వహించిన బీఎస్పీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ప్రవీణ్​కుమార్​ మాట్లాడారు. సీఎం కేసీఆర్​ ఆకస్మాత్తుగా ఫామ్​హౌజ్​నుంచి బయటకు వచ్చి జిల్లాల పర్యటనలు, డెవలప్​మెంట్​ప్రోగ్రాంలు, కొత్త సెక్రటేరియట్, 125 అడుగుల అంబేద్కర్​విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ ప్రకటించడం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. బిహార్, పంజాబ్​ రాష్ట్రాల్లో రైతులు, సైనికులకు ఆర్థిక సాయం చేసినంత మాత్రాన ప్రజలు ఆదరించరన్నారు. రాష్ట్రంలోనూ కేసీఆర్​గొప్పగా చేసిందేం లేదన్నారు.  మునుగోడు ఉపఎన్నికల్లో కమ్యూనిస్టుల మద్దతు,  100 మంది ప్రజాప్రతినిధులు,  రూ. 500 కోట్లు ఖర్చు పెడితేగాని గెలవలేని పరిస్థితి ఏర్పడిందని, అలాంటిది కేంద్రంలో గెలుస్తామనుకోవడం వారి భ్రమ అన్నారు. త్వరలో బహుజన రాజ్యాధికార యాత్ర కామారెడ్డి జిల్లాలో నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా ప్రెసిడెంట్​బట్టెంకి బాల్​రాజు, జిల్లా ఇన్​చార్జీలు సురేశ్​గౌడ్,  సాయిలు,  వైస్​ ప్రెసిడెంట్​రాజేందర్, మహిళ కన్వీనర్​వసంత   పాల్గొన్నారు.