బీఎస్పీ గెలిస్తేనే సిర్పూర్ కు విముక్తి : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

బీఎస్పీ గెలిస్తేనే సిర్పూర్ కు విముక్తి  :  ఆర్ ఎస్   ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్, వెలుగు: పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, అక్రమాస్తులు సంపాదించేందుకు కాదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్  ప్రవీణ్  కుమార్  అన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను పోటీ చేస్తున్న సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. సిర్పూర్ గడ్డపై నీలి జెండా ఎగరవేసి బీఎస్పీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తేనే ప్రజలకు విముక్తి లభిస్తుందని, ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే సిర్పూర్ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. 

ఎన్నికల్లో ఓట్ల కోసం నకిలీ బంగారు నెక్లెస్ లను పంచే అవకాశం ఉందని, వాటిని నమ్మి మోసపోవద్దని ఓటర్లకు ఆయన సూచించారు. గోదావరి, ప్రాణహిత జీవనదులున్న ఉమ్మడి ఆదిలాబాద్ సాగునీరు లేక ఎడారిగా మారిందన్నారు. పోడు భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆరె కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. 

మూడు సార్లు ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే కోనప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదని, మళ్లీ ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. కోనప్ప అరాచకాలు, అక్రమాలు పోవాలంటే వచ్చే ఎన్నికల్లో బీఎస్పీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రచారంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, జిల్లా అధ్యక్షుడు లెండుగురే శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు.