సిటీలో అలాంటి ఇల్లు దొరకడం కష్టమే!

సిటీలో అలాంటి ఇల్లు దొరకడం కష్టమే!

న్యూఢిల్లీ: చిన్న కంపెనీలో పనిచేసే ప్రసాద్ ​సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రాజెక్టులను చూస్తున్నారు.  ఇటీవల హైదరాబాద్ శివార్లలోని కొల్లూరు వెళ్లారు. ‘ఇది వేగంగా ఎదుగుతున్న ఏరియా.. ఇక్కడ చాలా ప్రాజెక్టులు వస్తున్నాయి’ అని స్థానిక డెవలపర్లు  ఊరించారు.  ఆయన చూసిన అపార్టుమెంట్లో జిమ్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని సదుపాయాలూ ఉన్నాయి.

రెండు బెడ్​రూమ్​ల ఫ్లాట్​కనీస ధర రూ.60 లక్షలు. ప్రసాద్​కూడా ఇంత మొత్తం పెట్టడానికి కూడా రెడీగానే ఉన్నారు. అయితే సమస్య ఏంటంటే కొల్లూరు.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌లోని చాలా ఆఫీసులు ఉన్న హై-టెక్ సిటీ మాదాపూర్ బెల్ట్ నుండి కనీసం 30-–35 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొల్లూరులో ఆసుపత్రులు, పాఠశాలలు  మాల్స్‌‌‌‌ వంటి సదుపాయాలు రావాలంటే కనీసం 5–-8 సంవత్సరాలు పడుతుందని అంచనా. ఇక్కడి నుంచి ఆయన తన ఆఫీసుకు రావాలంటే  కారే  దిక్కు. దీంతో ఆయన కొల్లూరులో ఇల్లు కొనడానికి బదులు తన ఆఫీసుకు సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకున్నారు.  దీనికి నెలకు రూ. 35 వేల చొప్పున కిరాయి కడుతున్నారు. ఇది నేటి ప్రధాన నగరాల్లోని భారతదేశంలోని మధ్యతరగతి కథ. కోర్​ సిటీలో ఎక్కడా రూ.50 లక్షలలోపు  ఫ్లాట్లు దొరకడం లేదు.  శివార్లలో కొంటే ఆఫీసుకు వెళ్లడం కష్టమవుతోంది. 

కనీసం రూ.50 లక్షలు ..

కేవలం హైదరాబాదే కాదు... బెంగళూరు, పుణె  చెన్నై వంటి మెట్రోలలో బడ్జెట్ ​విభాగం ఇండ్ల ప్రాజెక్టులు తగ్గిపోతున్నాయి. ధరలు కనీసం రూ.50 లక్షల నుంచి మొదలవుతున్నాయి. రూ. 50 లక్షల–రూ.-60 లక్షల బ్రాకెట్‌‌‌‌‌‌లోని ఇండ్లు నగర కేంద్రాలకు కనీసం 30-–40 కి.మీ దూరంలో ఉంటున్నాయి. మధ్యతరగతి వారికి రెండు చాయిస్​లే మిగిలాయి. సొంతింటి నుంచి గంటల తరబడి ప్రయాణించడం లేదా నగరంలో అద్దెకు ఉండటానికి భారీగా డబ్బు చెల్లించడం. కరోనా తర్వాత డెవలపర్లు బడ్జెట్​ రెసిడెన్షియల్ ​సెగ్మెంట్​ను దాదాపు వదిలిపెట్టారు. లగ్జరీ ఆస్తులపై ఫోకస్​ చేస్తున్నారు. ఎందుకంటే లగ్జరీ ప్రాజెక్టుల ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయి. బడ్జెట్​ ఇండ్ల ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. మెజారిటీ బిల్డర్లు కేవలం రూ. 1. 5 కోట్ల బేస్ ధరతో మెగా వెంచర్లను మాత్రమే చేస్తున్నారు. ఇటీవలి అనరాక్ రిపోర్ట్​ ప్రకారం, 2023 మొదటి క్వార్టర్​లో ఏడు మెట్రో నగరాల్లో  ‘అఫోర్డబుల్​ హోమ్స్​’ వాటా 20శాతానికి పడిపోయింది. మొత్తం 1. 14 లక్షల యూనిట్లను విక్రయించగా, వీటిలో అఫోర్డబుల్​హోమ్స్  23,110 యూనిట్లు మాత్రమే. 2019లో వీటి వాటా 40 శాతానికి దగ్గరగా ఉంది. బడ్జెట్​ ఇండ్లపై మార్జిన్ చాలా తక్కువగా ఉండటం వల్లే  డెవలపర్లు వాటి జోలికి వెళ్లడం లేదని గ్లోబల్ రియల్టీ సేవల సంస్థ కుష్‌‌‌‌మన్ & వేక్‌‌‌‌ఫీల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ (హైదరాబాద్) వీరబాబు  అన్నారు.

ఈ నగరాల్లో భూమి ఖర్చులు గణనీయంగా పెరగడం (సగటున 25-–30 శాతం) వల్ల బడ్జెట్ ఇండ్ల ధర ఇంకా పెరిగిందని వివరించారు. ఇంత డబ్బు పెట్టి శివార్లలో ఇల్లు కొన్నప్పటికీ అక్కడ నీళ్లు, ట్రాన్స్​పోర్టేషన్​, వైద్యం, హోండెలివరీ వంటి సదుపాయాలు అరకొరగా ఉంటున్నాయి. బెంగళూరులోని  కొన్ని శివారు ప్రాంతాల్లో నీళ్లను ట్యాంకర్ల ద్వారా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ భారీ ఆస్పత్రులు ఉండవని, చిన్న చిన్న క్లినిక్స్​పై ఆధారపడాలని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియా కార్యదర్శి, చెన్నైకి చెందిన అమిత్ దామోదర్ అన్నారు. బడ్జెట్​ ప్రాజెక్టులలో  సౌకర్యాలు తక్కువని,  నిర్వహణ  ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుందని వివరించారు.  తమ సిటీలోనూ ఇదే పరిస్థితి ఉందని  పూణేలోని  ప్రొఫెషనల్ రియల్టర్స్ ప్రెసిడెంట్​ దర్శన్ చలా అన్నారు. ఈ పరిస్థితి పోవాలంటే భూముల ధరలు తగ్గాలని,  ప్రభుత్వం ప్రత్యేకంగా తన ల్యాండ్ పార్శిల్స్‌‌‌‌లో కొన్నింటిని బడ్జెట్ ఇండ్ల కోసం కేటాయించాలని చెప్పారు.