మిడిల్‌‌‌‌క్లాస్ కోసం ఇండ్లు కట్టండి

మిడిల్‌‌‌‌క్లాస్ కోసం ఇండ్లు కట్టండి

ఇందుకు హెల్ప్‌‌‌‌ చేస్తాం .. రియల్టీకి దన్నుగా ఉంటాం!
ధరణి పోర్టల్‌‌‌‌ సమస్యలను పరిష్కరిస్తం..  ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ రోడ్డుతో రియల్టీ మరింత అభివృద్ధి
రాష్ట్ర హౌసింగ్‌‌‌‌శాఖ మంత్రి ప్రశాంత్‌‌‌‌ రెడ్డి ..క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మిడిల్‌‌‌‌క్లాసు జనం కొనగలిగే హౌసింగ్​ ప్రాజెక్టులపై రియల్టీ కంపెనీలు ఫోకస్‌‌‌‌ చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, అసెంబ్లీ వ్యవహారాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌‌‌‌ రెడ్డి  అన్నారు. ఇలాంటి ప్రాజెక్టులకు సాయం చేసే ప్రపోజల్‌‌‌‌ను కూడా పరిశీలిస్తామని చెప్పారు. సిటీతోపాటు తెలంగాణ అంతటా రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ డెవెలప్‌‌‌‌మెంట్‌‌‌‌కు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.  త్వరలో రాబోయే రీజనల్ రింగ్‌‌‌‌ రోడ్డు వల్ల సిటీ రియల్టీ మార్కెట్‌‌‌‌ మరింత ముందుకు వెళ్తుందని అన్నారు.  కాన్ఫిడరేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ డెవలపర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా (క్రెడాయ్‌‌‌‌) హైదరాబాద్‌‌‌‌లోని హైటెక్స్‌‌‌‌లో శుక్రవారం మొదలుపెట్టిన  ప్రోపర్టీ షో ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌‌‌‌,  మంత్రి కేటీఆర్‌‌‌‌ వల్ల హైదరాబాద్‌‌‌‌.. ఐటీ, రియల్టీ, ఫార్మా, ఏవియేషన్‌‌‌‌ సెక్టార్ల కంపెనీలను భారీగా ఆకర్షించగలిగిందని చెప్పారు. ‘‘రియల్టీ ఎదుగుదలకు ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. సిటీలో శాంతిభద్రతల సమస్యలను పరిష్కరించింది. ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను మెరుగుపర్చింది. 24 గంటలూ కరెంటు ఉంటోంది. నీటి కొరత లేదు. కంపెనీలకు ఇబ్బందులను తొలగించేందుకు టీ ఐపాస్‌‌‌‌, బీపాస్‌‌‌‌లను తీసుకొచ్చింది. భూమి యాజమాన్యం విషయంలో జనం ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసేందుకు ధరణి పోర్టల్‌‌‌‌ను తీసుకొచ్చింది. ఇందులోని రికార్డుల్లో ఒకసారి పేరు రిజిస్టర్‌‌‌‌ అయితే.. భూమికి ఎట్లాంటి ఇబ్బందులూ ఉండవు. అయితే ఈ పోర్టల్​లో కొన్ని సమస్యలు ఉన్నాయని క్రెడాయ్‌‌‌‌ నా దృష్టికి తెచ్చింది. వాటిని త్వరలోనే పరిష్కరిస్తాం. మన రియల్టర్లు కరోనా ఎఫెక్ట్‌‌‌‌ నుంచి మెల్లగా బయటపడుతున్నారు. జనం స్థిరాస్తులు సంపాదించడంపై ఆసక్తి చూపుతున్నారు’’ అని మంత్రి వివరించారు. 
ఈ నెల 15 వరకు ప్రాపర్టీ షో.. 
క్రెడాయ్‌‌‌‌ ప్రాపర్టీ షోను ఈ నెల 15 వరకు నిర్వహించనున్నారు. ఇక్కడ 100 స్టాళ్లలో 1,500 ప్రాజెక్టుల వివరాలను ప్రదర్శిస్తున్నారు. బిల్డర్లు,  డెవలపర్లు, మెటీరియల్‌‌‌‌ వెండర్లు,  ఆర్కిటెక్టులు ఈ ఎగ్జిబిషన్‌‌‌‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా క్రెడాయ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ రామకృష్ణా రావు మాట్లాడుతూ ‘‘కరోనా కష్టకాలంలో ప్రభుత్వ మద్దతు మాకు అత్యంత కీలకంగా మారింది. ఆపద నుంచి బయపడేలా చేసింది. టీఎస్‌‌‌‌–ఐపాస్‌‌‌‌, టీఎస్‌‌‌‌–బీపాస్‌‌‌‌ వల్ల  అత్యంత సులభంగా వ్యాపారాలను నిర్వహించుకోవడం సాధ్యపడుతోంది. మహమ్మారి కారణంగా అన్ని మినహాయింపులను ఏడాదిపాటు పొడగించాలన్న  మా రిక్వెస్ట్‌‌‌‌కు ప్రభుత్వం ఒప్పుకుంది. దీనివల్ల కొన్ని ఫీజులు మాఫీ అవుతాయి. పర్మిట్‌‌‌‌ ఫీజులు, అభివృద్ధి ఫీజులు, క్యాపిటలైజేషన్‌‌‌‌ చార్జీలను వాయిదా పద్ధతిలో చెల్లించడం సాధ్యమవుతుంది. ఐటీ/ఐటీఈఎస్‌‌‌‌ రంగం, వేర్‌‌‌‌హౌసింగ్‌‌‌‌, ఏవియేషన్‌‌‌‌, హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌ వంటి సెక్టార్లలో జాబ్స్‌‌‌‌ పెరుగుతున్నాయి. ఫలితంగా రియల్టీకి డిమాండ్‌‌‌‌ బాగుంటుంది. దేశంలో అత్యధిక పెట్టుబడులను హైదరాబాద్‌‌‌‌ నగరమే సాధించింది. మన దగ్గర అతి తక్కువ ఇన్వెంటరీ ఉంది. ఈ సంవత్సరం చాలా కొత్త  ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి’’ అని వివరించారు.

రియల్టీలో ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లకు ఇదే మంచి తరుణం..
 క్రెడాయ్‌‌‌‌ జనరల్‌‌‌‌ సెక్రటరీ రాజశేఖర్‌‌‌‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘ హైదరాబాద్‌‌‌‌లో పెద్ద ఇండ్లకు గిరాకీ పెరుగుతోంది. మహమ్మారి సమయంలోనూ డిమాండ్‌‌‌‌ తగ్గలేదు. కంపెనీలకు  ఇప్పటికీ  హైదరాబాదే ఇష్టమైన సిటీ! తగిన ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌, చురుకైన  పరిపాలన, వ్యాపార అనుకూల విధానాలు ఇందుకు కారణం.  టీఎస్‌‌‌‌ఐఐసీ 10 కొత్త ఇండస్ట్రియల్​ పార్కులను అభివృద్ధి చేయడంతో పాటుగా 810 ఎకరాలను 453 ఇండస్ట్రీలకు కేటాయించింది. వీటిద్వారా 6,023 కోట్ల రూపాయల పెట్టుబడులు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఎలక్ట్రానిక్​ వెహికల్స్​ (ఈవీ), బ్యాటరీ ఇండస్ట్రీలకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఫలితంగా మా రియల్టీ ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుంది’’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం నగరంలో అద్దెలు, ఆస్తుల ధరలు తక్కువగానే ఉన్నాయని, రియల్టీలో ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లకు ఇదే మంచి టైమని అన్నారు. రాబొయే కొద్ది సంవత్సరాలలో  ఇక్కడ ఆస్తుల ధరలు 30–40 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని రాజశేఖర రెడ్డి అన్నారు.