కంటెయినర్‌ డబ్బాలతో ఇల్లు కట్టుకోవచ్చు

కంటెయినర్‌ డబ్బాలతో ఇల్లు కట్టుకోవచ్చు

కొత్త ట్రెండ్ ఎకో ఫ్రెండ్లీ కంటెయినర్ హోమ్

పూర్తిగా షిప్పింగ్ కంటెయినర్ తో తయారీ..

సులువుగా ఎక్కడికైనా తరలివచే వీలు ​

లైఫ్ స్పాన్ 70 నుండి 80 ఏళ్లు 

విలాసవంతమైన అన్ని సౌక్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు 

ఈమధ్య సిటీల్లో నే కాదు, పల్లెల్లో కూడా ఒక్కో ఇల్లు ఒక్కో డిజైన్‌ లో ఉంటోంది. అంతలా జనంలో కొత్త డిజైన్లపై ఇంట్రెస్ట్ పెరిగింది. అయితే అందులో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ మార్కెట్లో నడుస్తోంది మాత్రం ‘ఎకో ఫ్రెండ్లీ కంటెయినర్ హోమ్’. వీటిని పూర్తిగా షిప్పింగ్ కంటెయినర్స్‌ తో తయారు చేస్తారు. పైగా ఈ ఇళ్లను ఒకచోటి నుంచి మరోచోటికి సులువుగా మార్చొచ్చు. ప్రతి గదిని ట్రెండ్ కి తగ్గట్లు డిజైన్ చేసుకోవచ్చు.

‘ఇల్లు కట్టి చూడు..  పెళ్లి చేసి చూడు..!’ అన్నది పెద్దల మాట. ఎందుకంటే ఈ రెండింటికీ ఖర్చు మామూలుగా ఉండదు. అవును మరి.. ఈరోజుల్లో ఇల్లు కట్టాలంటే లక్షలకు లక్షలు కావాలి. మారుతున్న డిజైన్లకు అనుగుణంగా కట్టాలంటే కోటి రూపాయలు కావాల్సిందే. మరి అలాంటి ఇల్లు కట్టడానికి మొదట బేస్‌‌మెంట్​.. తర్వాత పిల్లర్లు.. ఆపైన సిమెంట్​, ఇటుకలతో గోడలు కట్టాలి. కానీ అవేవీ లేకుండా ఇల్లు తయారు చేసి ఇస్తామంటున్నాయి కొన్ని కంపెనీలు. ఎవరికి కావాల్సిన డిజైన్లలో వాళ్లకు ఇళ్లను తయారు చేసి ఇస్తున్నారు. మరి ఈ రెడీమేడ్​ ఇళ్ల కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం.

సిమెంట్​.. ఇటుకలు.. గోడలు.. రాళ్లతో బేస్​మెంట్​ లేకుండా ఇల్లు కట్టడం ఏంటబ్బా?’ అని ఆలోచిస్తున్నారా? అవును.. అవేవీ లేకుండానే తక్కువ ధరలో ఇల్లు కట్టుకోవచ్చు. అంతేకాదు, ఆ ఇంటిని ఎక్కడికంటే అక్కడకు తీసుకెళ్లొచ్చు. పైగా ఈ ఇంటికి పగుళ్లు రావడం అసాధ్యం. ఇంతకీ ఆ ఇళ్లను దేంతో తయారు చేస్తారో తెలుసా? అదేనండీ.. పెద్దపెద్ద సామగ్రిని దేశవిదేశాలకు తరలిస్తారు కదా.. ఇనుప కంటెయినర్లలో….! అలాంటి కంటెయినర్లతోనే డ్రీమ్​ హౌజ్​లను తయారు చేస్తామంటున్నారు హైదరాబాద్​కు చెందిన ‘అవుట్​ ఆఫ్​ ది బాక్స్​’ కంపెనీ ఫౌండర్స్​ కృష్ణ చైతన్య, ఎల్​వీ సుమన్​ సాయి.​

మినిమలిజం ట్రెండ్

తక్కువ వనరులతో పెద్దగా, గొప్పగా జీవించడమే మినిమలిజం కాన్సెప్ట్​. అలాగే ఈమధ్య కాలంలో  సస్టెయినబుల్​ లైఫ్​స్టైల్​, ఎకో ఫ్రెండ్లీ లివింగ్​పై చాలామందికి అవగాహన పెరిగింది. అందుకే ఇల్లు, ఆఫీసుల కన్‌‌స్ట్రక్షన్​ విషయంలోనూ ఆచితూచి ముందుకెళ్తున్నారు. అప్పటికే కన్‌‌స్ట్రక్షన్, ఇంజనీరింగ్​, టెక్నాలజీ బ్యాక్​గ్రౌండ్​గా ఉన్న ‘అవుట్​ ఆఫ్​ ది బాక్స్’​ కంపెనీ.. సస్టెయినబుల్​ ప్రొడక్ట్స్​పై దృష్టి పెట్టింది. అందులో నుంచి వచ్చిందే ఈ కంటెయినర్​ లివింగ్​ కాన్సెప్ట్​. తక్కువ వనరులు వాడి ప్రకృతిని కాపాడటం అనే కాన్సెప్ట్‌‌ను పరిచయం చేస్తూ, మినిమలిజాన్ని ప్రమోట్​ చేస్తున్నారు.

ఎక్కడికైనా తీసుకెళ్లే ఇల్లు..

కాంక్రీట్​, సిమెంట్​ బిల్డింగ్స్​తో బోర్​ కొడుతోంది అనుకునే వాళ్లు.. ఎకో ఫ్రెండ్లీ కంటెయినర్​ హోమ్​ని ఎంచుకోవచ్చు. షిప్పింగ్​ కంటెయినర్​ మెటీరియల్​తో తయారు చేసిన ఇళ్లు దృఢంగా ఉండటంతో పాటు రీసైక్లింగ్​, రీయూజ్​​కి పనికొస్తాయి. అలాగే వీటిని గదులవారీగా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. పైగా హాల్, కిచెన్​, బెడ్​రూమ్, బాత్​రూమ్​​లను కంటెయినర్లతోనే స్పెషల్​గా డిజైన్​ చేసుకోవచ్చు. రకరకాల మాడ్యులర్​, ఫ్లెక్సిబుల్​ డిజైన్స్​తో అందర్నీ ఆకట్టుకుంటున్నాయి ఈ కంటెయినర్​ హోమ్స్. అంతేకాదు, ఇవి షిప్పింగ్​ కంటెయినర్స్​ కాబట్టి వీటికి అన్నిరకాల వాతావరణాలను తట్టుకునేంత శక్తి ఉంటుంది. వీటి లైఫ్​ స్పాన్​ డెబ్భై, ఎనభై ఏళ్ల వరకు ఉంటుందని కంపెనీ యజమానులు చెప్తున్నారు. అయితే రెసిడెన్షియల్ పర్పస్​​గా వాడుకోవడానికి మన దగ్గర పర్మిషన్స్​ లేవు. తెలంగాణ గవర్నమెంట్​ ఈ కంటెయినర్​ హోమ్స్​కు పర్మిషన్ ఇచ్చే విషయం​ పరిశీలిస్తోంది.పై వర్క్​ చేస్తున్నాయి. త్వరలో ట్రెడిషనల్​ బిల్డింగ్స్​కి ఇచ్చినట్టే వీటికీ పర్మిషన్​ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కాలనీల్లో ఈ కంటెయినర్ హోమ్స్​ని ప్లాన్​ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇవి ఫామ్​హౌజ్​, సైట్​ హౌజ్​లకు బాగా ఉపయోగపపడతాయి.

కమర్షియల్​ కంటెయినర్స్​

రీజనబుల్​ ధరల్లో షిప్పింగ్​ కంటెయినర్​ ఆఫీస్​ రూమ్​లను అందిస్తోంది ‘అవుట్​ ఆఫ్ ది​ బాక్స్’ కంపెనీ​. కొత్తగా ఆకర్షణీయంగా తయారు చేసి ఆఫీస్​ రూమ్​లను ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ కమర్షియల్​ కంటెయినర్లు చిన్నచిన్న స్టార్టప్​ కంపెనీలకు బాగా ఉపయోగపడతాయి. అలాగే షాప్స్, కమర్షియల్​  స్టోర్​ రూమ్స్​, రెస్టారెంట్స్​, పార్లర్స్​ వంటి బిజినెస్​లకు కూడా బాగుంటాయి. తక్కువ ఖర్చుతో బిల్డింగ్​ కావాలనుకుంటే ఇవి కరెక్ట్​గా సెట్​ అవుతాయి.

ఇండస్ట్రియల్​ కంటెయినర్స్​

ఇండస్ట్రీలకు ఉపయోగపడేలా పూర్తిగా స్టీల్​ ఫ్రేమ్డ్​​ బిల్డింగ్​ సిస్టమ్స్​​ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. కమర్షియల్​, ఇండస్ట్రియల్​ ఏరియాల్లో కనిపించే.. వేర్​హౌజ్​, డిస్ట్రిబ్యూషన్​ సెంటర్​, ఇండస్ట్రియల్​ స్టోరేజ్​ రూమ్​ల కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు.ఈ కంటెయినర్లు ఎనర్జీ ఎఫీషియంట్​గా పని చేస్తాయి.

రీజనబుల్​ కాస్ట్​..

అవుట్​ ఆఫ్​ ది బాక్స్​ కంపెనీ ప్రస్తుతం 20/8, 40/8 సైజుల్లో.. రెండురకాల కంటెయినర్​ హోమ్స్​ని అందిస్తోంది. చిన్న కంటెయినర్​ హోమ్​ మూడు లక్షల నుంచి దొరుకుతుంది.లగ్జరీ మెటీరియల్​ వాడితే ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అలాగే పెద్ద కంటెయినర్​ హోమ్​కి ఐదు నుంచి పది లక్షల రూపాయలు అవ్వచ్చు. టెంపరరీగా ఫామ్​హౌజ్​, రియల్​ ఎస్టేట్​ ఆఫీస్​లు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తే, వీటిని ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు కాబట్టి బెస్ట్​ ఆప్షన్​గా చెప్పొచ్చు. అలాగే కస్టమర్లకు కావాల్సినట్లుగా అన్నిరకాల ఏర్పాట్లు ఆ కంటెయినర్​ హోమ్​లో సెట్​ చేసి ఉంటాయి. ముఖ్యంగా ఆయా ప్రాంతాల టెంపరేచర్​కి తగ్గట్లు కంటెయినర్​కి ఇన్య్సులేషన్​ చేస్తామంటున్నారు కంపెనీ ఫౌండర్లు.– నిఖిత నెల్లుట్ల

మేక్​ ఇన్​ ఇండియా.. కంటెయినర్​ హోమ్​ హైలైట్స్​

ఎక్కడికైనా తీసుకెళ్లగల ప్రొడక్ట్ ప్లస్​​ రీయూజబుల్​ హోమ్​.

ఎన్విరాన్మెంటల్​ ఫ్రెండ్లీ, ఇన్నోవేటివ్​ కాన్సెప్ట్​.

ఎకనామికల్​గా భారం తక్కువ ఉంటుంది.

నాలుగు ఫౌండేషన్​ పిల్లర్స్​ ఉంటాయి.

చెక్కుచెదరని ఫ్యాబ్రికేటెడ్​ స్టీల్​ ప్యానెల్స్​ వాడతారు.

ఎక్కువ టెంపరేచర్​ను తట్టుకునేలా ఇన్స్యూలేషన్​ ఉంటుంది.

వెదర్​ప్రూఫ్​, లీక్​ ప్రూఫ్​ కారణంగా ఎలాంటి వాతావరణ మార్పుల్లోనూ నష్టం ఉండదు.

ఏసీ, ఫైర్​ అలారమ్​, సీసీటీవీ, స్మోక్​ డిటెక్టర్స్​ వంటి మోడర్న్​ ఫీచర్స్​ని స్పెషల్​గా అరేంజ్​ చేసుకోవచ్చు.

వాల్​ ప్యానెల్స్​, ఫ్లోర్​ టైలింగ్​, ప్లంబింగ్​, ఎలెక్ట్రికల్స్​, ఫిట్టెడ్​ బాత్​రూమ్స్​,

స్టీల్​ స్ట్రక్చర్​తో అన్ని వసతులు ఉంటాయి.

ఫార్మ్ హౌజ్ ఆర్డర్స్ పెరిగాయి..

‘‘విదేశాల్లోలాగా ప్రస్తుతం మన దగ్గర రెసిడెన్షియల్​ పర్పస్​ కంటెయినర్​ హోమ్స్​కి పర్మిషన్​ లేదు. కానీ ఫామ్​​హౌజ్​, రిసార్ట్​లో రూమ్స్​, సైట్​ పర్పస్​ హౌజులకు ఆర్డర్స్​ వస్తున్నాయి. హైదరాబాద్​ అవుట్​స్కర్ట్స్​లో చాలా వెంచర్లు ఉన్నాయి. అక్కడ ఆఫీసుల కోసం మాకు ఆర్డర్స్​ వస్తున్నాయి. మా కంటెయినర్​ హౌజ్​ ఎక్కడికంటే అక్కడికి షిఫ్ట్​ చేసుకోవచ్చు కాబట్టి.. వాళ్లు వెంచర్​ మార్చిన ప్రతిసారీ కొత్త ఆఫీసు కట్టుకోనక్కర్లేదు. అలాగే చాలామందికి ఆర్గానిక్​ ఫార్మింగ్​పై ఇంట్రెస్ట్​ పెరిగింది. దాంతో సాఫ్ట్​వేర్​ ప్రొఫెషనల్స్​ కూడా ఎంతోకొంత ఫార్మ్​లాండ్​ కొని, వీకెండ్స్​కి అక్కడికి వెళ్తున్నారు. పైగా ఇప్పుడు వర్క్​ ఫ్రమ్​ హోమ్​ ఆప్షన్​ చాలామందికి ఉంటోంది. అందువల్ల ఫామ్​హౌజ్​ కోసం చాలా ఆర్డర్స్​ వస్తున్నాయి. ట్రెడిషనల్​ హౌజ్​ కట్టాలంటే ఆరు నెలల నుంచి ఏడాది పడుతుంది. కానీ మేము కేవలం నలభై ఐదు రోజుల్లో కావాల్సిన విధంగా తయారు చేసిస్తాం. అలాగే కేవలం కంటెయినర్​ చేసి ఇవ్వడం కాదు.. కస్టమర్​కి అన్ని సౌకర్యాలు కల్పించి ఇవ్వడమే మా అచీవ్​మెంట్​” అంటున్నాడు కో–ఫౌండర్​ కృష్ణ చైతన్య.