వేలూరులో దొంగల బీభత్సం

వేలూరులో దొంగల బీభత్సం
  •     తాళం వేసిన 8 ఇండ్లలో చోరీ 
  •     రూ.6 లక్షల నగదు, 27 తులాల బంగారం చోరీ
గజ్వేల్, వెలుగు: తాళం వేసి ఉన్న 8 ఇండ్లలో చోరీ జరిగిన సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్​ మండలంలోని వేలూరు గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్ఐ శివకుమార్​ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన  చీమల నవీన్, కుమ్మరి వేణు, గడ్డం లక్ష్మణ్, కటికల పెంటయ్య, కటిక భాగ్యమ్మ, మల్యాల దశరథ, కటిక చంద్రయ్య, కటిక మల్లేశం కుటుంబ సభ్యులు వేర్వేరు పనుల మీద ఇంటికి తాళాలు వేసి వెళ్లారు. 
 
బుధవారం రాత్రి దొంగలు ఆయా ఇండ్ల తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి  అందినకాడికి దోచుకెళ్లారు. మొత్తంగా 27తులాల బంగారం, 30తులాల వెండి, రూ.6 లక్షల వరకు నగదు ఎత్తుకెళ్లారని ప్రాథమికంగా గుర్తించారు. గురువారం ఉదయం చుట్టుపక్క వారు పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.