సాధారణ మరణమంటూ ఏడాదిన్నర కింద ఖననం

సాధారణ మరణమంటూ ఏడాదిన్నర కింద ఖననం
  • ఒకరి ఫిర్యాదుతో పోలీసుల విచారణ
  • నిద్ర మాత్రలిచ్చి చంపామన్న నిందితులు  
  • ఫోరెన్సిక్ ​ల్యాబ్​కు బాడీ పార్ట్స్​
  • మెదక్​ జిల్లాలో దారుణం

మెదక్​ (చేగుంట), వెలుగు :  మెదక్​ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్​లో ఏడాదిన్నర కింద ఓ వ్యక్తిని చంపేసిన కుటుంబీకులు సాధారణ మరణం అని నమ్మించి ఖననం చేశారు. అయితే, గుర్తు తెలియని ఓ వ్యక్తి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సమాధిని తవ్వి బాడీ పార్ట్స్​ను ఫోరెన్సిక్ ​ల్యాబ్​కు పంపించారు. మరో వైపు కుటుంబసభ్యులను విచారించగా పొలం కోసం తామే చంపామని అంగీకరించారు. అయితే, ఈ విషయాలను పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... అనంతసాగర్​ గ్రామానికి చెందిన కావేటి కిష్టయ్య (65) ఏడాదిన్నర కింద చనిపోయాడు. కుటుంబసభ్యులు అతడిది సాధారణ మరణమేనని నమ్మించి ఖననం చేశారు. ఇటీవల ఓ వ్యక్తి కిష్టయ్య మామూలుగా చనిపోలేదని, అతన్ని కుటుంబసభ్యులే పథకం ప్రకారం చంపేసి, సాధారణ మరణంగా నమ్మించారని పోలీసు ఉన్నతాధికారికి సమాచారం ఇచ్చాడు. దీంతో చేగుంట పోలీసులు చనిపోయిన కిష్టయ్య కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకుని విచారించగా, తామే కిష్టయ్యను మర్డర్​ చేసి సాధారణ మరణంగా చిత్రీకరించామని అంగీకరించారు. దీంతో సోమవారం సికింద్రాబాద్ గాంధీ దవాఖాన నుంచి డాక్టర్లను అనంతసాగర్​రప్పించి కిష్టయ్యను ఖననం చేసిన చోట తవ్వి ఎముకలను ఫోరెన్సిక్​ ల్యాబ్​కు పంపించారు. కిష్టయ్య పేరుమీద మూడెకరాల భూమి ఉండగా, దానిని తమ పేరు మీద చేయాలని ఒత్తిడి తేగా అందుకు అంగీకరించకపోవడంతో నిద్రమాత్రలు ఇచ్చి చంపేసినట్టు నిందితులు వెల్లడించినట్టు తెలిసింది.  

చెల్లిని పెండ్లి చేసుకున్నాడని వరుడి అన్న హత్య

మెదక్ :​ తన సోదరిని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడనే కోపంతో అతడి అన్నను కత్తితో పొడిచి చంపాడో వ్యక్తి. జిల్లా కేంద్రమైన మెదక్​లో సోమవారం రాత్రి ఈ హత్య జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..నవాపేట వీధికి చెందిన పోతరాజు నగేశ్​(25)​తమ్ముడు ఉదయ్​ పాల్, బొందుగుల అంజిత్​కుమార్ సోదరి భవాని ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ పెద్దలు పెండ్లికి అంగీకరించలేదు. దీంతో ఆదివారం హైదరాబాద్​లో పెండ్లి చేసుకున్నారు. విషయం తెలిసి అంజిత్ కుమార్  ఆగ్రహంతో ఊగిపోయాడు. సోమవారం ఉదయ్​పాల్ ​ఇంటికి వెళ్లి అతడి కుటుంబసభ్యులతో గొడవ పడ్డాడు. కత్తితో దాడి చేయడంతో ఉదయ్​పాల్ ​అన్న నగేశ్ ​తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు. దాడిని అడ్డుకోబోయిన నగేశ్​ తండ్రి యాదగిరి, వరుసకు సోదరుడయ్యే పోతరాజు సాయికుమార్​ గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.