హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రమాదం.. నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రమాదం.. నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం పిట్టంపల్లి దగ్గర నేషనల్ హైవే 65పై ఇంజన్‎లో షార్ట్ సర్క్యూట్‎తో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సులోని ప్రయాణికులను అలర్ట్ చేశారు. ప్రయాణికులు వెంటనే బస్సులో నుంచి కిందకు దిగారు. ప్రయాణికులు దిగగానే మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ప్రమాదానికి గురైన బస్సు విహరి ట్రావెల్స్‎కు చెందిన బస్సుగా గుర్తించారు. బస్సు హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి 10 నిమిషాల ముందు చౌటుప్పల్ శివారులో బస్‎ను టీ బ్రేక్‎కి ఆపారు. బస్సు తిరిగి  బయలుదేరిన 10 నిమిషాల్లోనే మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు వెంటనే బస్సులో నుంచి కిందకు దిగడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

బస్సులో మంటలను ఆర్పడానికి ఎలాంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవని.. ఫిట్‎నెస్ లేని వాహనాలను రోడ్డు పై తిప్పడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు తరుచు జరుగుతున్నాయని ప్రయాణికుల ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చిట్యాల సీఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణం ఏంటన్నది ఆరా తీశారు. 

ప్రాణ నష్టం తప్పడంతో ప్రయాణికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఆంధ్రప్రేదశ్‎లోని కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు  ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటల్లో తగలబడి 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన పూర్తిగా మరువకముందే ప్రైవేట్ ట్రావెల్స్‎లో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.