కొత్తగూడెం డిపోలో.. బస్సులను తగ్గిస్తున్నరు

కొత్తగూడెం డిపోలో.. బస్సులను తగ్గిస్తున్నరు
  • డిపో స్థాయిని తగ్గించేందుకేనని యూనియన్​నాయకుల ఆరోపణ
  • సర్వీసులు తగ్గడంపై ఆందోళనలో ఉద్యోగులు 
  • రవాణా మంత్రి ఇలాకాలోనే బస్సులు తగ్గడంతో ప్రయాణికుల అవస్థలు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రమైన కొత్తగూడెం బస్సు డిపోలో బస్సులు తగ్గుతున్నాయి.  ఆరు నెలల్లో 30కి పైగా సర్వీసులు తగ్గిపోయాయి. దీంతో పలు రూట్లలో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. సర్వీసులు క్యాన్సిల్ ​చేయడంపై అధికారులను ప్రశ్నిస్తే ప్యాసింజర్స్​ ఉండట్లేదని చెబుతున్నారు. డిపో స్థాయిని తగ్గించేందుకే బస్సులు తగ్గిస్తున్నారని యూనియన్​ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలాగే తగ్గిస్తూ పోతే తమ భవిష్యత్​ ఏంటని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.  రాష్ట్ర రవాణా మంత్రి సొంత జిల్లాలోనే ఇలా బస్సులు తగ్గించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

6 నెలల్లో 30 బస్సులు తగ్గాయి..
6 నెలల కింద కొత్తగూడెం డిపోలో 98 బస్సులు ఉండేవి. వీటిలో 65 ఆర్టీసీవి కాగా 33 హైర్​బస్సులు. 65 ఆర్టీసీ బస్సుల్లో ప్రస్తుతం 25 ఉన్నాయి. మొత్తంగా ప్రస్తుతం 58 బస్సులే ఉన్నాయి. దీంతో కొన్ని రూట్లకు సర్వీసులను క్యాన్సిల్​చేశారు. తిరుపతితో పాటు కోదాడకు సర్వీస్​లు క్యాన్సిల్​ చేశారు. గతంలో హైదరాబాద్​కు డే టైంలో మూడు సూపర్​లగ్జరీ సర్వీసులుండగా వాటిని రద్దు చేశారు. మంచిర్యాల సర్వీసును నిలిపేశారు. మిర్యాలగూడ, ఖమ్మానికి బస్సులను తగ్గించారు. దీంతోపాటు వివిధ రూట్లను క్యాన్సిల్​చేశారు. బస్సుల కుదింపుతో పండుగ టైంలో ప్యాసింజర్లు ప్రైవేట్​వాహనాలను ఆశ్రయించక తప్పని పరిస్థితి. 

శిథిలావస్థలో జిల్లా బస్టాండ్..
జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని ఆర్టీసీ బస్టాండ్​ శిథిలాస్థకు చేరుకుంది. దాదాపు ఐదు దశాబ్దాల కింద నిర్మించిన ఈ బస్టాండ్​ను పట్టించుకునేవారే లేరు. రవాణ శాఖా మంత్రి ఇలాకాలో అందులోనూ జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెం బస్టాండ్​ బూత్​ బంగ్లాగా మారుతోంది. బస్టాండ్​ ఆవరణలోని రోడ్డు కంకర తేలడంతో బస్సులు తరచూ రిపేర్లకు గురవుతున్నాయి.  బస్టాండ్​ పరిసరాలు అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ఇప్పటికైనా మంత్రి పువ్వాడ అజయ్​ స్పందించి బస్టాండ్​ అభివృద్ధితో పాటు డిపోలో బస్సులు తగ్గించకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. 

బస్సుల కుదింపుతో నష్టం
బస్సుల కుదింపుతో అన్ని విధాలా నష్టం. ప్రయాణికులకు పూర్తి స్థాయిలో సేవలందవు. ఉద్యోగులపై పనిభారం పెరుగుతుంది. . డిపో స్థాయి తగ్గితే మారుమూల ప్రాంతాలకు బస్సులు తిరిగే అవకాశముండదు. ఇలాగే కొనసాగితే డిపో మూసి వేసే పరిస్థితి వస్తుంది. ఇటీవల హైదరాబాద్​సిటీ పరిధిలో రెండు డిపోలను మూసేశారు. 
- జాకోబ్​, స్టాఫ్​ అండ్​ వర్కర్స్​ యూనియన్​ డిపో సెక్రటరీ

డిపోలను మూసివేసేందుకే.. 
దశల వారీగా బస్సులను కుదిస్తూ చివరికి కొత్తగూడెం డిపోను మినీ డిపోగా మార్చే ప్రయత్నమిది. రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా బస్సులను తగ్గిస్తూ డిపోలను మూసివేసేందుకు యాజమాన్యం కుట్ర పన్నుతోంది. ఖమ్మం రీజియన్​లో బస్సుల కుదింపుతో పదుల సంఖ్యలో డ్రైవర్లు, కండక్టర్లను ఇతర జిల్లాలకు డిప్యూటేషన్లపై పంపించారు. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. 
- కె. భాస్కర్​, రాష్ట్ర నాయకులు, ఆర్టీసీ ఎంప్లాయీస్​ యూనియన్