సడక్​ సక్కగలేదని 500 ఊర్లకు బస్సులు బంద్​​

సడక్​ సక్కగలేదని 500 ఊర్లకు బస్సులు బంద్​​
  • కొన్ని ఊర్లకు అంబులెన్స్​లు పోవాలన్నా తిప్పలే
  • రిపేర్లకు రూ.వెయ్యి కోట్లు అడిగిన ఆఫీసర్లు
  • రూ.60 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్న సర్కారు

హైదరాబాద్ / నెట్​వర్క్, వెలుగు: రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా సడక్​ సక్కగలేదు. కంకర తేలి, గుంతలు పడి, డాంబర్​ కొట్టుకుపోయి రోడ్లన్నీ సత్రోలైనయ్. రోడ్లు  మంచిగలేక తరచూ యాక్సిడెంట్లు ఐతున్నయ్​.. జనం ప్రాణాలు గాలిలో కలుస్తున్నయ్​. ఏ ఊరికన్నా, ఏ కాలనీకన్నా సర్కారు పెద్దలో,  ఉన్నతాధికారులో వస్తున్నారంటే అప్పటికప్పుడు రోడ్లు వేసి.. మమ అనిపిస్తున్నరు. ఆ తర్వాత అవి ఎప్పటిలెక్కనే తయారైతున్నయ్​. కొన్ని ఊర్లకైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా కొత్తగా రోడ్డు వేయలేదు. రాష్ట్రంలోని ఆర్ అండ్ బీ రోడ్లపై ప్రతి 10 కిలో మీటర్లకు ఒక రిపేర్​ ఉన్నట్లు ఆఫీసర్లు చెప్తున్నరు. మొత్తం 4,472 కిలో మీటర్ల రోడ్లు దెబ్బతిన్నయని, రిపేర్ల కోసం దాదాపు రూ.1,000 కోట్లు అవసరమని రాష్ట్ర సర్కార్​కు  ప్రపోజల్స్​ పంపారు. కానీ ప్రభుత్వం ఈసారి కేవలం రూ. 60  కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నది. నిలువెత్తు గుంతలకు తోడు కల్వర్టులు కొట్టుకుపోవడం, వంతెనల వద్ద  అప్రోచ్ రోడ్లు తెగిపోవడంతో ఏకంగా 500 గ్రామాలకు ఆర్టీసీ అధికారులు బస్సులను బంద్ ​పెట్టారు. దీంతో పట్నాలకు పాలు, పండ్లు, కూరగాయలు, సరుకులు తెచ్చే పల్లె ప్రజలు.. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే స్టూడెంట్లు కష్టాలు పడ్తున్నరు. 

ఎక్కడికక్కడ పెండింగ్​

రాష్ట్రంలో 24,425 కిలోమీటర్ల ఆర్​అండ్ బీ రోడ్లు ఉండగా.. ఇందులో ఇప్పటికే వేల కిలో మీటర్ల సడక్​లు రిపేర్​కు వచ్చాయని ఆఫీసర్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదలకే  22 జిల్లాల్లో  515 చోట్ల రోడ్లు దెబ్బతిన్నట్లు రిపోర్టు ఇచ్చారు.  217 చోట్ల రోడ్లు తెగిపోయాయని, అనేక చోట్ల కల్వర్టులు, లోలెవల్ వంతెనలు, అప్రోచ్​రోడ్లు కొట్టుకుపోయాయని నివేదించారు. కేవలం ఈ ఏడాది వర్షాకాలంలోనే 828 కిలో మీటర్ల మేర రోడ్లు డ్యామేజీ అయ్యాయని,  వీటి రిపేర్లకు సుమారు రూ.500 కోట్లు అవసరమని ప్రతిపాదించారు.  సర్కారు మాత్రం నామమాత్రంగా నిధులు కేటాయించి  చేతులు దులుపుకున్నది. ఆ ఫండ్స్​ కూడా సీఎం కేసీఆర్​, మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు ప్రాతినిధ్యం వహించే గజ్వేల్​, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకే ఎక్కువ వచ్చాయి. దీంతో మిగిలిన చోట్ల రోడ్లు, వంతెనలు, కల్వర్టుల రిపేర్లు ఎక్కడికక్కడ పెండింగ్​లో పడ్డాయి. 

500 గ్రామాలకు బస్సులు బంద్

రోడ్లు మంచిగలేవని సుమారు 500 గ్రామాలకు ఆర్టీసీ అధికారులు బస్సులను బంద్​పెట్టారు. టీఎస్​ఆర్టీసీ 97 డిపోల పరిధిలో 3,600 పల్లె వెలుగు బస్సులు గ్రామాలకు నడుపుతున్నారు. కానీ రెండేండ్ల నుంచి వర్షాలు, వరదల కారణంగా రూరల్​ ఏరియాల్లో వందలాది రోడ్లు దెబ్బతిన్నాయి. బ్రిడ్జిల దగ్గర అప్రోచ్​రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోయాయి. దీంతో సుమారు 500 గ్రామాలకు బస్సులను బంద్​పెట్టినట్లు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. బస్సులు బందైన గ్రామాల్లో కొన్ని మండల కేంద్రాలు కూడా ఉన్నాయి.   

ఎమ్మెల్యేలను నిలదీస్తున్న జనం

నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా రోడ్లు రిపేర్లు చేయకపోవడంతో ఆగ్రహిస్తున్న జనం ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. గత నెల 29న మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లి గ్రామానికి చెందిన అశోక్.. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఫోన్ చేసి మండలంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, అవి రిపేర్​కావాలంటే రాజీనామా చేయాలని డిమాండ్​చేశారు. అదే నెల 31 న సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి కి చెందిన కంది సత్యనారాయణరెడ్డి.. హుస్నాబాద్​ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ కు ఫోన్ చేసి.. వెంకటేశ్వరపల్లి  మండలంలో దెబ్బతిన్న రోడ్లకు ఎప్పుడు రిపేర్​ చేస్తారని నిలదీశారు.  తాజాగా ఆదివారం కరీంనగర్​జిల్లాలో గుండ్లపల్లి నుంచి గన్నేరువరం వరకు  రోడ్డు నిర్మించాలంటూ మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయిని, వికారాబాద్​ జిల్లా పరిగిలో ఎర్రగడ్డపల్లి– సుల్తాన్​నగర్​రోడ్డును బాగుచేయాలంటూ ఎమ్మెల్యే మహేశ్​రెడ్డిని స్థానికులు చుట్టుముట్టి నిరసన తెలిపారు. రోడ్ల కోసం పబ్లిక్​ నుంచి  డిమాండ్లు పెరుగుతుండడంతో ఎమ్మెల్యేలు తలపట్టుకుంటున్నారు.  ఎన్నిసార్లు ప్రపోజల్స్​ పెట్టినా సర్కారు ఫండ్స్​ ఇస్తలేదని, రోడ్లు వెయ్యకపోతే ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని, ఈ పరిస్థితుల్లో తమకు ఏం చేయాలో తోచట్లేదని సన్నిహితుల వద్ద వాపోతున్నారు.  

శంకుస్థాపన చేసి ఐదేండ్లయినా..!

కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామం నుంచి  ఇరుకుల్ల  వయా ఎలబోతారం గ్రామాల మధ్య సుమారు ఆరు కిలో మీటర్ల రోడ్డు నిర్మాణానికి 2017  లో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్  శంకుస్థాపన చేశారు. దాదాపుగా ఐదేండ్లు గడిచినా పనులు చేపట్టలేదు.

మంత్రి మాట ఇచ్చినా రోడ్డు మాత్రం కాలే.. 

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ నుంచి హసన్​పర్తి మండలాన్ని కలిపే 1.5 కిలోమీటర్ల రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో సెప్టెంబర్ 21న ఎల్కతుర్తి మండలానికి వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, ఎమ్మెల్యే సతీశ్​బాబును  వివిధ గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. రోడ్డు బాగుచేయాలని డిమాండ్​ చేయగా..  ‘గుంటూరుపల్లిలో ఓట్లు ఎన్ని ఉన్నయ్​..? అందరూ యూనిటీగా ఉంటరా..? కమ్మలు మాట ఇస్తే తప్పరు’ అంటూనే 15 రోజుల్లో రోడ్లు బాగు చేస్తామని హామీ ఇచ్చారు. రెండు నెలలవుతున్నా ఇంతవరకు తట్టెడు మట్టి కూడా పోయలేదు.

తెలంగాణ వచ్చినా మా ఊరికి రోడ్డు రాలే

మా ఊరికి ఇప్పటికీ రోడ్డు లేదు. ఎన్నో ఏండ్లుగా కష్టాలు పడ్తున్నం.  వాన వచ్చిందంటే నరకం అనుభవిస్తున్నం. తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఊరికి రోడ్డు వస్తదని లీడర్లు చెప్పిన్రు. కానీ తెలంగాణ వచ్చి 8 ఏండ్లు అయిపోయింది. మా ఊరికి మాత్రం రోడ్డు రాలేదు. 

- కొమురం శంబు, సాకిరేవు గ్రామం, 
పెంబి మండలం, నిర్మల్​ జిల్లా

రోడ్డు బాగాలేదని పిల్లనిస్తలేరు

నవాపేట-  అనంతారం గ్రామాల నడుమ రోడ్డు బాగాలేక ఈ రూట్​లోని గ్రామాల యువకులకు పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకువస్తలేరు. కనీసం ఆటోలు కూడా తిరగలేని పరిస్థితి. రోడ్డు సక్కగ లేక కొన్నేండ్ల  నుంచి తరచూ యాక్సిడెంట్లు అయితున్నయ్​.  

 -అశోక్​రెడ్డి, 
   సర్పంచ్​, నవాపేట, మెదక్ జిల్లా

అంబులెన్స్​లు కూడా వస్తలే.. 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మా ఊరికి వచ్చినప్పుడు  తిమ్మాపూర్–సీతంపేట రోడ్డు గురించి అడిగితే 15 రోజుల్లో వేయిస్తమని మంత్రి చెప్పి పోయిండు.రెండు నెలలైనా ఎవరూ పట్టించుకోట్లేదు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో అంబులెన్స్​లు రావాలన్నా ఇబ్బందైతున్నది. స్కూల్​ వ్యాన్లు, ఆర్టీసీ బస్సులు నడుస్తలేవు. ఎమర్జెన్సీలో  ఆటోలు ఎక్కుతున్నం. 

-  రాజుల చంద్రయ్య, 
   తిమ్మాపూర్, హనుమకొండ జిల్లా

కలెక్టర్​ ఆదేశించినా...​

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని  నిమ్మగూడెం నుంచి సింగంపల్లి వరకు 16 కిలోమీటర్ల బీటీ రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయింది. చాలా చోట్ల గుంతలమయమైంది. రోడ్డు బాగాలేకపోవడంతో ఆర్టీసీ బస్సులు బంద్​ పెట్టారు. ఆటోలు అతి కష్టం మీద వెళ్తున్నాయి. నాలుగు నెలల క్రితం జిల్లా కలెక్టర్ 
ఈ రోడ్డును పరిశీలించి వెంటనే రిపేర్లు చేయించాలని ఆదేశించారు. అయినప్పటికీ సంబంధిత శాఖ ఆఫీసర్ల లో చలనం రాలేదు. కొన్నిచోట్ల వెహికల్స్ వెళ్లలేని పరిస్థితి ఉండటంతో కాలినడకన  గమ్యం చేరుకుంటున్నారు.