తెలంగాణ అసెంబ్లీ నాలుగు రోజులు..

తెలంగాణ అసెంబ్లీ నాలుగు రోజులు..
  • నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం
  • రేపు బడ్జెట్.. 13న ముగియనున్న సమావేశాలు​

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజుల పాటు నిర్వహించాలని బిజినెస్ అడ్వై జరీ కమిటీ (బీఏసీ) నిర్ణయించింది. గురువారం మధ్యాహ్నం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్​లో కమిటీ సమావేశమైంది. శుక్రవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తూ సభలో తీర్మానం ప్రవేశపెడ్తారు. దానిపై చర్చించిన తర్వాత సభ వాయిదా వేస్తారు. శనివారం అసెంబ్లీ, కౌన్సిల్​లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడ్తారు. సోమవారం బడ్జెట్​పై సాధారణ చర్చ నిర్వహిస్తారు. మంగళవారం బడ్జెట్​పై సాధారణ చర్చకు సమాధానమిస్తారు. మూడు నెలల కాలానికి ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత సభను వాయిదా వేస్తారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివ రావు పాల్గొన్నారు. తర్వాత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన మండలి బీఏసీ సమావేశం నిర్వహించారు. నాలుగు రోజుల పాటు మండలి సమావేశాలు నిర్వహించాలని సభ్యులు నిర్ణయించారు. ఈ సమావేశంలో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి (కాంగ్రెస్), మహమూద్​అలీ (బీఆర్ఎస్), మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండీ (ఎంఐఎం), ఏవీఎన్ రెడ్డి (బీజేపీ) పాల్గొన్నారు.

ప్రతిపక్ష నేతను అవమానిస్తున్నరు: బీఆర్ఎస్

అసెంబ్లీలో సభా నాయకుడికి ఎంత గౌరవం ఉం టుందో ప్రధాన ప్రతిపక్ష నేతకూ అంతే రెస్పెక్ట్ ఇస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. 39 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ పక్ష నాయకుడికి ఆ గౌరవం దక్కడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్​కు వివరించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ప్రసాద్ కుమార్​ను కలిశారు. ఇన్నర్ లాబీలోని ఎల్వోపీ ఆఫీస్​ను ఔటర్ లాబీకి ఎందుకు మార్చుతున్నారని ప్రశ్నించారు. ఇన్నర్ లాబీలో ఎంత స్పేస్ ఉందో.. అంతే స్థలం ఔటర్ లాబీలోనూ సమకూర్చుతామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. ఎల్వోపీకి ఒక గది, బీఆర్ఎస్​ఎల్పీకి మరో గది కేటాయించడం అవమానించడమేనని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎల్వోపీకి ఇన్నర్ లాబీలోనే చాంబర్ ఉండేదని, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అదే సంప్రదాయం కొనసాగిందని గుర్తు చేశారు. 

రెండో సెషన్​లో మార్చేసిన లాబీ

అసెంబ్లీ మొదటి సమావేశాల్లో కేటాయించిన చాంబర్​ను రెండో సెషన్​కు వచ్చే సరికి మార్చేశారని, దానిలోనూ సరైన సౌకర్యాలు లేవని తెలిపారు. చాంబర్​ను మారుస్తూ తమకు ఇచ్చిన ప్రతిపాదనల్లో ఎల్వోపీ చాంబర్ కోసం ఒక స్కెచ్ ఇచ్చారని, దానికి భిన్నంగా ఒక్క గది కేటాయించడం సరికాదన్నారు. స్పీకర్​స్పందిస్తూ.. వచ్చే సెషన్​ వరకు ఎల్వోపీకి తగిన చాంబర్ కేటాయిస్తానని హామీ ఇచ్చారు. గెలిచిన ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ ఇవ్వడం లేదని, ఓడిపోయిన కాంగ్రెస్ లీడర్లకు పోలీసులు ఎస్కార్ట్ ఇస్తూ తమను విస్మరిస్తున్నారని స్పీకర్​కు వివరించారు. వారితోనే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పథకాల పంపిణీ చేయిస్తున్నారని ఎమ్మెల్యేలు స్పీకర్​కు ఫిర్యాదు చేశారు. సీఎస్, డీజీపీని పిలిపించి ప్రొటోకాల్​సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు.