ఎర్రబెల్లిపై కొత్త లొల్లి..: మంత్రి పేరుతో పోలీసుల అరాచకాలు!

ఎర్రబెల్లిపై కొత్త లొల్లి..: మంత్రి పేరుతో పోలీసుల అరాచకాలు!
  •  బీఆర్ఎస్ హయాంలో మంత్రి పేరుతో పోలీసుల అరాచకాలు! 
  •  ఏసీపీ ఉమా మహేశ్వర్ రావు, డీసీపీ రాధాకిషన్ రావు పై సీఎంకు ఫిర్యాదు
  •  బెదిరించి దయాకర్ రావు బంధువు పేరిట ఇంటి రిజిస్ట్రేషన్
  •  రెండు రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలు 
  •  ఆన్ లైన్ లో కంప్లయింట్ చేసిన బాధితుడు శరణ్​ చౌదరి

హైదరాబాద్: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.  ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్సైబీ అధికారులపై కేసులు నమోదు కావడంతో వారి అక్రమాల డొంక కదులుతోంది. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీసీపీ రాధాకిషన్ రావుపై మరో ఫిర్యాదు వచ్చింది. మాజీ మంత్రి ఎర్రబెల్లికి ఫేవర్ చేసేందుకు ఓ వ్యక్తిని చిత్రహింసలకు గురిచేశారని సీఎం రేవంత్ రెడ్డికి, డీజీపీకి కంప్లయింట్ వెళ్లింది.  ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆఫీసుకు, డీజీపీ కార్యాలయానికి  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్​ చౌదరి ఆన్ లైన్ లో చేసిన కంప్లయింట్ చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు తనపై చిత్ర హింసలకు గురి చేశారని, తాను అక్రమంగా డిపాజిట్లు సేకరించానని పేర్కొంటూ తనపై కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేశారని, బంజారాహిల్స్ కు చెందిన వ్యాపారి శరణ్​ చౌదరి సీఎంకు, డీజీపీకి దుబాయ్ నుంచి ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. 

దీనికితోడు ఒక వీడియో కూడా విడుదల చేయడం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నపుడు ఏసీపీ ఉమా మహేశ్వర్ రావు, డీసీపీ రాధాకిషన్ రావు  తనను అక్రమంగా నిర్భంధించి అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువు పేరిట తన ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించారని, మరో 50 లక్షల నగదునూ తీసుకున్నారని శరణ్​ చౌదరి చెబుతున్నారు.  గతేడాది ఆగస్టు 21న ఆఫీసుకు వెళ్తుండగా సివిల్ దుస్తుల్లో వచ్చిన కొందరు వ్యక్తులు అడ్డుకొని సీసీఎస్ కు తరలించారని చెప్పారు.  తాను పలువురి నుంచి అక్రమంగా డిపాజిట్లు తీసుకొన్నానని ఉమా మహేశ్వరరావు బెదిరించారని తెలిపారు. అప్పటి మంత్రి ఎర్రబెల్లి, డీసీపీ రాధాకిషన్ రావు సూచనల మేరకు కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  బలవంతంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువు విజయ్ పేరు మీద ఇల్లును రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలిపారు. 

రెండు రోజులపాటు అక్రమంగా నిర్భంధించి రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని అన్నారు. తన స్నేహితుడు రూ. 50 లక్షలు ఇస్తేనే వదిలి పెట్టారని అన్నారు. దీనిపై తాను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా.. ఏసీపీ ఉమామహేశ్వరరావు ఎంటరై.. బెదిరించి పిటిషన్ ఉపసంహరించుకునేలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో అలెర్టయిన పోలీసులు శరణ్  చౌదరికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను తెప్పించుకొని కేసు నమోదు చేసేందుకు  సిద్ధమవుతున్నారు.

Also Read: 20 లక్షల ఎకరాల పంట ఎండిపోయింది