రాజ్యసభ సీట్లపై వ్యాపారవేత్తల కన్ను

రాజ్యసభ సీట్లపై వ్యాపారవేత్తల కన్ను

టీఆర్ఎస్ నుంచి బరిలో దిగేందుకు క్యూ
ఉన్న సీట్లు రెండు.. ఆశలుపెట్టుకున్నోళ్లు మెండు
కేసీఆర్, కేటీఆర్ ద్వారా లాబీయింగ్
రేసులో మైహోం రామేశ్వర్​రావు, దామోదర్ రావు, హెటిరో పార్థసారథిరెడ్డి, ప్రవీణ్ రెడ్డి
మాజీ ఎంపీలు కవిత, బోయినపల్లి వినోద్, పొంగులేటి ప్రయత్నాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ సీట్లను టీఆర్​ఎస్ తరఫున దక్కించుకునేందుకు వ్యాపారవేత్తలు, రియల్టర్లు పోటీ పడుతున్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ పెద్దలతో అత్యంత సన్నిహితంగా ఉంటున్న వీరంతా రాజ్యసభలో అడుగుపెట్టాలని కలలు కంటున్నారు. కొందరు సీఎం కేసీఆర్ ద్వారా .. మరికొందరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ గడువు మార్చి 13తో ముగియనుంది. నామినేషన్ల స్వీకరణ గడువుకు ముందురోజు అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం మేరకు రెండు సీట్లను టీఆర్ఎస్ గెలుచుకోనుంది. దీంతో ఎలాగైనా తమకు అభ్యర్థిత్వం ఇవ్వాలని వ్యాపారులు, రియల్టర్లు, బిల్డర్లు టీఆర్​ఎస్ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. అయితే.. ఈ రెండు స్థానాల్లో ఒకటి పార్టీలోని నేతకు.. మరొకటి బయటి వ్యక్తులకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఇద్దరు వెలమ బిజినెస్ మెన్లు
​టీఆర్ఎస్ పెద్దలకు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఇద్దరు వెలమ బిజినెస్ పర్సన్స్ మైహోం రామేశ్వరరావు, దీవకొండ దామోదర్ రావు రాజ్యసభకు వెళ్లేందుకు ట్రై చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరు ఇప్పటికే టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నారు. ఈ దఫా రాజ్యసభ ఎన్నికల్లో తమకు చాన్స్ ఉంటుందని వాళ్లు ధీమాగా ఉన్నట్టు పార్టీ నేతలు చెపుతున్నారు. ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ పార్టీలో దామోదర్ రావు పనిచేస్తున్నారు. తొలి ప్రభుత్వంలో ఆయన్ను రాజ్యసభకు పంపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ ఆయనకు అవకాశం ఇవ్వకుండా.. పార్టీ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ రావును రాజ్యసభకు పంపించారు. దీంతో దామోదర్ రావు మనస్తాపానికి గురైనట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే.. ఈ మధ్య సీఎం కేసీఆర్​ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన వెంట దామోదర్​రావు కూడా ఉన్నారు. దీంతో దామోదర్​రావును రాజ్యసభకు పంపించేందుకే కేసీఆర్ తన వెంట తీసుకెళ్లారని చర్చ జరుగుతోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ పెద్దలతో క్లోజ్ రిలేషన్స్ మెయింటెన్ చేస్తున్న మైహోం రామేశ్వరరావు కూడా రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఈ దఫా ఎలాగైన తనకు చాన్స్ ఇవ్వాలని ఆయన అడుగుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే వెలమ కులానికి చెందిన జోగినిపల్లి సంతోష్ కుమార్ టీఆర్​ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. లోక్ సభ ఎలక్షన్స్‌లో ఓడిపోయిన వెలమ నేతలు, మాజీ ఎంపీలు కవిత, బోయినిపల్లి వినోద్ కుమార్ కూడా రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో వెలమ కులానికి చెందిన లీడర్లు, వ్యాపారుల మధ్యే పోటీ ఎక్కువగా నెలకొందన్న కామెంట్స్ పార్టీ కేడర్​ నుంచి వస్తున్నాయి.

పొంగులేటినా.. పార్థసారథా?
లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ సీటు ఇవ్వనందుకు బదులుగా ఈసారి రాజ్యసభ సీటు తనకు వస్తుందనే ధీమాలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. కానీ ఆయనకు చెక్ పెట్టేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు నేతలు పొంగులేటిని ఎంపీగా చేస్తే జిల్లాలో వర్గ పోరు మొదలవుతుందంటూ కేటీఆర్ వద్ద అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పొంగులేటికి చెక్ పెట్టేందుకు జిల్లాకు చెందిన హెటిరో ఫార్మా అధినేత పార్థసారథిరెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నట్లు సమాచారం. కేటీఆర్​ వద్దకు పార్థసారథిని అజయ్, నామా తీసుకెళ్లినట్లు ప్రచారంలో ఉంది.

రేసులో కేటీఆర్ ఫ్రెండ్!
మంత్రి కేటీఆర్ క్లోజ్ ఫ్రెండ్, బెంగుళూరు రియల్టర్ కంబాల ప్రవీణ్ రెడ్డి రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. కేటీఆర్ ద్వారా ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. 2014లో మెదక్ నుంచి ఎంపీగా గెలిచిన కేసీఆర్ అటు తర్వాత ఆ పదవికి రాజీనామా చేయడంతో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఆ సమయంలోనే టీఆర్​ఎస్ అభ్యర్థిగా ప్రవీణ్ రెడ్డిని బరిలోకి దించాలని కేటీఆర్ ట్రై చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ పలు కారణాలతో అది ఆగిపోయింది.

తమ పరిస్థితి ఏందంటున్న ఎస్సీ , ఎస్టీ, మైనార్టీలు
రాజ్యసభ ఎంపీలుగా ఈ సారి తమకు చాన్స్ ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కమ్యూనిటీల నుంచి టీఆర్​ఎస్ తరఫున రాజ్యసభలో ఎవరూ లేరు. గత ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ సమయంలో కూడా తమకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న ఆవేదనలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు ఉన్నారు. రెండోసారి ప్రభుత్వం వచ్చాక గాదరి బాలమల్లుకు మాత్రమే కార్పొరేషన్ చైర్మన్ పదవిని తిరిగిచ్చి , మిగతా వారికి చాన్స్ ఇవ్వలేదు. ఈ మధ్య ఆర్టీఐ కమిషన్‌గా శంకర్ నాయక్‌ను నియమించారు. ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ నేతలనే రాజ్యసభకు పంపాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ కమ్యూనిటీలో రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్న వారిలో మాజీ ఎంపీ మందా జగన్నాథం, గుడిమల్ల రవి కుమార్, సీతారాం నాయక్, సలీం ఉన్నారు.

కేకే కు చాన్స్?
ఎన్నికలు జరిగే రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి కే.కేశవరావుకు దక్కే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుతం ఏపీ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేకే.. ఏప్రిల్ 9న రిటైర్ట్ కానున్నారు. మరోసారి ఆయన్ను రాజ్యసభకు పంపుతానని సీఎం కేసీఆర్ హామిచ్చినట్టు ప్రచారంలో ఉంది.

పార్టీ నేతల్లో కలవరం
రాజ్యసభ సీట్లపై బిజినెస్ పర్సన్స్ కన్నేశారని తెలియడంతో వాటిని ఆశిస్తున్న టీఆర్​ఎస్ నేతల్లో కలవరం మొదలైంది. తమ చాన్స్‌ను తన్నుకుపోతారని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. పార్టీలోని నేతలకు ప్రయార్టీ ఇవ్వకుండా బయటి వారికి అవకాశమిస్తే పార్టీకి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని ఓ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో రాజకీయాలతో సంబంధం లేని వారికి టికెట్లిచ్చి అబాసుపాలయ్యారని ఆయన చెప్పారు.

For More News..

నాకు కేసీఆర్ నుంచి ప్రాణహాని ఉంది

కరోనా ఎఫెక్ట్: ఒక్కో మాస్క్ రూ. 4 లక్షలు

మూడు విడతల్లో డిగ్రీ అడ్మిషన్లు

ఎడ్యుకేషన్‌‌కు ఫుల్లు పైసల్‌‌