వన్ ప్లస్ వన్ భోజనం ఆఫర్ : క్లిక్ చేస్తే రూ.90 వేలు మాయం..

వన్ ప్లస్ వన్ భోజనం ఆఫర్ : క్లిక్ చేస్తే రూ.90 వేలు మాయం..

'ఒక థాలీ కొనండి, మరొకటి ఉచితంగా పొందండి' అనే మోసపూరిత యాప్‌ను డౌన్‌లోడ్ చేయడంతో ఓ మహిళ రూ.90వేలు కోల్పోయింది. అనంతరం ఆ బాధితురాలు సవితా శర్మ సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ సంఘటన గురించి వివరిస్తూ, శర్మ తన బంధువులలో ఒకరు ఫేస్‌బుక్‌లో ఈ ఆఫర్ గురించి తనకు తెలియజేసినట్లు పోలీసులకు చెప్పారు. ఆమె ఓ బ్యాంకులో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. ఆమె నవంబర్ 27, 2022న సైట్‌ను సందర్శించి, డీల్ గురించి విచారణ చేయడానికి ఇచ్చిన నంబర్‌కు కాల్ చేసింది.

ఆమెకు ఎటువంటి స్పందన రాలేదు కానీ ఓ మాత్రం కాల్ వచ్చింది. "కాలర్ ఆమెను సాగర్ రత్న ఆఫర్ (ఓ రెస్టారెంట్ లో ప్రత్యేక ఆఫర్) పొందమని అడిగాడు" అని శర్మ ఈ ఏడాది మే 2న నమోదు చేసిన తన FIRలో పేర్కొన్నారు. ఆ తర్వాత కాలర్ ఓ లింక్‌ను షేర్ చేసి, ఆఫర్‌ని పొందడానికి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయమని అడిగారు. యాప్‌ను యాక్సెస్ చేసేందుకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కూడా పంపాడు. నేను ఆఫర్ పొందాలనుకుంటే, నేను ముందుగా ఈ యాప్‌లో నమోదు చేసుకోవాలని అతను నాకు చెప్పాడు, ”అని శర్మ చెప్పారు.

“నేను లింక్‌పై క్లిక్ చేసాను. అలా యాప్ డౌన్‌లోడ్ అయింది. అప్పుడు నేను యూజర్ ID, పాస్వర్డ్ ను నమోదు చేసాను. ఆ క్షణమే నా ఫోన్‌పై నేను నియంత్రణ కోల్పోయాను. అది హ్యాక్ అయింది. ఆ తర్వాత నా ఖాతా నుండి రూ. 40వేలు డెబిట్ అయినట్లు నాకు మెసేజ్ వచ్చింది. కొన్ని సెకన్ల తర్వాత తన ఖాతా నుంచి రూ.50వేలు డ్రా అయినట్లు మరో మెసేజ్ వచ్చిందని శర్మ తెలిపారు.

“నా క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బు నా Paytm ఖాతాకు వెళ్లి మోసగాడి ఖాతాకు వెళ్లడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నేను ఈ వివరాలను కాలర్‌తో ఎప్పుడూ పంచుకోలేదు, ”అని శర్మ పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె వెంటనే తన క్రెడిట్ కార్డ్‌ను బ్లాక్ చేసింది. సైబర్ పోలీసులు ఈ విషయంపై విచారణ జరుపుతున్నప్పటికీ, ఇతర నగరాల్లోనూ ఇలాంటి మోసాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి, వేలాది రూపాయలు పోగొట్టుకున్నారు కూడా.

సాగర్ రత్న ప్రతినిధిని సంప్రదించినప్పుడు, కస్టమర్ల నుంచి తమకు చాలా ఫిర్యాదులు అందాయని అంగీకరించారు. “మా రెస్టారెంట్ పేరుతో లాభదాయకమైన ఆఫర్‌లను ప్రకటించి ఎవరైనా మోసం చేశారని ఫిర్యాదు చేసినట్టు మాకు చాలా కాల్స్ వచ్చాయి. మేము ఫేస్‌బుక్ ద్వారా ప్రజలకు ఎప్పుడూ ఆఫర్‌లు చేయనందున అటువంటి లాభదాయకమైన ఒప్పందం పట్ల అప్రమత్తంగా ఉండాలని మేము ప్రజలను హెచ్చరించాము”అని ప్రతినిధి చెప్పారు. ఇతర నగరాల్లోని సైబర్ పోలీసులు కూడా ఇదే విషయాన్ని పరిశీలిస్తున్నారు.

ఇలాంటి మోసపూరిత ఆఫర్‌ల వెబ్ లింక్స్ ఇప్పటికీ వాట్సాప్ ద్వారా ప్రజలలో తిరుగుతున్నాయని, సకాలంలో చర్యలు తీసుకోకపోతే, ఇంకా చాలా మంది దీని బారిన పడే అవకాశం ఉందని శర్మ చెప్పారు. ఎలాంటి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని, తెలియని సైట్స్ వచ్చే లింక్‌పై క్లిక్ చేయవద్దని సామాన్యులకు అవగాహన కల్పిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. “సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి కొత్త మార్గాలను రూపొందిస్తున్నారు. తెలియని లేదా గుర్తించబడని సైట్స్ నుంచి వచ్చిన లింక్‌లు లేదా యాప్‌లను ప్రజలు క్లిక్ చేయకూడదు” అని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ చెప్పారు.