ఫోన్​ కొంటే.. కార్​, ఫ్లాట్ గెలుచుకోవచ్చు!

ఫోన్​ కొంటే.. కార్​, ఫ్లాట్ గెలుచుకోవచ్చు!
  • ఆన్​లైన్​ పోటీ తట్టుకోవడానికి మొబైల్​ స్టోర్ల పండుగ ఆఫర్లు

వెలుగు బిజినెస్​ డెస్క్​: పండగల సీజన్​లో మొబైల్​ ఫోన్​ కొనండి... కారో లేదా ఫ్లాటో​ గెలుచుకోండి... మొబైల్ ఫోన్లు అమ్మే షాపుల ఆఫర్లు ఇలా ఉంటున్నాయి.  అమ్మకాలు లేకపోవడంతో మొబైల్​ షాపుల యజమానులు ఈ పండగ సీజన్​లో ఎలాగైనా కస్టమర్లను ఆకట్టుకోవాలని రకరకాల ఆఫర్లు ముందుకు తెస్తున్నారు. ఆన్​లైన్​ కంపెనీలతో పోటీ తట్టుకుని నిలబడేందుకు గిఫ్ట్​ ఓచర్లు, జిమ్​ మెంబర్​షిప్​లు, ఫ్రీ కాస్మెటిక్​ లేజర్​ ట్రీట్​మెంట్​, ఫ్రీ కార్​ సర్వీస్​ లాంటి ఆఫర్లు చేస్తున్నారు. కరోనా మూడో వేవ్​ భయంతోనే కొన్ని పెద్ద ఆఫర్లూ తెస్తున్నారు. మూడో వేవ్​ వస్తే ఎక్కువ మంది కస్టమర్లు ఆన్​లైన్​ చానెల్స్​లోనే కొంటారని వారు భయపడుతున్నారు. అహ్మదాబాద్​లోని మొబైల్​ రిటెయిల్​ షాపుల వాళ్లందరూ కలిసి డబ్బు పోగేసి, రూ. 25 లక్షల లక్కీ డ్రా ప్రైజును ప్రకటించారు. అంతేకాదు, వారు సేలన్లు, జిమ్​లతో టై అప్​ పెట్టుకున్నారు. షాపులో కొనే కస్టమర్లకు 8 నుంచి 10 ఓచర్లుండే ఒక ఎన్వెలప్​ కవర్​ను ఇస్తారు. కార్​ వాష్​ సర్వీస్​, పార్లర్​లో లేజర్​ రిమూవల్​, ఒక నెల ఫ్రీ జిమ్​ మెంబర్​ షిప్​ వంటి ఆఫర్లు అందులో ఉంటాయని ఆల్​ ఇండియా మొబైల్​ రిటెయిలర్స్​ అసోసియేషన్​ ఆఫ్​ గుజరాత్​ప్రెసిడెంట్​ నికుంజ్​ పటేల్​ చెప్పారు. పటేల్​కు ఫోన్​బుక్​ పేరుతో మొత్తం 45 రిటెయిల్​ స్టోర్లున్నాయి. తాము ఇచ్చే ఆఫర్లతో బిజినెస్​ పెరుగుతుందని ఆయన ఆశిస్తున్నారు. కొత్తగా లాంఛైన కొన్ని ఫోన్లను ఆన్​లైన్​లో కొందామనుకున్న కస్టమర్లు కూడా ఈ ఆఫర్లకు ఆకర్షితమై తమ షాపులకు వచ్చినట్లు పటేల్​ పేర్కొన్నారు.

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే స్మార్ట్‌‌ఫోన్లు..

కరోనా రాకతో మొబైల్ ఫోన్ల ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ అమ్మకాలు ఇంచుమించుగా సమానమయిపోయాయి. చాలా మంది కస్టమర్లు తప్పనిసరి పరిస్థితులలో ఆన్​లైన్​లో కొనడానికి మారాల్సి వచ్చింది. దాంతో రెండు ఛానెళ్ల సేల్స్​ ఒకే స్థాయికి చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్​–జూన్​ క్వార్టర్లో మొబైల్​ఫోన్ల అమ్మకాలు ఎక్కువగా ఆన్​లైన్​లోనే జరిగినట్లు ఐడీసీ ఇటీవలే తన రిపోర్టులో వెల్లడించింది. దాంతో ఆన్​లైన్​ అమ్మకాల వాటా 51 శాతానికి చేరింది. అంతకు ముందుతో పోలిస్తే ఆన్​లైన్​ అమ్మకాలు ఏకంగా 113 శాతం పెరిగినట్లు. 2019 ఏప్రిల్​–జూన్​ క్వార్టర్లో చూస్తే స్మార్ట్​ఫోన్​ సేల్స్​లో ఆన్​లైన్​ వాటా 37 శాతమైతే, రిటెయిల్​ షాపుల సేల్స్​ వాటా 63 శాతంగా ఉండేదని ఐడీసీ రిపోర్టు పేర్కొంది. గతంలో ఆఫర్లతో ఊదరగొట్టిన ఆన్​లైన్​ ఛానెల్స్​ను అలాంటి ఆఫర్లతోనే దెబ్బకొట్టాలని మొబైల్​ ఫోన్ల రిటెయిలర్లు కొన్ని గంటలలోనే  హోమ్​ డెలివరీ వంటి సర్వీసులతో ప్లాన్​ చేస్తున్నారు. ఏప్రిల్​–జూన్​ క్వార్టర్లో మొబైల్ ఫోన్లకు డిమాండ్​ కొంత తగ్గినప్పటికీ, ఆ తర్వాత కొంత పుంజుకుంది. సేల్స్​ ఎలా ఉండబోతున్నాయనే అంచనాలకు దీపావళి పండగ ముందు నెలల్లోని అమ్మకాలే ఆధారంగా నిలుస్తాయి. పండగ సీజన్​లో ప్రతిసారి ఆఫర్లు ఉంటాయని, కాకపోతే ఈ సారి మరింత ఎక్కువగా ఆఫర్లు ఉన్నాయని రిటెయిలర్లు చెబుతున్నారు. ఏడాది మొత్తంలో సాగే మొబైల్​ ఫోన్ల అమ్మకాలలో మూడో వంతు పండగ సీజన్​లోనే జరగడం దీనికి రుజువంటున్నారు.

భవిష్యత్‌లో ఇలాంటి ఆఫర్లు హైదరాబాద్‌లోనూ..!

మహారాష్ట్రలోని రిటెయిలర్లు కూడా మంచి ఆఫర్లు ప్లాన్​ చేస్తున్నారని, లక్కీ డ్రా విన్నర్​ ఒక ఫ్లాట్​ లేదా ఒక కారు గెలుచుకోవచ్చని ఏఐఎంఆర్​ఏ ప్రెసిడెంట్​ అజిత్​ జగ్​తాప్​ చెప్పారు. మాకు వెబ్​సైట్లు లేవు. రిటెయిలర్లంతా కలిసి జమ చేసే మొత్తాన్నిబట్టే అడ్వర్టయిజ్​మెంట్లు కూడా ఉంటాయి. కానీ, కస్టమర్లు రోజంతా ఫోన్లలో ఆన్​లైన్​ ఆఫర్లను చూస్తూ, తమకు కావాల్సిన వాటిని ఎంపిక చేసుకుంటున్నారని ఉత్తరప్రదేశ్​లోని మొబైల్​ రిటెయిలర్​ ఒకరు చెప్పారు. ఇలాంటి ఆఫర్లు హైదరాబాద్​లో ఇంకా తేకపోయినా, తెచ్చే అవకాశాలను తోసిపుచ్చలేము. ఈ పండగల సీజన్లో అమ్మకాలు పెంచుకోవడానికి మన రాష్ట్రంలోని మొబైల్​ స్టోర్లు కూడా ఊరించే ఆఫర్లు తెస్తాయని ఆశించొచ్చు.