- ఆకాశాన్నంటుతున్న భూముల రేట్లు.. పెరగని జీతాలు
- ముంబైలో కొనాలంటే 109 ఏండ్లు పొదుపు చేయాలి
న్యూఢిల్లీ: ఇల్లు కొనుక్కోవాలనే మిడిల్ క్లాస్ డ్రీమ్ కలగానే మిగిలిపోతోంది. లక్షలాది మధ్యతరగతి కుటుంబాలు సొంతింటిని కొనుక్కోవడంలో ఇబ్బందులు పడుతున్నాయి. ఒకవైపు ల్యాండ్ రేట్లు చుక్కలంటుతున్నాయి. కానీ, ఉద్యోగులు జీతాల్లో మాత్రం పెద్దగా కదలిక లేదు. హోమ్ లోన్ల సైజ్ పెరుగుతుండడంతో సొంతింటి కల నెరవేరుతుందా? అనే సందేహాలు ఎక్కువయ్యాయి.
“మధ్యతరగతికి సొంతింటి కల ఉండడం సహజం. కానీ నెంబర్లు మాత్రం డిఫరెంట్ స్టోరీ చెబుతున్నాయి” అని ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్ సంజయ్ కతురియా అన్నారు. “ఉద్యోగాల సాలరీలో గ్రోత్ లేదు. కాలేజీ డిగ్రీలు ఉన్నా జాబ్స్ దొరకడం లేదు’’ అని అన్నారు.
ఏళ్లకు ఏళ్లు ఆదా చేసినా..
ముంబైలో సాధారణ ఇంటి కోసం మధ్యతరగతి కుటుంబం 109 ఏళ్లు పొదుపు చేయాలి. అదే గురుగ్రామ్‌లో 64 ఏళ్లు, కోల్‌కతా, హైదరాబాద్‌లలో 39 ఏళ్లు, బెంగళూరులో 36 ఏళ్లు ఆదా చేయాలి. ఈ లెక్కల కోసం కుటుంబం సగటు వార్షిక ఆదాయం రూ.10.7 లక్షలుగా, పొదుపు రూ.3.2 లక్షలుగా, ప్రధాన నగరాల్లో ఇంటి ధర సగటున రూ.3.54 కోట్లుగా ఉంటుందని లెక్కించారు.
“ప్రస్తుత ధరల దగ్గర ముంబైలో అతి సాధారణ ఇంటిని కొనడానికి కూడా టాప్ 5 శాతం ఆదాయ గ్రూప్‌లు వారసత్వ సంపద, డ్యూయల్ ఇన్‌కమ్ లేదా భారీ రుణాలపై ఆధారపడాల్సి వస్తోంది” అని కతురియా వివరించారు. ఉన్నత ఆదాయ వర్గాల కంటే దిగువన ఉన్నవారిని పరిగణనలోకి తీసుకుంటే, పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. 82శాతం పన్ను చెల్లింపుదారుల ఆదాయం సంవత్సరానికి రూ.10 లక్షల కంటే తక్కువ. ఇండిపెండెంట్ హౌస్‌కు చాలా మందికి కలగానే మిగిలిపోతోంది. గత పదేళ్లలో ల్యాండ్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఉద్యోగుల జీతాలు దాదాపు అదే స్థాయిలో ఉన్నాయి. ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన ఇంటి రుణాలు రూ.33.53 లక్షల కోట్లకు చేరాయి.
చాలామంది ఈఎంఐలు కట్టేందుకు 25–-30 ఏళ్ల టైమ్ పీరియడ్‌ను ఎంచుకుంటున్నారు. ఇంటి రుణాలను తీర్చడానికి సాధారణ ఉద్యోగికి 30 ఏళ్లు పడుతోందని కతురియా కామెంట్ చేశారు. కానీ ఉద్యోగం కోల్పోవడం, ఆరోగ్య సమస్య, వడ్డీ రేట్ల పెరుగుదల జరిగితే తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోక తప్పదని చెప్పారు. ఒకేసారి అన్ని వైపుల నుంచి ఆర్థిక ఒత్తిడి పెరిగితే మధ్యతరగతి కుటుంబాలు పెద్దగా పొదుపు చేసుకోలేవు. ఇంటి కోసం పొదుపు చేయడం ప్రస్తుతం గత 50 ఏళ్ల కనిష్టంలో ఉంది. ఆటోమేషన్‌తో చాలా మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. “ఇల్లు కొనడానికి జీతం పెరుగుదల, ప్రమోషన్‌పై ఆధారపడటం ఇక పనికిరాదు. మధ్యతరగతి స్థిర జీతాలు, పెరిగిన ఖర్చులు, ఉద్యోగ అనిశ్చితితో అన్ని వైపుల ఒత్తిడిలో ఉంది” అని కతురియా హెచ్చరించారు.
పరిష్కారం..
ఫైనాన్షియల్ ప్లానింగ్ జాగ్రత్తగా చేసుకోవాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. “ఎంటర్‌ప్రెన్యూర్‌లా ఆలోచించాలి. స్కిల్స్ పెంచుకోవాలి. అదనపు ఆదాయ మార్గాలను సృష్టించుకోవాలి” అని కతురియా సలహా ఇచ్చారు. మధ్యతరగతి కుటుంబాలు మారుతున్న ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలను తయారు చేసుకోవాలన్నారు.
