విమానాలు కొంటున్నరు.. వడ్లు ఎందుకు కొనరు?

 విమానాలు కొంటున్నరు.. వడ్లు ఎందుకు కొనరు?
  • కేంద్రానికి జగ్గారెడ్డి ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: దేశంలో యుద్ధం లేకున్నా యుద్ధ విమానాలు కొంటున్న కేంద్ర ప్రభుత్వం వడ్లు ఎందుకు కొనడం లేదని కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌‌‌‌ వద్ద ఆయన మాట్లాడారు. రోడ్ల మీద గుట్టలు గుట్టలుగా వడ్లు ఉన్నాయని, కొనుగోళ్లు లేక రైతులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యేలు, మంత్రులు కల్లాల్లోకి వెళ్లి వడ్లు కొనేలా చేయాలన్నారు. కొన్ని చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ల వడ్లే కొంటున్నారని ఆరోపించారు.

తడిసిన వడ్లు తౌడు లెక్క మారిపోయాయని, సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ వెంటనే వడ్ల కొనుగోలుకు ఆదేశాలివ్వాలన్నారు. వడ్ల కొనుగోలు పంచాయితీ యాసంగికి సంబంధించినదని, వాన కాలం పంట కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీలో ఉండటం వల్లే స్థానిక ప్రజాప్రతినిధులకు విలువ వచ్చిందన్నారు. 230 ఓట్ల కన్నా తమకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఉండిపోతానన్నారు.