
పారిస్: ఇండియా స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కఠిన సవాల్‌కు రెడీ అయ్యారు. సోమవారం మొదలయ్యే ఈ టోర్నీలో తొలి రౌండ్‌లో లక్ష్యసేన్.. టాప్ సీడ్ షి యు క్విని ఎదుర్కొనున్నాడు. ఒలింపిక్స్‌లో నాలుగో ప్లేస్‌తో సరిపెట్టుకున్న సేన్ ఫామ్ అంతంత మాత్రంగానే ఉంది. గాయాలు, నిలకడేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
2024 ఆల్ ఇంగ్లండ్‌లో క్వార్టర్స్‌కు చేరడం ఉత్తమ పెర్ఫామెన్స్. లి షి ఫెంగ్, కొడాయ్ నరోతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ సేన్ తడబడ్డాడు. వాళ్లు 3–1 లీడ్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో మూడు సూపర్–1000 టైటిళ్లతో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ఫెంగ్.. సేన్‌ను మూడుసార్లు ఓడించాడు. తొలి రౌండ్‌లో జొకిమ్ ఒల్డార్ఫ్ (ఫిన్లాండ్)తో తలపడనున్న ప్రణయ్.. రెండో రౌండ్‌లో వరల్డ్ రెండో ర్యాంకర్ అండెర్స్ అంటోన్‌సెన్ (డెన్మార్క్) నుంచి గట్టి పోటీ ఎదుర్కొనున్నాడు.
చైనా ఓపెన్‌లో చో టియాన్ చెన్‌పై అద్భుత విజయం సాధించిన ప్రణయ్ ఆ స్థాయిలో పెర్ఫామెన్స్ చూపెడితేనే ముందుకు వెళ్లగలడు. ఇక విమెన్స్ సింగిల్స్‌లో సింధు కూడా ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతోంది. చైనా ఓపెన్‌లో తనకంటే చిన్నదైన ఉన్నతి హుడా చేతిలో ఎదురైన పరాజయం నుంచి త్వరగా కోలుకోవాలి. ఐదు వరల్డ్‌చాంపియన్‌షిప్ పతకాలతో అత్యంత విజయవంతమైన ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన సింధు.. బల్గేరియాకు చెందిన కలోయాన నల్బంటోవాతో తొలి మ్యాచ్ ఆడుతుంది.
ఈ సీజన్‌లో ఇండియా ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరుకోవడం సింధు ఉత్తమ ప్రదర్శన. 15వ ర్యాంక్‌లో ఉన్న సింధు.. రెండో రౌండ్‌లో వరల్డ్ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా)తో తలపడే చాన్స్ ఉంది. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టికు తొలి రౌండ్ బై లభించింది. రెండో రౌండ్‌లో హరిహరన్–రూబెన్ కుమార్ లేదా లియు కుయాంగ్ హెంగ్–యాంగ్ పో హన్ (చైనీస్‌తైపీ)తో తలపడతారు.
ఈ రౌండ్‌ను దాటితే ఆరోన్ చియా–సోహ్ వుయ్‌యిక్ (మలేసియా)తో అమీతుమీ తేల్చుకుంటారు. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ నిలకడగా రాణిస్తుండటం కూడా కలిసొచ్చే అంశం. ఇండియా, సింగపూర్, చైనా ఓపెన్‌లో సెమీస్, ఇండోనేసియాలో క్వార్టర్స్ వరకు చేరుకున్నారు. మిక్స్‌డ్‌లో ధ్రువ్ కపిల–తానీషా క్రాస్టోకు తొలి రౌండ్ బై లభించగా, రోహన్ కపూర్–రుత్విక శివాని.. లియోంగ్ లోక్ చోంగ్–వెంగ్ చి ఎన్జీ (మకావ్)తో తలపడతారు. విమెన్స్ డబుల్స్‌లో ప్రియా–శ్రుతి మిశ్రా, రుతుపర్ణ–శ్వేతపర్ణ బరిలో ఉన్నారు.