జీఎస్టీ విధిస్తూ సామన్యులపై భారాన్ని మోపుతున్నరు

జీఎస్టీ విధిస్తూ సామన్యులపై భారాన్ని మోపుతున్నరు

ముషీరాబాద్ / గండిపేట/ షాద్​నగర్, వెలుగు: నిత్యావసరాలపై జీఎస్టీ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం సామన్యులపై భారాన్ని మోపుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఎక్కడ లేని ట్యాక్స్ లు వేస్తూ మధ్యతరగతి కుటుంబం బతకలేని స్థితికి తీసుకొస్తున్నారని ఆయన విమర్శించారు. పెరిగిన నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, జీఎస్టీ పెంపు, నిరుద్యోగం, అగ్నిపథ్ స్కీమ్ పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిపార్కులోని ధర్నా చౌక్‌‌‌‌‌‌ వద్ద నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు మద్దతుగా భట్టి విక్రమార్కతో పాటు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ మంత్రి చిన్నారెడ్డి,  ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజు, నదీమ్ జమీద్, రోహిత్ హజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో ఎన్నో ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేస్తే వాటిని ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో సామన్యులను ఇబ్బందులకు గురిచేస్తోందని మల్లు రవి అన్నారు. ధరలను తగ్గించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని చిన్నారెడ్డి విమర్శించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ 8 ఏండ్ల పాలనలో జనాలకు చేసిందేమీ లేదని ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తోన్న విధానాల వల్లే సామన్య జనం ఇబ్బందులు పడుతున్నారని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు.

అనంతరం ఇందిరా పార్క్ నుంచి రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరిన నేతలను పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి  ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ధర్నాలో కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు, ఎన్ ఎస్ యూఐ లీడర్ బల్మూరి వెంకట్,యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, సీనియర్ నాయకులు  సంగిశెట్టి జగదీష్, గౌరీ సతీష్, మహేశ్​ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజేంద్రనగర్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సెగ్మెంట్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ బొర్రా జ్ఞానేశ్వర్‌‌‌‌ ముదిరాజ్‌‌‌‌ ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఎ–బ్లాక్‌‌‌‌ అధ్యక్షుడు నవీన్, బి–బ్లాక్‌‌‌‌ అధ్యక్షుడు ఖలీద్, రాజేంద్రనగర్‌‌‌‌ డివిజన్‌‌‌‌ అధ్యక్షుడు బాల్‌‌‌‌రాజ్ పాల్గొన్నారు. షాద్​నగర్​ పట్టణంలో సెగ్మెంట్​ ఇన్​చార్జి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి.